తమిళనాడు బీజేపీ చీఫ్‌గా నైనార్ నాగేంద్రన్ ?

దాదాపుగా ఖరారు.. AIADMKతో సత్సంబంధాలే కారణం.. అన్నామలైకి కేంద్ర మంత్రి పదవి?;

Update: 2025-04-11 10:19 GMT
Click the Play button to listen to article

తమిళనాట(Tamil Nadu) ఉత్కంఠ వీడింది. బీజేపీ(BJP) చీఫ్ ఎవరన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. నైనార్ నాగేంద్రన్, కె అన్నామలై మాత్రమే ఆ పోస్టుకు అర్హులని ఢిల్లీలోని బీజేపీ కేంద్ర నాయకత్వం ధృవీకరించింది.

నిబంధన సడలింపు..

తొలుత పదేళ్ల పాటు నిరంతర పార్టీ సభ్యత్వం ఉన్న వారే ఆ పోస్టుకు అర్హులని నిబంధన పెట్టారు. ఈ నిబంధనను ప్రస్తుత చీఫ్ అన్నామలై, శాసనసభా పక్ష నేత నాగేంద్రకు వర్తించదని తెలుస్తోంది. అన్నామలై బహిరంగంగా పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. నామినేషన్ కూడా దాఖలు చేయకపోవడంతో తిరునెల్వేలి ఎమ్మెల్యే నాగేంద్రన్ ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది.

అన్నాడీఎంకేతో పాత సంబంధాలు..

నాగేంద్రన్‌((Nagendran)కు అన్నాడీఎంకేతో సత్సంబంధాలున్నాయి. 2017కు ముందు అదే పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత కాషాయ పార్టీలో చేరారు. తన ఎన్నిక దాదాపు ఏకగ్రీవమని భావించిన నాగేంద్రన్.. నామినేషన్ దాఖలు చేయడానికి టి నగర్‌లోని బీజేపీ కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

నాగేంద్రన్ బలమెంత?

నాగేంద్రన్ అన్నాడీఎంకేతో సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత 2017లో బీజేపీలో చేరారు. తేవర్ కమ్యూనిటీకి చెందిన ఈయనకు దక్షిణ తమిళనాడులో మంచి బలం ఉంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. AIADMKతో నాగేంద్రన్‌కు ఉన్న సత్సంబంధాలు ఎన్నికలలో ఎక్కువ స్థానాలు గెలుపొందేందుకు దోహదపడుతుందని పార్టీ వర్గాల సమాచారం. ఆ కారణంగానే నాగేంద్రన్ వైపే అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

అన్నామలైకి కేంద్ర మంత్రి పదవి?

పదవీ విరమణ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai) కేంద్రంలో చోటు దక్కే అవకాశం ఉంది. "నేను రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీలో లేను" అని అన్నామలై గత వారం కోయంబత్తూరులో విలేకరులతో చెప్పారు. ఒక సాధారణ కార్యకర్తగా పార్టీకి సేవ చేస్తానని కూడా చెప్పారు.

ఎందుకు తప్పుకున్నారు?

2026 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ AIADMKతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటీవల అమిత్ షాతో ఢిల్లీలో ఆ పార్టీ నేత ఫళణిస్వామి భేటీ అయ్యారు. మద్దతు ఇవ్వడానికి ముందు ఒక షరతు పెట్టారు. AIADMK నేతల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్నామలై‌ను పక్కన పెడితేనే మీతో కలిసి పనిచేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే అన్నామలై పార్టీ చీఫ్ రేస్ నుంచి తప్పకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే AIADMKతో సత్సంబంధాలు ఉన్న నాగేంద్రన్ రెండు పార్టీల మధ్య వారధిగా ఉంటారని భావించి, ఆయన ఎంపికకు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపిందన్నది బీజేపీ శ్రేణుల మాట.

నాగేంద్రన్ ముందున్న సవాళ్లు..

నాగేంద్రన్ నియామకం బీజేపీకి కలిసొచ్చే అంశమైనా.. కొంతమంది బీజేపీ సభ్యుల్లో ఆయన ఎంపిక ఆందోళనకు గురిచేస్తుంది. 2010లో ఆదాయానికి మించి ₹3.9 కోట్ల ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలతో నాగేంద్రన్, ఆయన కుటుంబంపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ-కరప్షన్ (DVAC) చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఆరోపణలు కూడా మరోసారి వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది.

2024 లోక్‌సభ ఎన్నికలకు అధికారిక ఆమోదానికి ముందే నామినేషన్ దాఖలు చేయాలనే నాగేంద్రన్ నిర్ణయాన్ని కూడా పార్టీలోని విమర్శకులు ఎత్తి చూపుతూ.. ఆయన క్రమశిక్షణను ప్రశ్నిస్తున్నారు. ఇన్ని అడ్డంకులు ఉన్నా.. తిరునల్వేలిలోని మైనారిటీ వర్గాల మద్దతుతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 23,107 ఓట్ల తేడాతో గెలిచి బలమైన అభ్యర్థిగా పేరు గడించారు నాగేంద్రన్.

ఎన్నో ఏళ్లుగా..

తమిళనాడులో అడుగుపెట్టాలని బీజేపీ చాలా కాలంగా శ్రమిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ ఓట్ షేర్ 11% పైగా పెరిగింది. ఇది 2019లో 3.5% నుంచి గణనీయమైన పెరుగుదల. దీనికి అన్నామలై దూకుడు ప్రచారం, కార్యకర్తల సమీకరణే కారణం. అయితే 2023లో ఎన్డీఏ నుంచి అన్నాడీఎంకే వైదొలగడంతో పాటు ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం, బలమైన సంకీర్ణం అవసరాన్ని బీజేపీకి గుర్తు చేసింది.

నాగేంద్రన్ నియామకం బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి మార్గం సుగమం చేస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకుల మాట. ఆయన సారథ్యంలో మూడు, నాలుగు ప్రాంతాల్లో అధికార డీఎంకేకు బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలదని భావిస్తున్నారు.

మొత్తం మీద అమిత్ షా పర్యటన రెండు కీలక అంశాలతో ముడిపడి ఉంది. ఒకటి పార్టీ చీఫ్‌ పేరును ప్రకటించడం, అన్నాడీఎంకేతో పొత్తు గురించి సమాలోచనలు చేయడం. 

Tags:    

Similar News