జాతీయ విద్యావిధానం డీఎంకే కు మరోసారి పీఠం అప్పగించబోతుందా?
త్రిభాష విధానం పై ‘ది ఫెడరల్’ ఎడిటర్ శ్రీనివాసన్ విశ్లేషణ;
By : The Federal
Update: 2025-02-22 05:35 GMT
విజయ్ శ్రీనివాస్
జాతీయ విద్యావిధానం 2020 లో తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో త్రిభాషా విధానాన్ని ప్రతిపాదించింది. అయితే దీనిని తమిళనాట కొలువుదీరిన డీఎంకే సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
జాతీయ విద్యా విధానాన్ని పూర్తిగా అమలు చేయకపోతే సమగ్ర శిక్ష పథకం కింద నిధులు కోల్పోతారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హెచ్చరించడంతో అక్కడి రాజకీయ వాతావరణం మొత్తం మారిపోయింది.
ముఖ్యంగా డీఎంకే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మధ్య భారీ ప్రతిష్టంభనకు దారి తీసింది.
టాకింగ్ సెన్స్ విత్ శ్రీనిలో, ది ఫెడరల్ ఎడిటర్ ఎస్. శ్రీనివాసన్, సీనియర్ జర్నలిస్ట్ రంగరాజ్ ఈ వివాదం గురించి లోతుగా చర్చించే ప్రయత్నం చేశారు. తమిళనాడు చాలాకాలంగా హిందీని వ్యతిరేకిస్తోంది.
ఇక్కడ మాతృభాష తమిళంతో పాటు ఇంగ్లీష్ ను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని విద్యావ్యవస్థను నడిపిస్తున్నారు. స్థానిక భాషలోనే ప్రాథమిక విద్య బోధించాలని రాష్ట్రం నిరంతరంగా తన బలమైన వాదనలను కేంద్రం ముందు వాదిస్తోంది.
ఇది పెద్ద కుట్ర: డీఎంకే
డీఎంకేకి తమిళం కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు. దాని దృష్టిలో సాంస్కృతిక స్వయం ప్రతిపత్తి చిహ్నం. కేంద్రం విద్యార్థులకు హిందీ నేర్చుకునే అవకాశం ఉంటుందని హమీ ఇస్తున్నప్పటికీ, తమపై బలవంతంగా హిందీని రుద్దుతారనే భయం తమిళనాడులో వ్యక్తంమవుతుంది.
తమిళనాడుకు భాషా సమస్య దశాబ్ధాలుగా రాజకీయాలకు వేదికగా ఉంది. ఇక్కడ త్రిభాష విధానం తీసుకువచ్చి హిందీని రుద్దడానికి ఒక సాధనంగా చూస్తున్నారు. తమిళనాడులో ఈ సమస్య ఇతర భాషలను వ్యతిరేకించడం గురించి కాదని, విద్యార్థులు తమ మాతృభాషలో నేర్చుకునే హక్కును కాపాడుకోవడం గురించి అని శ్రీనివాసన్ వివరించారు.
తమిళనాడులో కూడా ఇతర రాష్ట్రాల మాదిరిగానే కేంద్రంతో కమ్యూనికేషన్ కోసం ఇంగ్లీష్ ను వాడుతోంది. అయితే స్థానికంగా జరిగే బోధనలన్నీ కూడా తమిళంలోనే జరగాలని రాష్ట్రం డిమాండ్ చేస్తోంది.
కేంద్రం వాదన ఏంటీ?
కేంద్ర ప్రభుత్వం కూడా తన జాతీయ విద్యా విధానాన్ని సమర్థించుకుంటూ వాదనలు వినిపిస్తోంది. భారతీయ భాషలను ప్రొత్సహించడమే లక్ష్యంగా ఈ విద్యావిధానాన్ని పెట్టుకుందని, భాషా విద్యను రాజకీయ విభజనగా కాకుండా జాతీయ సమైక్యతకు ఒక సాధనంగా చూడాలని కేంద్రం వాదిస్తోంది.
ఈ విధానం పట్ల రాష్ట్రం హ్రస్వ దృష్టిని అవలంభిస్తోందని కేంద్రమంత్రి ప్రధాన్, స్టాలిన్ కు లేఖ రాశారు. ఇది వివాదానికి మరింత ఆజ్యం పోసింది.
రాజకీయ చిక్కులు
ప్రస్తుతం వివాదం జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. కేంద్రం నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకుని, తమిళ రక్షకుడిగా తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి డీఎంకే ఈ అంశాన్ని ఉపయోగించుకుంటోంది. దక్షిణాది రాష్ట్రాలలో ఎంట్రీకి బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనికి ఇలాంటి వివాదాలే బ్రేకులు వేస్తున్నాయి.
తమిళనాడు సమగ్ర శిక్ష పథకం కింద కీలకమైన నిధులను కోల్పోయో అవకాశాన్ని ఎదుర్కొంటోంది. నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీ కింద కీలకమైన నిధులను కోల్పోయే అవకాశం ఎదుర్కొంటోంది.
ఇప్పుడు త్రిభాష విధానాన్ని అనుసరించకపోతే తమిళనాడుకు రూ. 2,158 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎడిటర్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ఎక్కడా త్రి భాషా విధానాన్ని తప్పనిసరిగా చేయలేదు. ఈ చర్య రాజ్యాంగ చట్టబద్దత గురించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు.
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ప్రస్తుతం వివాదం రాజకీయంగా డీఎంకేకు లాభించే అవకాశం కనిపిస్తుంది. త్రిభాషా సూత్రం కేవలం కమ్యూనికేషన్ సంబంధించిన విషయం కాదు.. తమిళనాడులో గుర్తింపు, స్వయంప్రతిపత్తి, రాజకీయ శక్తికి ఒక చిహ్నం.