‘‘యూపీఐ కాదు.. క్యాష్ మాత్రమే కావాలి’’
బెంగళూర్ లో వేల మంది వ్యాపారులకు నోటీసులు జారీ చేసిన జీఎస్టీ అధికారులు;
By : The Federal
Update: 2025-07-19 11:25 GMT
విజయ్ జోన్నహల్లి
భారత యూపీఐ నెట్ వర్క్ రోజుకు 650 మిలియన్లకు పైగా లావాదేవీలు నిర్వహిస్తోంది. ప్రతి చిన్న షాపు నుంచి కార్పొరేట్ స్థాయి షాపుల వరకూ ప్రజలు యూపీఐని విరివిగా ఉపయోగిస్తున్నారు.
కానీ బెంగళూర్ లో మాత్రం చాలామంది వ్యాపారులు ఆకస్మాత్తుగా యూపీఐని పక్కన పెట్టి నగదు లావాదేవీలను నిర్వహిస్తున్నారు. వ్యాపారస్తులకు వాణిజ్య పన్ను శాఖ నోటీసులు పంపడంతో వేలాది మంది విక్రేతలు యూపీఐ క్యూర్ కోడ్ లను తొలగించారు.
తమకు పన్ను నోటీసులు రావడంతో కర్ణాటక కార్మిక మండలి రాష్ట్ర వ్యాప్తంగా హెచ్చరిక జారీ చేసింది. పన్ను కట్టమని ఒత్తిడి చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాలు మూసివేసి జూలై 25న బెంగళూర్ లోని ప్రీడమ్ పార్క్ లో సామూహిక నిరసనకు పిలుపునిచ్చింది.
2025 మే నెలలో 18.7 బిలియన్లకు పైగా లావాదేవీలు జరిగాయి. రూ. 25 ట్రిలియన్ల విలువైనవి ఇవి. ప్రస్తుతం యూపీఐ క్యూర్ కోడ్ తొలగింపులు యూపీఐ విధానకర్తలు, వినియోగదారులను దిగ్భాంతికి గురి చేసింది. కానీ విక్రయదారులు మాత్రం తమకు వేరే దారి లేదని అంటున్నారు. Full View
నోటీసులే కారణమా?
వాణిజ్య పన్ను శాఖ అధికారులు 4 నుంచి 5 వేల మంది చిన్న వ్యాపారులకు నోటీసులు పంపినట్లు సమాచారం. వారి యూపీఐ లావాదేవీల ఆధారంగా జీఎస్టీ చెల్లించాలని కోరారు. ఇది అనధికార వ్యాపారాలలో విస్తృత భయాందోనలు, చర్చకు దారితీసింది.
దీనికి ప్రతిస్పందనగా దుకాణాదారులు క్యూఆర్ కోడ్ తీసివేసి చేతితో రాసిన కొన్ని బోర్డులు పెట్టారు. ‘‘ఇక్కడ యూపీఐ లేదు, నగదు లావాదేవీలు మాత్రమే ’’ అని..
కర్ణాటక కార్మిక మండలి అధ్యక్షుడు డాక్టర్ రవి శెట్టి బైందూర్ మాట్లాడుతూ... ‘‘ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోతే జూలై 23, 24 తేదీల్లో పాలు, పాల ఉత్పత్తులను నిషేధిస్తాము.
25 తేదీన అన్ని దుకాణాలు, సంస్థలను మూసివేస్తాము. ఆ రోజు లక్షలాది మంది ప్రజలు ఫ్రీడమ్ పార్క్ వద్ద సమావేశమై తీవ్ర నిరసన తెలియజేస్తాము. మేము తీవ్ర ఆందోళన నిర్వహిస్తాము’’ అని ప్రకటించారు.
ఆకస్మిక నియంత్రణ చర్య బెంగళూర్ లో వేలాది మంది రోజువారీ కార్యకలాపాలకు బ్రేక్ వేసింది. ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది.
విక్రయదారులు ఏమంటున్నారు?
పన్ను నోటీసుల వల్ల ప్రభావితమైన విక్రయదారుడు సంతోష్ మాట్లాడుతూ.. ‘‘యూపీఐ డీయాక్టివేషన్ అనివార్యమైంది. లావాదేవీల ఆధారంగా జీఎస్టీ అధికారులు నోటీస్ జారీ చేశారు.
లావాదేవీల ఆధారంగా పన్ను చెల్లించమని వారు మమ్మల్ని అడుగుతున్నారు. అయితే చెల్లింపు చేసే ముందు ఒక వక్తి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అది మాకు అర్థం కావడం లేదు. మా ఫ్రెండ్స్ సర్కిల్ లో 25 మందికి నోటీసులు ఇచ్చారు’’.
ప్రభుత్వం తమ వ్యాపారం అనధికార స్వభావాన్ని విస్మరిస్తోందని విక్రేతల వాదన. ఇక్కడ వాస్తవ ఆదాయం లావాదేవీల కన్నా తక్కువగా ఉంటుంది. చాలా మంది తమ వ్యాపారాలలో తిరిగి పెట్టుబడి పెట్టడానికి బంగారం తాకట్టు పెడుతున్నారు. ఇప్పుడు పన్ను చెల్లించమని నోటీసులు అందుకుంటున్నారు.
పాలపై జీఎస్టీ..
మరో విక్రయదారుడు నాగరాజ్ ఒక ప్రాథమిక లాభదయాకత ఆందోళనను లేవనెత్తాడు. ‘‘మాకు ఫోన్ పే వద్దు. మనం ఒక లీటర్ పాలను రూ. 52కి అమ్మితే రూ. 1 లాభం వస్తుంది. రూ. 52 రూపాయలపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది.. మేము ఏం చేయాలి’’? అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రకటన డిజిటల్ లావాదేవీల డేటా, వాస్తవ మార్జిన్ ల మధ్య అసమానతలను చూపుతోంది. వాస్తవ ఆదాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం టర్నోవర్ పై పన్ను విధించడం వల్ల వారి వ్యాపారాలు నాశనం అవుతాయని విక్రయదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్ లోని మిగిలిన ప్రాంతాలు డిజిటల్ భవిష్యత్ లో దూసుకుపోతున్న తరుణంలో బెంగళూర్ లోని చిన్న వ్యాపారులు నగదు రహితంగా మారడం వలన కలిగే నష్టాల గరించి మొదటి తీవ్రమైన హెచ్చరిక వినిపించింది. ముఖ్యంగా పన్ను విధానాలు వాస్తవాల కంటే వెనకబడినప్పుడూ జరిగే దానికి ఇది ఒక శాంపిల్ మాత్రమే.