టెలిఫోన్ ట్యాపింగ్ లో ఆ రెండు ఫోన్లే కీలకమా ?
విచారణకు వచ్చేటపుడు ఉత్తినే రాకుండా 2023లో ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను కూడా తీసుకురావాలని నోటీసులో అధికారులు స్పష్టంగా చెప్పారు;
తెలంగాణలో సంచలనం సృష్టించిన టెలిఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో బుధవారం కీలకంగా మారింది. నాలుగురోజుల క్రితం విచారణకు హాజరైన మీడియా యజమాని శ్రవణ్ రావును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) అధికారులు బుధవారం కూడా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీచేశారు. విచారణకు వచ్చేటపుడు ఉత్తినే రాకుండా 2023లో ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను కూడా తీసుకురావాలని నోటీసులో అధికారులు స్పష్టంగా చెప్పారు. 2023 మొబైల్ ఫోన్లనే ఎందుకు అడిగారంటే అప్పట్లో టెలిఫోన్ ట్యాపింగ్(Telephone tapping) అంశంలో శ్రవణ్ రెండు మొబైల్ ఫోన్లద్వారానే మొత్తం వ్యవహారమంతా నడిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి(Revanth) సీఎం కాగానే టెలిఫోన్ ట్యాపింగ్ పై విచారణ మొదలైంది. విచారణలో భాగంగా డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టుకాగానే శ్రవణ్ సడెన్ గా అమెరికాకు పారిపోయాడు.
గడచిన ఏడాదిగా అమెరికా(America)లో ఉన్న నిందితుడు ఇపుడు వాడుతున్న ఫోన్ కొత్తదని సిట్ అధికారులు తెలుసుకున్నారు. బీఆర్ఎస్(BRS) హయాంలో నిందితుడు రెండు మొబైల్ ఫోన్లను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఫోన్లద్వారానే మొత్తం ట్యాపింగ్ అంశాన్ని నిందితుడు పర్యవేక్షించటమే కాకుండా పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వటం, రాజకీయ బాసులతో మాట్లాడటం లాంటివి చాలాచేశాడు. అందుకనే అప్పట్లో వాడిన రెండు మొబైల్ ఫోన్లను కూడా విచారణకు తీసుకురమ్మని సిట్ అధికారులు స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అప్పట్లో ఉపయోగించిన రెండు ఫోన్లు పోయాయని నిందితుడు చెప్పేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి. ఎందుకంటే అప్పట్లో ఉపయోగించిన రెండు ఫోన్లను ఇపుడు సిట్ అధికారులకు అప్పగిస్తే మొత్తం బండారమంతా బయటపడుతుందని తెలుసుకోలేనంత అమాయకుడు కాదు నిందితుడు.
అందుకనే ఆ రెండుఫోన్లు పోయాయని చెబితే సిట్ ఏమిచేయగలదు ? అప్పట్లో ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లలోని సమాచారాన్ని బయటకు తీసుకురావాలన్నది సిట్ అధికారుల ఆలోచన. వీళ్ళ ఆలోచన బాగానే ఉందికాని అసలు అప్పట్లో ఉపయోగించిన పోన్లను నిందితుడు ఇవ్వాలిగదా ? ఒకవేళ ఇచ్చినా ఆ ఫోన్లలోని సమాచారం మొత్తాన్ని చెడిపేసి గాని ఇవ్వడు. ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఫోన్లో ఎరేజ్ చేసిన సమాచారాన్ని మళ్ళీ వెనక్కు రప్పించే అవకాశం ఉందన్న విషయం నిందితుడికి కూడా బాగా తెలుసు. ఇంతకాలం అమెరికాలోనే ఉన్నాడు కాబట్టి ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు ఎంతప్రయత్నించినా సమాచారాన్ని వెనక్కు తెప్పించలేని పద్దతిలోనే ఎరేజ్ చేసుంటాడనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
సో, తాజా సమాచారాన్ని బట్టి అర్ధమవుతున్నది ఏమంటే ఒకపుడు నిందితుడు వాడిన రెండు మొబైల్ ఫోన్లను తెచ్చి ఇచ్చినా అప్పటి సమాచారం పూర్తిగా దొరికితే కాని సిట్ అధికారులు ఏమీచేయలేరు. ఈ విషయం నిందితుడికి బాగా తెలుసుకాబట్టే ధైర్యంగా సిట్ విచారణకు హాజరవుతున్నాడు. సుప్రింకోర్టు ఆదేశాలతో శ్రవణ్ సిట్ విచారణకు హాజరయ్యాడే కాని సిట్ అంటే ఉన్న భయంతోకాదని అందరికీ తెలుసు. నిందితుడిని అరెస్టుచేయద్దని సుప్రింకోర్టు ఆదేశాలు ఎలాగూ ఉన్నాయి కాబట్టి నిందితుడికి అరెస్టుభయం కూడా లేదు. అందుకనే రెండురోజుల విచారణలో సిట్ అధికారులకు శ్రవణ్ ఏమత్రం సహకరించలేదని సమాచారం. నిందితుడి వైఖరిని సుప్రింకోర్టులో చెప్పి అరెస్టుకు అనుమతి కోరాలని సిట్ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ అరెస్టుచేసి విచారించమని సుప్రింకోర్టు గనుక ఆదేశిస్తే అప్పుడు నిందితుడిలో భయం మొదలవుతుందేమో చూడాలి. అప్పటివరకు సిట్ ఎన్నిప్రయత్నాలుచేసినా నిందితుడు సహకరించేది అనుమానమే.