ఏడాది పాటు పీఎంకే చీఫ్‌గా అన్బుమణి రామదాసు..

ఆగస్టు 2026 వరకు కొనసాగేలా పార్టీ జనరల్ కౌన్సిల్ నిర్ణయం..;

Update: 2025-08-10 08:15 GMT
Click the Play button to listen to article

పట్టాలి మక్కల్ కట్చి (PMK) పార్టీ అధ్యక్షుడిగా అన్బుమణి రామదాస్(Anbumani Ramadoss) పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రం మామల్లపురంలో శనివారం (ఆగస్టు 9) జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎస్ వడివేల్ రావణన్, కోశాధికారిగా ఎం తిలకబామ సైతం 2026 ఆగస్టు వరకు పదవుల్లో కొనసాగుతారని తీర్మానించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ తీర్మానంలో పేర్కొన్నారు. అయితే ఈ సర్వసభ్య సమావేశానికి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్ రామదాస్ హాజరు కాలేదు.

ఈ సందర్భంగా అన్బుమణి రామదాసు పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. డీఎంకేను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శ్వాసం వ్యక్తం చేశారు.

తండ్రీకొడుకుల మధ్య విభేదాలున్నా.. తనతండ్రిని గొప్ప నాయకుడిగా అభివర్ణించారు అన్భుమణి. "ఇది అయన కోసం వేసిన కుర్చీ. ఆయన వస్తారన్న నమ్మకం ఉంది. ఆయన ఒక జాతీయ నాయకుడు, ఒక సాధకుడు. సామాజిక సంస్కర్త కూడా," అని పేర్కొన్నారు.

తాను లేకుండా పీఎంకే సమావేశం నిర్వహించడంపై రామదాస్ ఎలాంటి కామెంట్ చేయలేదు. కాగా రామదాస్ అనుచరుడు, పీఎంకే ఆఫీస్ బేరర్, పార్టీ ప్రధాన కార్యదర్శినని చెప్పుకుంటున్న మురళీ శంకర్ మాత్రం జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్ణయం చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. ఆ సమావేశాన్ని నిర్వహించకుండా స్టే విధించాలని కోర్టును కూడా ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ తోసిపుచ్చడంతో పాటు అవసరమనుకుంటే సివిల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ మురళీ శంకర్ ఉందని పేర్కొన్నారు.


అప్పటి నుంచి దూరదూరంగా..

2024 లోక్‌సభ ఎన్నికలకు పొత్తు వ్యూహంపై తండ్రీకొడుకుల మధ్య విభేదాలు తలెత్తాయని పార్టీ వర్గాల మాట. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పీఎంకే ఒక్క సీటు కూడా గెలవలేకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత స్పష్టంగా కనిపించాయి. సీనియర్ రామదాస్ కోరికకు విరుద్ధంగా జూనియర్ అన్బుమణి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో జతకట్టారు. జూనియర్ రామదాస్ తన భార్య సౌమియా అన్బుమణిని ధర్మపురిలో నిలబెట్టారు. వన్నియార్ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న ఆ ప్రాంతంలో ఆమె డీఎంకే చేతిలో ఓడిపోయారు.

డాక్టర్ రామదాస్ సమక్షంలో మే 28 2022న చెన్నైలో జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో PMK అధ్యక్షుడిగా అన్భుమణి రామదాసును ఎన్నుకున్నారు. అదే సమావేశంలో శ్రీమతి తిలగబామ కూడా కోశాధికారిగా ఎన్నికయ్యారు. అయితే 2025 ఏప్రిల్‌లో పార్టీ అధ్యక్ష పదవి నుంచి అన్బుమణిని తప్పించి రామదాసే స్వయంగా పార్టీ పగ్గాలు చేపట్టారు. అన్బుమణికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ మార్పు రాబోయే ఎన్నికలలో పార్టీని బలోపేతం చేయడానికేనని రామదాస్ చెప్పుకొచ్చారు.


మనవడికి పగ్గాలు..

తన మనవడు ముకుందన్‌(కూతురు కొడుకు)ను పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిని చేశారు రామదాసు. అయితే తన మేనల్లుడు ఆ పదవిని చేపట్టడం అన్బుమణి ఏమాత్రం ఇష్టంలేదు. అనుభవం లేని వ్యక్తికి ఇంతటి కీలక పదవిని అప్పగించడం అవసరమా? అని అన్బుమణి బహిరంగంగానే విమర్శించారు.

కుల ప్రాతినిధ్య పార్టీ పీఎంకే..

తమిళనాడులో కుల ఆధారిత రాజకీయ పార్టీ అయిన పీఎంకేను 1989లో ఎస్ రామదాస్ స్థాపించారు. వన్నియార్ కులానికి ప్రాతినిధ్యం వహించే ఈ పార్టీ ఉత్తర తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తుంది. 2016 అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ప్రాంతంలో ఈ పార్టీకి ప్రజాదరణ ఉండేది. ఆ తర్వాత పార్టీలో తండ్రీకొడుకుల మధ్య అంతర్గత పోరు మొదలైంది. 

Tags:    

Similar News