తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైను పక్కన పెడుతున్నారా?
అన్నాడీఎంకే - బీజేపీతో కలిసి పనిచేయాలంటే వైదొలగక తప్పదా?;
తమిళనాడు(Tamil Nadu)లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగబోతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావాలన్న కసితో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. మహారాష్ట్రలోలాగా ఏఐఏడీఎంకే(AIADMK)తో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది. గతంలో మద్దతు ఇచ్చిన అన్నాడీఎంకే 2023లో కాషాయపార్టీతో విడిపోయిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ సారి ఎన్నికలలో ఏఐఏడీఎంకేతో జతకట్టి ఎన్నికల బరిలోకి నిలవాలనుకుంటోంది బీజేపీ.
షాను కలిసిన పళని..
బీజేపీ(BJP) కేంద్ర నాయకత్వం తమిళనాడు రాష్ట్ర నాయకత్వ మార్పుపై కూడా ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం మాజీ ఐపీఎస్ అధికారి కే అన్నామలై అక్కడ పార్టీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి కె పళనిస్వామి(Palaniswami) ఢిల్లీలో కలిశారు. అన్నామలై పట్ల తమ పార్టీకి ఉన్న అభ్యంతరాలను షాతో చర్చించినట్లు తెలుస్తుంది.
మిగతావాళ్లతో కూడా..
కేవలం ఏఐఏడీఎంకేతో జతకట్టి అధికారం దక్కించుకోలేమని భావించిన బీజేపీ అధిష్టానం మరికొందరి నాయకుల సహకారం కోసం ఎదురుచూస్తుంది. AIADMK పక్కనపెట్టిన ఓ. పన్నీర్‌సెల్వం, టీటీవీ దినకరన్, శశికళను కూడా కలుపుకుపోవాలన్న ఆలోచనలో ఉంది. వీరిని కలుపుకొని పోవడం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా దక్షిణ జిల్లాల్లో గెలిచే అవకాశం ఉంది.
ఆ విషయాల్లో విభేధించిన AIADMK..
బీజేపీతో AIADMK జతకట్టినా.. కొన్ని విషయాలలో ఆ పార్టీతో విభేదించక తప్పడం లేదు. వివాదాస్పద అంశాలయిన త్రిభాషా విధానం, డీలిమిటేషన్ ప్రక్రియపై బీజేపీ వైఖరిని AIADMK బహిరంగంగానే వ్యతిరేకించింది. ఈ రెండు అంశాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన డీఎంకె ప్రభుత్వానికి మద్దతు పలికింది కూడా.
టీవీకేతో ఇబ్బందులు..
నటుడు విజయ్ కొత్తగా ప్రారంభించిన తమిళగ వెట్రీ కజగం (Tamilaga Vettri Kazhagam) (టీవీకే)తో తమిళనాట రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ పార్టీ అటు బీజేపీ, ఏఐఏడీఎంకే ఓట్లను చీల్చే అవకాశం ఉంది.
బీజేపీ గేమ్ ప్లాన్ వర్క్ అవుతుందా?
డీఎంకే(DMK)కు వ్యతిరేకంగా ఒక యునైటెట్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడమే బీజేపీ అధిష్టానం ముందున్న అతిపెద్ద సవాల్. మొత్తం మీద ఏఐఎడీఎంకేతో పొత్తు, రాష్ట్రనాయకత్వంలో మార్పు బీజేపీ గేమ్ ప్లాన్‌లో భాగంగానే కనిపిస్తున్నాయి.