బీసీలకు సామాజిక న్యాయ దివిటి పట్టిన ప్రధాని ఈయనే

మాజీ ప్రధాని వీపీ సింగ్ 18 వ‌ర్ధంతి నేడు. నేడు రాష్ట్రంలో అనే బిసి సంఘాలు ఆయన నివాళి అర్పిస్తున్నాయి. మంచిర్యాలలో సభ జరుగుతున్నది.

Update: 2025-11-27 00:30 GMT

రాచకుటుంబంలో జన్మించినా, మాజీ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ జీవన శైలిలోగానీ, ప్రజా సంబంధాల్లో గానీ ఆ లక్షణాలు మచ్చుకైనా కనిపించవు. ఆయ‌న  రాజకీయ జీవితమంతా సంచలనాలే. దేశ సామాజిక న్యాయ పటాన్ని, రాజకీయాల గమనాన్ని సమూలంగా మార్చి వేసిన ఘనుడాయన.  రాజీవ్ గాంధీ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పన్ను ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపిన వైనం దేశ‌ చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. రక్షణ శాఖ మంత్రిగా బోఫోర్స్ కుంభకోణం వెలుగులోకి తెచ్చిన మొదటి వ్యక్తి ఆయన.  కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన నేత కూడా ఆయనే.

Full View

బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే మండల్ కమిషన్ సిఫార్సులు అమల్లోకి తెచ్చిన ప్రధాన మంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. మండల్ రిజర్వేషన్ల కారణంగా అగ్రవర్ణాల ఆగ్రహానికి గురైన మొదటి అగ్రవర్ణ నాయకుడిగా , అయోధ్య యాత్రను అడ్డుకున్న హిందూ మత వ్యతిరేకిగా, దేశ రాజకీయాల్లో అత్యంత అవ‌మానకరమైన రీతిలో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న నాయకుడు కూడా ఆయనే.  తన రాజకీయ భవిష్యత్తును నాశనం అయ్యే సూచనలున్నా కఠిన నిర్ణయం తీసుకోవలసి వస్తే  ఎవరినీ లెక్క చేయని ఠాకూర్ సామాజిక వర్గ నేత వీ.పి.సింగ్‌.

రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా వామపక్షాలు, భారతీయ జనతా పార్టీతో కలసి నేషనల్ ఫ్రంట్ కూటమి ఏర్పాటు చేయడడంలో  వీ.పి.సింగ్ కీలక పాత్ర పోషించాడు. 1989లో ప్రధాని గా అతని పాత్ర భారత రాజకీయాల దిశను మార్చింది.   భారత దేశ ఏడవ ప్రధాన మంత్రిగా 1989 నుండి 1990 వరకు పనిచేసారు.

ప్రధాన మంత్రిగా భాద్యతలు చేపట్టిన కొద్ది రోజులకే మొదటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు.  సింగ్ కేబినెట్ లో హోం మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తెను తీవ్రవాదులు అపహరించారు. ఆమెను విడుదల చేయడానికి బదులుగా కొంత మంది తీవ్రవాదులను విడిచిపెట్టడానికి విపి సింగ్ ప్రభుత్వం అంగీకరించింది. పాక్షికంగా ఆ వివాదం ముగిసినా విమర్శలు వెల్లువెత్తాయి. 

వెనకబడిన వర్గాలకు సామాజిక న్యాయం చేకూర్చేందుకు మండ‌ల్‌ కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేయాలని ఆయన తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాలను సమూలంగా మార్చి వేసింది. సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పరిస్థితులని అధ్యయనం చేయ‌డానికి  1979 జనవరి 1 న అప్పటి జనతాపార్టీ కి చెందిన ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ క‌మీష‌న్‌ వేశారు. ఆ కమిషన్ ఛైర్మన్ గా బి.పి.మండల్ వ్యవహరించారు.

