Upasana | తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో ఛైర్మన్‌గా మెగా కోడలు
పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంపై వైపు ఇదొక పెద్ద అడుగన్న ఉపాసన.;
మెగా కోడలు ఉపాసన కామినేనికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా స్టేట్ స్పోర్ట్స్ పాలసీని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలోనే ‘తెలంగాణ స్పోర్ట్స్ హబ్’ను ప్రారంభించింది. ఈ సంస్థకు ఛైర్మన్ సంజీయ్ గోయెంకాను నియమించగా, కో ఛైర్మన్‌గా మెగా కోడలు ఉపాసన కామినేనిని నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయాన్ని ఉపాసన కూడా తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. తనకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గౌరవంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
‘‘తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో ఛైర్మన్‌గా నియామకం కావడం సంతోషంగా ఉంది. సంజీయ్ గోయెంకాతో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నారు. గ్లోబల్ స్పోర్ట్స్‌లో తెలంగాణను నిలిపేదిశగా అడుగులు వేస్తాం. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంపై వైపు ఇదొక పెద్ద అడుగనే చెప్పాలి. తెలంగాణలో స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు ఈ పరిణామం ఎంతగానో కలిసొస్తుంది’’ అని ఉపాసన పేర్కొన్నారు.