కరూర్ తొక్కిసలాట: టీవీకే జిల్లా కార్యదర్శి మథియాళగన్ అరెస్ట్
తమిళగ వెట్రీ కజగం (TVK) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్ సహా మరో ఇద్దరు పార్టీ ఆఫీస్ బేరర్లపై కేసు నమోదు
తమిళనాడు(Tamil Nadu) కరూర్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది చనిపోయిన విషయం తెలిసిందే. మరో 60 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటనతో తమిళగ వెట్రీ కజగం (TVK) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్ సహా మరో ఇద్దరు పార్టీ ఆఫీస్ బేరర్లు, కరూర్ వెస్ట్ జిల్లా కార్యదర్శి వీపీ మథియాళగన్‌పై పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 105, 110, 125, 223 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కరూర్-దిండిగల్ సరిహద్దు సమీపంలో సోమవారం రాత్రి మథియాళగన్ పోలీసులు అరెస్టు చేశారు.
FIR రాసిందేమిటి?
‘TVK చీఫ్ విజయ్ "ఉద్దేశపూర్వకంగా" కరూర్ జిల్లాలోని వేలుసామిపురం వద్దకు ఆలస్యంగా చేరుకున్నారు. ఫలితంగా సెప్టెంబర్ 27న ప్రచార సభ వద్ద రద్దీ పెరిగింది. రద్దీ నియంత్రణకు మా సూచనలను టీవీకే పార్టీ కార్యకర్తలు పట్టించుకోలేదు. కొంతమంది విజయ్(Vijay)ను చూసేందుకు చెట్ల కొమ్మలపై కూర్చున్న ఉన్నారు. వారు చెట్టు కింద నిలుచున్న వ్యక్తులపై పడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఫలితంగా రద్దీలో కిందపడిపోయిన వారు ఊపిరాడక చనిపోయారు." అని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు పోలీసులు.