డిలిమిటేషన్ సమావేశం రోజున అన్నామలై ఏం చేయబోతున్నారు?

సీఎం స్టాలిన్ ఏర్పాటుచేసిన డిలిమిటేషన్ మీట్‌ను ‘‘మేగా డ్రామా’’ గా అభివర్ణించిన తమిళనాడు బీజేపీ చీఫ్..ఇళ్ల ముందు నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపు;

Update: 2025-03-21 12:16 GMT
Click the Play button to listen to article

డీఎంకే(DMK) పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు స్టాలిన్ డిలిమిటేషన్ అంశాన్ని తీసుకొస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై (K Annamalai) ఆరోపించారు. డిలిమిటేషన్ సమావేశం రోజున (మార్చి 22) తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు. శనివారం ఉదయం 10 గంటలకు తమ ఇళ్ల ముందు నల్లజెండాలతో నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. డిలిమిటేషన్‌కు వ్యతిరేకంగా స్టాలిన్ ఏర్పాటుచేసిన సమావేశాన్ని ‘‘మేగా డ్రామా’’ గా అభివర్ణించారు.

‘‘తాగుబోతుల రాష్ట్రంగా మార్చేశారు’’

అన్నామలై సీఎం స్టాలిన్‌(MK Stalin)పై తీవ్ర విమర్శలు చేశారు. తాగడానికి నీళ్లు లేకుండా చేసి తమిళనాడు(Tamil Nadu)ను తాగుబోతుల రాష్ట్రంగా మార్చేశారని ఆరోపించారు. కేంద్రం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయక ముందే డిలిమిటేషన్ అంశాన్ని లేవనెత్తి.. రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతి, నేరాల సంఖ్య, క్షీణిస్తోన్న శాంతి భద్రతల గురించి జనం దృష్టిని మళ్లించే యత్నం చేస్తున్నారని అన్నామలై ఆరోపించారు.

‘ప్రత్యర్థి రాష్ట్రాలకు రెడ్ కార్పెట్..’

ముల్లపెరియార్ డ్యాం, కావేరి జల వివాదాల్లో తమిళనాడు రైతులకు అన్యాయం చేస్తున్న కర్ణాటక, కేరళ నేతలకు స్టాలిన్ రెడ్ కార్పెట్ పరుస్తున్నారని అన్నామలై విమర్శించారు.

"తమిళనాడు రైతులు నీటి కొరతతో ఇబ్బంది పడుతుంటే.. స్టాలిన్ మాత్రం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌‌కు ఘన స్వాగతం పలుకుతున్నారు," అని పేర్కొన్నారు. డీఎంకే నిస్సహాయతకు మెకడాటు ప్రాజెక్టుపై కర్ణాటక వైఖరి, తమిళనాడు సరిహద్దుల్లో కేరళ రాష్ట్రం చెత్త వేయడాన్ని నిదర్శమని చెప్పుకొచ్చారు.

అన్నామలై ఆరోపణలపై, నిరసన కార్యక్రమాలపై డీఎంకే స్పందించలేదు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో తమిళనాడు రాజకీయాల్లో డిలిమిటేషన్ అంశం కీలకం కానుందని, బీజేపీ-డీఎంకె మధ్య పోరు మాత్రం తీవ్రంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Tags:    

Similar News