దక్షిణాదిన ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదు: కే. అన్నామలై
రోడ్లపై కాకుండ పార్లమెంట్ లో ప్రశ్నిస్తే కేంద్రం సమాధానం చెబుతుందన్న టీఎన్ బీజేపీ చీఫ్;
By : The Federal
Update: 2025-03-23 07:14 GMT
ప్రస్తుతం దేశంలో, ముఖ్యంగా దక్షిణాదిలో చెలరేగుతున్న డీ లిమిటేషన్ తుఫాన్ ను అరికట్టడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై రంగంలోకి దిగారు.
తన పార్టీ చేయబోయే డీలిమిటేషన్ ప్రక్రియను ఆయన సమర్థించారు. కేంద్ర ప్రభుత్వం చేయబోయే డీలిమిటేషన్ ప్రక్రియ ‘‘ప్రో రేటా’’ అనే ప్రాతిపదికన ఉంటుందని సీట్ల సంఖ్యలో ఏదైన మార్పు ఉన్న పాత విధానం కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈ సూత్రం ప్రకారం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎంపీల సీట్లు పెరిగిన ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికి సీట్ల సంఖ్య ఇప్పుడున్న ఎంపీల సీట్లతో పోలిస్తే తగ్గదు.
ప్రో రేటా ఫ్రేమవర్క్
బీజేపీ అధ్యక్షుడు ‘ది ఫెడరల్’ కు సోదర సంస్థ అయిన ‘పుతియ తలైమురై’తో మాట్లాడారు. ఇందులో ఆయన తమ పార్టీ వైఖరిని వెల్లడించారు. ‘‘ ఇది నా వైఖరి మాత్రమే కాదు.
సీట్లను పరిగణలోకి తీసుకోవడం కూడా నిష్పత్తి ఆధారితంగానే ఉంది. ఇది జాతీయ పార్టీ అధికారిక వైఖరి. ఉదాహారణకు తమిళనాడు నిష్ఫత్తి 7.18 తో కొనసాగుతుంది. సీట్ల సంఖ్యకు ఇదే విధానం ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఒకే విధానం తీసుకువస్తాం’’ అని చెప్పారు.
డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ నిర్వహించిన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం తరువాత అన్నామలై చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకుముందు ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు.
‘‘దక్షిణ భారత ప్రజలకు నేను హమీ ఇస్తున్నాను. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో డీ లిమిటేషన్ జరుగుతుంది. దక్షిణాదిన ఒక్క సీటు కూడా తగ్గదు. లోక్ సభ సీట్లు ఎంతపెరిగినా సరే దక్షిణాదికి న్యాయమైన వాటా లభిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు’’ అని షా అన్నారు.
రాజకీయాలు చేస్తున్నారు..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమావేశం ప్రకటించిన కొన్ని రోజులకు అమిత్ షా ఈ ప్రకటన రావడంపై డీఎంకే నాయకుడు ఏ రాజా విమర్శలు గుప్పించారు. ‘‘ డీ లిమిటేషన్ పై మేము స్పష్టత కోరుతున్నాం. ఇది జనాభా ఆధారంగా ఉంటుందా? లేదా ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రస్తుత నియోజకవర్గాల ఆధారంగా ఉంటుందా?’’ అని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలకు తప్పుడు హమీలు ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు.
ప్రస్తుతం అన్నామలై మాటలను తన నియోజకవర్గం లో వ్యతిరేకత రాకుండా చేసే ప్రయత్నాలు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్టాలిన్ తన సమావేశాన్ని విజయవంతం చేయడంతో ఇప్పుడు బీజేపీ నష్ట నివారణ చర్యలు తీసుకుంటోందని వాదిస్తున్నారు.
దేశంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు ఉత్తరాదితో పాటు దక్షిణాది రాష్ట్రాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నందున జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా జాతీయ స్థాయిలో ఒక విధానం, రాష్ట్ర స్థాయిలో ఇంకో విధానం అవలంబిస్తూ తమపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నాయి.
డీలిమిటేషన్ పై కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. ఏదైన మాట్లాడితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కనీసం సీట్లు కూడా రావని భయపడుతోంది. బీజేపీ కూడా తమిళనాడులో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇక్కడ ఆ పార్టీ ఎలాగైన కొన్ని సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు..
2026 లో జరగాల్సిన జనాభా లెక్కల తేదీలను కేంద్రం ఇంకా ప్రకటించలేదు. కానీ ఈ లోపే డీలిమిటేషన్ కసరత్తు ప్రారంభం అయింది. దక్షిణాది రాష్ట్రాలు ఈ పరిణామంతో ఆందోళన చెందుతున్నాయి.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున తమిళనాడు లో అధికారంలో ఉన్న డీఎంకే మరింత ఆందోళన చెందుతోంది. ఈ అంశంపై తమ మధ్య ఏకాభిప్రాయం ఉన్నందున ఇతర దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు ఐకమత్యంగా కేంద్రంతో పోరాడుతున్నాయి.
త్రిభాషా విధానం, నూతన విద్యా విధానం, కేంద్రం- రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరులు పంపిణీ వంటి అంశాలపై ఇప్పటికే దక్షిణాది పోరాటాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై బీజేపీ స్పష్టంగా తన వైఖరిని బహిరంగంగా తెలియజేస్తున్నప్పటికీ, మిగిలిన ప్రత్యర్థులు మాత్రం ఇంకా అనుమానచూపులు చూస్తునే ఉన్నాయి.
పార్లమెంటరీ మార్గం..
పార్లమెంట్ లో లోక్ సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ పై కేంద్ర హోంమంత్రిపై అమిత్ షా వివరిస్తారని అన్నామలై పేర్కొన్నారు. ‘‘ ఈ ప్రణాళికను ఖరారు చేసి ప్రకటించినప్పుడు ఏ వ్యవస్థను అనుసరిస్తారో కేంద్ర హోంమంత్రి వివరిస్తారు’’ అని అన్నామలై పుతియ తలైమురై తో మాట్లాడుతూ చెప్పారు.
‘‘39 మంది ఎంపీలు ఉన్న డీఎంకే ఇక్కడ నాటకాలు ఆడటం కాదు. వెళ్లి పార్లమెంట్ లో ఈ విషయాన్ని లేవనెత్తితే కేంద్రం సమాధానం ఇస్తుంది’’ అని అన్నామలై అధికార పార్టీని విమర్శించారు.
వక్ప్ బోర్డు వంటి అంశాలపై ప్రతిపక్షపార్టీలు సూచించిన 14 సవరణలను బీజేపీ అంగీకరించింది. డీఎంకే సహ ఇతర పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడానికి మేము సిద్దంగా ఉన్నామని, బీజేపీ ఎప్పుడూ చర్చలకు తలుపులు తెరిచే ఉంచుతుందని ఆయన సంకేతాలిచ్చారు.
నిన్న చెన్నైలో జరిగిన జాయింట్ కమిటీ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలతో పాటు పంజాబ్ సైతం పాల్గొని డీలిమిటేషన్ ను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. డీలిమిటేషన్ కారణంగా తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.