దేశంలో వెనుక బడిన తరగతులు, అట్ట‌డుగు స్థాయిలో వున్న ఇతర కులాల్ని జన స్రవంతిలో అనుసంధానం చేసే మార్గాలను అధ్యయనం చేసి ప‌లు సూచ‌న‌ల‌తో మండల్ కమిషన్ నివేదికను జనతాపార్టీ ప్రభుత్వానికి 1980లో సమర్పించింది.  అయితే మురార్జీ దేశాయి నాయకత్వంలోని జనతా ప్రభుత్వం కూలిపోవడం మండల్ నివేదిక మరుగున పడింది. తరువాత కాంగ్రెస్ పాలనలో సుమారు 10 సంవత్సరాలు మండల్ కమీషన్ నివేదిక బుట్ట దాఖలు అయి పోయింది. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం పతనమై, వి.పి. సింగ్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంటు  ప్రభుత్వం ఏర్పడిన తరువాత మండల్ కమీషన్ నివేదికకు ఆమోద ముద్ర వేసారు. 

ఈ వాతావరణంలో ఉత్తర భారత్ లోని అగ్ర‌ కులాలకు చెందిన యువత రోడ్ల‌పైకి వ‌చ్చి ర‌క్త‌పాతం సృష్టించారు. రిజ‌ర్వేష‌న్ వ్యతిరేక ఆందోళ‌న‌తో దేశం అట్టుడికి పోయింది. అణ‌గారిన ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ కోసం వి.పి. సింగ్ తన రాజకీయ జీవితాన్ని ఫ‌ణంగా పెట్టి, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.  ఆస‌మ‌యంలో జ‌రుగుతున్న ప‌రిణామాల్ని త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకుంటూ భారతీయ జనతా పార్టీ తన అజెండా ముందుకు తెచ్చింది. 

భారతీయ జనతా పార్టీ అద్యక్షుడు లాల్ కృష్ణ అద్వానీ ప్రమోద్ మహాజన్ తో కలసి రథయాత్ర చేయాలని 1990లో నిర్ణయించారు. 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి అక్టోబర్ 30న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర అయోధ్యకు చేరక ముందే, శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు అద్వానీ అరెస్టుకు విపి సింగ్ ఆదేశించాడు. అక్టోబర్‌ 23న బిహార్‌లోనే సమస్తిపూర్‌ వద్ద రథయాత్రను ఆపి, అద్వానీని అరెస్టు చేసి దుమ్కాలోని నీటి పారుదల శాఖ అతిథిగృహంలో నిర్బంధించారు.

మరుక్షణమే వీపీ సింగ్‌ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. ప్రభుత్వం పడిపోయింది. అద్వానీ రథయాత్ర ఆగిపోయింది. కరసేవను అద్వానీ వాయిదా వేసుకున్నారు. దీని ఫలితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో లోక్‌సభలో సింగ్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. అతను ఉన్నతమైన నైతిక విలువలతో దేశ లౌకికవాదంకోసం నిలబడ్డాననీ, తన బలంతో బాబ్రీ మసీదును కాపాడగలిగానని, ఇది ప్రాథమిక సూత్రాలను సమర్థిస్తుందని తెలిపారు. అతను 142–346 ఓట్లతో అవిశ్వాసంలో ఓడిపోయే ముందు "మీరు ఎటువండి భారతదేశాన్ని కోరుకుటున్నారు?" అని విపక్షాలను పార్లమెంటులో ప్రశ్నించారు. నేషనల్ ఫ్రంటులోని కొన్ని పార్టీలు, వామపక్షాలు మాత్రమే అతనిని సమర్థించాయి. సింగ్ 1990 నవంబరు 7 న తన పదవికి రాజీనామా చేసారు. 

వి.పి.సింగ్ ఎముకల మజ్జ క్యాన్సర్, మూత్రపిండాల వైఫల్యంతో బాధపడి 2008 నవంబరు 27 న న్యూఢిల్లీ లోని అపోలో ఆసుపత్రిలో మరణించాడు. 2008 నవంబరు 29 న అలహాబాదు లోని గంగా నదీ తీరంలో దహనం చేసారు. 

ప్రధానిగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఏడాది కంటే తక్కువ పాలన ఉన్నా నెహ్రూ పదిహేడేళ్ల పాలన, ఇందిరాగాంధీ పద్నాలుగేళ్ల  పాలన, ఇఫ్పుడు మోదీ పదేళ్ల పాలన దాని ముందు మసకబారి పోతుంది అని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. 

“ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలోనే, దేశ చరిత్రను ఆయన మార్చేశారు.  తనను తాను ఓబీసీ అని చెప్పుకునే నరేంద్ర మోదీ నుంచి ఇతర ప్రధాన మంత్రులెందరినో ఈ దేశ ప్ర‌జ‌లు చూశారు. ఎంత కాలం పాలించారనేది కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా పాలించారన్నదే ప్ర‌జ‌ల‌కు కావాల్సింది. ఆ పదవీ కాలంలో చేసిన కృషి వల్ల తర్వాతి తరాల జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చిందన్నదాన్ని బట్టి వారి స్థానాన్ని చరిత్ర నిర్ధారిస్తుంది,” అని ప్రొఫెస‌ర్ కంచె ఐల‌య్య ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు. 

మండల్‌ కమిషన్‌ అమలును సమర్థించడం కోసం ఆనాడు వీపీ సింగ్‌ చేసిన పోరాటాన్ని దేశం ఎప్ప‌ట్టికీ మ‌ర‌వ‌దని.  సామాజిక న్యాయ పరిరక్షణం కోసం ఆనాడు వీపీ సింగ్‌ తీసుకున్న సైద్ధాంతిక, నైతిక వైఖరి ఆయ‌న ధైర్య స‌హాసానికి అద్దం ప‌డుతుందని సీనియర్ అడ్వకేట్ కొండలరావు వ్యాఖ్యానించారు.

“ఆ నాడు వీపీ సింగ్‌ తన పదవిని పణంగా పెట్టి ఆ రిస్క్‌ తీసుకోకపోయి ఉంటే బీసీల‌కు ఈ మాత్రం అవ‌కాశాలు కూడా దొరికేవి కావు. త‌ల్లిదండ్రులు చేసిన త్యాగాలు పిల్ల‌ల‌కు అర్థం కాన‌ట్లే, వీ.పి. సింగ్ బీసీల కోసం చేసిన కృషి, త్యాగం ఈ తరానికి అర్థం కావ‌డం లేదు. ఎందుకంటే బీసీల్లో చైత‌న్యం లేదు. ఆ నాడు వీ.పి. సింగ్ చొర‌వ వ‌ల్లే కొంత సామాజికి న్యాయం జరిగింది,” అని కొండలరావు అన్నారు.  

చ‌ట్ట‌స‌భ‌ల్లో స‌రైన ప్రాతినిధ్యం లేక‌పోవ‌డం వ‌ల్లే,  మైనార్టీగా వున్నా ఆధిప‌త్య‌కులాలు పెత్త‌నం చేస్తున్నాయని పాల‌సీలు రూపొందిస్తున్నాయిని అంటూ   బీసీల్ని అణ‌గ‌తొక్కే విష‌యంలో కాంగ్రెస్, బీజేపీలు పోటీ ప‌డుతున్నాయని ఆయన అన్నారు. “కులగ‌ణ‌న చేయ‌డం మా విధానం కాదని  మోదీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో సెప్టెంబ‌ర్ 23, 2021లో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ లిటిగేష‌న్ పై సుప్రీంకోర్టు కేంద్ర ప్ర‌భుత్వ అభిప్రాయాన్ని కోరింది.  ఈ లిటిగేష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా, కేంద్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో ఈ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది,” అని కొండ‌ల‌రావు తెలిపారు. 

దురదృష్టవశాత్తు ఉత్తర భారత్‌లోని సామాజిక న్యాయ పార్టీలు అగ్ర‌కులాల ఓట్లను పొందడానికి వీ.పి.ని విస్మరించాయని బీసీ సీనియ‌ర్ నేత గ‌ట్టు రాంచంద్ర‌య్య ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు. మండల్ రాజకీయాలతో లబ్ది పొందినా ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్,రామ్ విలాస్ పాశ్వాన్ లాంటి వారు కూడా వీ.పి.సింగ్‌ని పట్టించుకోలేదని రాంచంద్రయ్య అన్నారు. 

“దేశంలో 56% బీసీలు ఉన్నారు. ఆ బీసీలంతా వీ.పి. సింగ్ వెనుక నిల‌బ‌డి వుంటే ఆయ‌న ప‌ద‌వీ త్యాగం చేయాల్సిన అవ‌స‌రం వ‌చ్చేది కాదు. కాపాడుకోవాల్సిన వ్య‌క్తిని బీసీలు కాపాడుకోలేక‌పోయారు,” అని బీసీ సీనియ‌ర్ నేత గ‌ట్టు రాంచంద్ర‌య్య అన్నారు.

