సీఐడీ విచారణకు హాజరయిన మాజీ సీఎమ్ యడియూరప్ప
మైనర్ బాలిక పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్న కర్నాటక మాజీ సీఎం యడియూరప్ప సోమవారం సిట్ ముందు విచారణకు..
By : The Federal
Update: 2024-06-17 09:26 GMT
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సీఐడీ ముందు విచారణకు హజరైయ్యారు. తన ఇంట్లో పని చేసే మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురి చేశారని అభియోగాలు నమోదైన నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన సోమవారం సీఐడీ ముందు హాజరయ్యారు. విచారణ సందర్భంగా ఆయన వాయిస్ స్టేట్ మెంట్ ను దర్యాప్తు సంస్థ రికార్డు చేసింది. ఈ కేసుపై ఆయనను అరెస్ట్ చేయవద్దని కర్నాటక హైకోర్టు స్టే విధించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 17 సంవత్సరాల మైనర్ బాలికపై లైంగిక వేధింపులు పాల్పడ్డారని ఆరోపిస్తూ బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించారు. బెంగళూర్ లోని డాలర్స్ కాలనీలోని తన నివాసంలో ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఈ ఘటన జరిగిందని ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మాజీ సీఎం యడ్యూరప్ప పై పోక్సో చట్టం 2012, భారతీయ శిక్షాస్మృతి లోని సెక్షన్ 354ఏ, కింద కేసు నమోదు చేశారు. అయితే మాజీ సీఎం యడ్యూరప్ప ఈ ఆరోపణలను ఖండించారు. తనపై రాజకీయా కుట్రలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనపై కక్షలకు పాల్పడే వారికి తగిన గుణపాఠం ప్రజలు ఎన్నికల్లో చెబుతారని అన్నారు.
కోర్టులో పిటిషన్..
యడ్యూరప్పపై కేసు పెట్టి మూడు నెలలు దాటిన దర్యాప్తు ముందుకు సాగకపోవడంతో బాధితురాలి సోదరుడు గతవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యడ్యూరప్పను అరెస్ట్ చేసి కేసును త్వరగా విచారించాలని కోరారు.
మార్చి లో సదాశివ నగర్ పోలీసులు కేసు నమోదు చేసిన తరువాత కర్నాటక డీజీపీ అలోక్ మోహన్ కేసు విచారణ కోసం సీఐడీకి కేసును బదిలీ చేశారు. యడ్యూరప్పపై అభియోగాలు మోపిన 54 ఏళ్ల మహిళ ఊపిరితిత్తుల క్యాన్సర్ తో గత నెలలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తాజాగా ఆయన విచారణకు హజరుకావడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగనుంది.