సైకిల్‌పై సాగిన పచ్చదనం యాత్ర,ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై

పద్మశ్రీ వనజీవి రామయ్య కథ… ప్రపంచానికి చెప్పబోయే సినిమా!

Update: 2025-11-27 03:45 GMT
వనజీవి రామయ్య బయోపిక్ చిత్ర నిర్మాణానికి క్లాప్

ఖమ్మం (Khammam)మట్టిలో పుట్టి ప్రపంచాన్ని ప్రేరేపించిన వనజీవి రామయ్య (Padma Shri Vanajeevi Ramaiah) జీవితం, ఇప్పుడు బహుభాషా బయోపిక్‌గా(biopic) రూపుదిద్దుకుంటోంది. కోటి మొక్కలు నాటి భారత పర్యావరణ చరిత్రను మార్చిన వనజీవి రామయ్య కథ ఇప్పుడు బయోపిక్ రూపంలో భారతదేశానికే కాదు, ప్రపంచానికే చెప్పబోయే కథ.


ఖమ్మం జిల్లాలో కోటి మొక్కలు నాటిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య బయోపిక్ ఇప్పుడు తెరకెక్కుతుంది. భవిష్యత్ తరాలకు నీడతోపాటు పచ్చదనం, ఫలాలను ఇచ్చేలా కోటి మొక్కలు నాటి మానవ శ్రేయస్సుకు పాటుపడిన వనజీవి రామయ్య పాఠాన్ని విద్యార్థులకు పాఠ్యాంశంగా తీసుకువచ్చారు. ‘‘ఒక చెట్టును నాటండి ఒక జీవితాన్ని కాపాడండి’’అంటూ రామయ్య సైకిలుపై మైళ్ల దూరం ప్రయాణించి మొక్కలు నాటిన రామయ్య బయోపిక్ వనజీవిగా సినిమాగా త్వరలో రానుంది.



 ఖమ్మంలో షూటింగ్ సందడి

పద్మశ్రీ వనజీవి రామయ్యపై బయోపిక్ ఖమ్మంలోని రెడ్డిపల్లి పరిసర అటవీ ప్రాంతాలతోపాటు ఫారెస్ట్ ఆఫీసు ఆవరణల్లో చిత్రీకరించారు. గ్రీన్ క్రూసేడర్ వనజీవి రామయ్యపై బహుభాషల్లో బయోపిక్ నిర్మిస్తున్నారు. దీనికి వేముగంటి దర్శకత్వం వహించగా బ్రహ్మాజీ నటించారు.ఈ బయోపిక్ కోసం ఎటువంటి పారితోషికం లేకుండా పనిచేస్తున్న నటుడు బ్రహ్మాజీ, రామయ్య జీవిత కథతో తాను చాలా ప్రేరణ పొందానని, ఆయనను చిత్రీకరించడం కేవలం మరొక పాత్ర మాత్రమే కాదు, ఒక ముఖ్యమైన బాధ్యతగా భావించానని చెప్పారు. పద్మశ్రీ దివంగత వనజీవి రామయ్య జీవితం ఒక జీవిత చరిత్ర చిత్రంలో అమరత్వం పొందనుంది.రామయ్య అనుచరులు, ఆయన రచనల నుంచి ప్రేరణ పొందిన వారు కలిసి ఈ బయోపిక్‌ను రూపొందించడానికి ముందుకు వచ్చారు. నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లింగంపల్లి చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. ఖమ్మంకు చెందిన ప్రముఖ సంగీతకారుడు బల్లెపల్లి మోహన్ సంగీతం అందిస్తున్నారు.

ఖమ్మం ఎకో క్లబ్ ఎన్విరాన్ మెంటల్ సొసైటీ ఫౌండర్ డాక్టర్ కడవెండి వేణుగోపాల్ పులిగుండాల ఎకో టూరిజం ఆవిష్కరణ సినీనటుడు బ్రహ్మాజీతో...


 నటీనటులు ఎవరంటే...

ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య మొక్కల పెంపకాన్ని జీవితకాల ఉద్యమంగా మార్చిన వైనంపై బయోపిక్‌ చిత్రీకరణను ఖమ్మం డిఎఫ్‌ఓ మొదటి క్లాప్ కొట్టారు.వనజీవి రామయ్య పాత్రలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ నటించారు.రామయ్య బయోపిక్ చిత్రీకరించడం ఆయనకు నిజమైన నివాళి అని బ్రహ్మాజీ చెప్పారు. ఈ చిత్రం రామయ్య పర్యావరణ లక్ష్యాన్ని ప్రపంచ ప్రేక్షకులకు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చిత్ర దర్శకుడు వేముగంటి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నటి నాగమణి ఆయన భార్య జానకమ్మ పాత్రను పోషిస్తున్నారు. ప్రకృతి పరిరక్షణ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు ఫోటోగ్రఫీ డైరెక్టర్ తోట రమణ, డాక్టర్ కళారంగ కథ రచయిత.



 రామయ్య జీవితం ప్రపంచం దృష్టికి...

పద్మశ్రీ వనజీవి రామయ్య అనే బయోపిక్ ప్రధాన లక్ష్యం రామయ్య జీవితాన్ని, ఆయన సందేశాన్ని జాతీయప్రపంచ ప్రేక్షకులకు తీసుకెళ్లడమేనని వేముగంటి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.హైదరాబాద్ నగర శివార్లలోని చీర్యాల, వికారాబాద్ అడవులు, ఎకో పార్క్, కేబీఆర్ పార్కుల్లో నిర్మించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. రామయ్య బాల్యంలో కుండలు తయారు చేసేవారని, ఈ దృశ్యాలను చీర్యాలతో చిత్రీకరిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చి, తన జీవితకాలంలో ఒకటిన్నర కోట్ల మొక్కలు నాటి, పద్మశ్రీ అవార్డు రూపంలో జాతీయ గుర్తింపును పొందిన రామయ్య చేసిన కృషిని హైలైట్ చేయడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.ఈ బయోపిక్ బహుభాషా చిత్రంగా రూపొంది, తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. దీన్ని ఆస్కార్ అవార్డుకు సమర్పించాలనే ఉద్దేశ్యంతో ఇంగ్లీష్ వెర్షన్‌ను రూపొందిస్తున్నట్లు వేముగంటి చెప్పారు. డిసెంబర్ 15 నాటికి షూటింగ్ పూర్తవుతుందని వేముగంటి చెప్పారు.

ఖమ్మంలో బయోపిక్ ల సందడి
ఖమ్మం జిల్లాలో బయోపిక్ లో సందడి కొనసాగుతుంది. ఒకవైపు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్ శరవేగంగా నిర్మాణం జరుపుకుంటుంది. మరో వైపు తాజాగా వనజీవి రామయ్య బయోపిక్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా నుంచి సైకిలుపై తిరిగే ఎమ్మెల్యేగా గుమ్మడి నర్సయ్య పేరొందారు. ఈ రెండు బయోపిక్ లు త్వరలో వెండితెరపై కనిపించనున్నాయి.

పచ్చదనం సందేశం

వనజీవి రామయ్య బయోపిక్‌తో పచ్చదనం సందేశం ఖమ్మం సరిహద్దుల్ని దాటి ప్రపంచానికి చేరనున్నది.సేవకు ప్రతీకగా నిలిచిన ఆయన జీవితం, ఇప్పుడు వెండితెరపై కొత్త శక్తిని సంతరించుకోనుంది. షూటింగ్ వేగంగా కొనసాగుతున్న ఈ చిత్రం విడుదలైతే, పర్యావరణ పరిరక్షణపై సామాజిక చైతన్యం మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.వనజీవి రామయ్య గారు లేరు… కానీ ఆయన నాటిన మొక్కలు, నిర్మించిన విలువలు, నింపిన పచ్చదనం...ఇవన్నీ మనతో ఉన్నాయి. ఇప్పుడు ఆ జీవన గాధను సినిమా రూపంలో చూడడం, మనందరికీ ఒక బాధ్యతను గుర్తు చేయనుంది.


Tags:    

Similar News