వీపి సింగ్ మీద దాడి చేయడానికి నాటి సెక్యులర్ పార్టీలు మీడియాను దుర్వినియోగం చేసి  అగ్ర‌కుల యువకులు ఆత్మాహుతి చేసుకునేలా పురికొల్పాయని బీసీ వెల్ఫేర్ అసోసియేష‌న్ జాతీయ కార్య‌ద‌ర్శి కె.సుంద‌ర‌య్య ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు.

“వారు మండల్‌ అనుకూల శక్తులను దూషించడం, వాటి దాడి చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. కమ్యూనిస్ట్ లు కూడా మండల్‌ రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకంగా ఉండేవారు.  రాజీవ్ గాంధీకి ఇష్టమైన ఎంజె అక్బర్‌ను సెయింట్ కిట్స్‌లోని వీ.పి. సింగ్ బ్యాంకు ఖాతా గురించి తప్పుడు కథ రాయమని అడిగారు.  డబ్బు కోసం బనియా- బ్రాహ్మణ మీడియా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది. మీడియా నుంచి పూర్తిగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మండల్‌ రిజర్వేషన్‌ని రక్షించడానికి తగిన మేధో శక్తులు ఆనాటి శూద్ర ఓబీసీలలో లేవు,” అని సుందరయ్య అన్నారు. 

ప్ర‌స్తుతం 42 శాతం రిజ‌ర్వేష‌న్లు కల్పించడం గురించి మాట్లాడుతూ  వీటికి సంబంధించిన బిల్లులను కేంద్రం తొక్కిపెడుతోందని బీసీల‌కు సామాజిక న్యాయం జ‌ర‌గాలంటే జ‌నాభా దామాషా ప్ర‌కారం వారికిచ్చే రిజ‌ర్వేష‌న్ల‌ను రాజ్యాంగంలో పొందుప‌రిచి, చ‌ట్ట‌బ‌ద్ధంగా అమ‌లు చేయాలని కె.సుంద‌ర‌య్య చెప్పారు.

ఇప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ దాదాపు దశాబ్ద కాలం మండల్ కమిషన్ రిపోర్ట్‌ని  దాచి పెట్టిందని, దానిని వెలుగులోకి తెచ్చిన ఘనత నాటి ప్రధాని విపి సింగ్ దేనని బీసీ స్టూడెంట్ జేఏసీ అధికార ప్ర‌తినిధి మ‌ధు యాద‌వ్ ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు. 

“వీ.పి సింగ్ మండల్ కమిషన్ అమలు చేసేంత వరకు అన్ని రంగాల్లో బిసిల ప్రాతినిధ్యం 2 శాతం నుంచి 3 శాతం మించకుండా ఉండింది. తన ప్రధాన మంత్రి పదవికి ప్రమాదమని తెలిసినప్పటికి వీ.పి సింగ్ ఈ దేశంలో వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కొరకు మండల్ కమిషన్‌ని అమలు చేసేందుకు పూనుకున్నారు. అగ్రకులాలు ఎన్ని కుట్రలు చేసిన, మెరిట్ అంటూ మొర పెట్టుకున్న శతాబ్దాలుగా వెనుకబడిన తరగతులు అనుభవిస్తున్న వివక్ష, అణిచివేతను పార్లమెంట్ సాక్షిగా సుధీర్ఘ ప్రసంగం చేస్తూ ఎండగట్టారు. బిసిలకు రిజర్వేషన్లు కల్పించం రాజ్యాంగ బద్ధమేనని సమర్థించారు,” అని మధు యాదవ్ అన్నారు.

వీ.పి.సింగ్‌కు బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు, రాజీవ్ గాంధీ మద్దతు ఇచ్చి ఉంటే, నేడు దేశ చ‌రిత్ర వేరేలా ఉండేది. కానీ అప్పుడు రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ నివేదిక అమలును సభలో దారుణంగా విమర్శించారు. ఈ నిర్ణయం కాంగ్రెస్ ని కోలుకోలేని దెబ్బతీసింది. మండల్ అనేది కాంగ్రెస్ కోల్పోయిన గొప్ప అవకాశం. చాలా సంవత్సరాల తర్వాత, రాహుల్ కుల గణన అంటూ పాద‌యాత్ర చేస్తున్నారుంటే గతంలో చేసిన తప్పు ను సరిదిద్దుకోవడమే అనుకోవాలి.

Similar News