కరూర్ తొక్కిసలాట: బాధితులను పరామర్శించిన అన్నామలై
గత నాలుగేళ్లలో ప్రజా సమావేశాల నియంత్రణలో రాష్ట్ర పాలన వైఫల్యాలను బయటపెట్టిన బీజేపీ మాజీ చీఫ్..
తమిళనాడు(Tamil Nadu) బీజేపీ(BJP) మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై (Annamalai) తొక్కిసలాట బాధితులను పరామర్శించారు. కరూర్ జిల్లా వేలుసామిపురంలో తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్ విజయ్ ఎన్నికల ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో 50 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన అన్నామలై.. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.
‘కలెక్టర్, ఎస్పీని సస్పెండ్ చేయాలి’
అనంతరం విలేఖరులతో మాట్లాడారు. విజయ్‌కు తొక్కిసలాటతో ఏ సంబంధమూ లేదని చెప్పిన అన్నామలై.. దానికి డీఎంకే ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. "అనుమతి ఇచ్చే ముందు బహిరంగ సభలు, వేదికలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. వేదికను ఓకే చేసిన కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి" అని డిమాండ్ చేశారు.
‘ ఆ ఘటనకు బాధ్యులెవరు..’
గత నాలుగు సంవత్సరాలుగా ప్రజా సమావేశాలను నియంత్రించడంలో పాలన వైఫల్యాలను అన్నామలై ఎత్తి చూపారు. గత సంవత్సరం చెన్నైలోని మెరీనా బీచ్‌లో జరిగిన ఎయిర్ షోలో ఐదుగురు వ్యక్తులు మరణించిన ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. "విజయ్ ఆ కార్యక్రమానికి హాజరయ్యాడా? లేదు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హాజరైనప్పుడు అక్కడ కూడా ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపించింది.’’ అని అన్నారు.
విజయ్‌కి అన్నామలై సూచన..
వారాంతపు బహిరంగ సభల గురించి కూడా విజయ్ పునరాలోచించాలని అన్నామలై కోరారు. వారంతంలో కాకుండా మిగతా రోజుల్లో సమావేశాలు నిర్వహించడం వల్ల పిల్లలు హాజరయ్యే అవకాశాలు తక్కువ అని పేర్కొన్నారు.
‘సీబీఐతో దర్యాప్తు చేయించాలి’
సీఎం స్టాలిన్ కేసు విచారణను ఏకసభ్య కమిషన్‌కు అప్పగించడంపై అన్నామలై అవిశ్వాసం వ్యక్తం చేశారు. సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
మొత్తంగా అన్నామలై మాటల్లోకి మూడు అంశాలు వ్యక్తమయ్యాయి. సరైన సభా వేదిక ఎంపిక చేసుకోకపోవడం, తగినంత పోలీసు సిబ్బంది లేకపోవడం, వారంతంలో ప్రచార సభలు నిర్వహించడం..