బంగ్లాదేశ్ టు హైదరాబాద్ వయా బెంగాల్, అమ్మాయిల అక్రమ రవాణ బాగోతం
హైదరాబాద్ కేంద్రంగా బంగ్లా అమ్మాయిలతో గుట్టుగా సాగుతున్న వ్యభిచారం రాకెట్ గుట్టు రట్టు అయింది.బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నారు.;
By : The Federal
Update: 2025-03-14 11:56 GMT
హైదరాబాద్ నగరం కేంద్రంగా బంగ్లాదేశ్ అమ్మాయిలతో గుట్టుగా సాగుతున్న వ్యభిచారం రాకెట్ గుట్టు తాజాగా రట్టు అయింది. తీగ లాగితే డొంక కదిలినట్లు హైదరాబాద్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు ఏజెంట్లు బంగ్లాదేశ్ నుంచి అందమైన అమ్మాయిలను దేశ సరిహద్దులు దాటించి, పశ్చిమబెంగాల్ రాష్ట్రం మీదుగా హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నారు.
విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం
బంగ్లాదేశ్, బర్మా దేశాలకు చెందిన 11 మంది అమ్మాయిలతో గుట్టుగా వ్యభిచారం సాగిస్తుండగా ఇటీవల తెలంగాణ స్పెషల్ సెల్ పోలీసులు, చాదర్ ఘాట్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి వారిని పట్టుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి మైనర్ బాలికలను కూడా సరిహద్దులు దాటించి పశ్చిమబెంగాల్ మీదుగా హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పట్టుబడిన వారిలో బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు కూడా ఉన్నారు.గతంలో హన్మకొండలోనూ బంగ్లాదేశ్ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఈడీ కేసు నమోదు, రూ.,1.90 లక్షల సీజ్
హైదరాబాద్ కేంద్రంగా బంగ్లాదేశ్ అమ్మాయిలతో సాగిస్తున్న వ్యభిచారం బాగోతంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. మనీలాండరింగ్ యాక్ట్ కింద హైదరాబాద్ ఈడీ జోనల్ ఆఫీసు అధికారులు తాజాగా రూ.1.90 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. బంగ్లా అమ్మాయిల వ్యభిచారం రాకెట్ పై తెలంగాణ పోలీసులు, హైదరాబాద్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్ నగరంలోని ఛత్రినాక, పహాడిషరీఫ్ పోలీసుస్టేషన్ల పరిధిలో బంగ్లాదేశ్ కు చెందిన అమ్మాయిలు వ్యభిచారం చేస్తున్నరని, దీని వెనుక పెద్ద రాకెట్ హస్తం ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. సిండికేట్ గా సాగుతున్న ఈ బాగోతంపై పోలీసులు దాడులు చేసి బంగ్లా అమ్మాయిలను అరెస్ట్ చేశారు.ఆన్ లైన్ లో విటులను ఆకర్షిస్తూ జోరుగా వ్యభిచారం సాగిస్తున్నారని తేలింది.బంగ్లాదేశ్ కు చెందిన ఏజెంటు రజత్ మండల్ బంగ్లా అమ్మాయిలతో ఖైరతాబాద్, చాదర్ ఘాట్ ప్రాంతాల్లో వ్యభిచార గృహాలు నడిపాడని పోలీసులు చెప్పారు. పోలీసులు జలీల్ సర్దార్, బిస్తీ ఘాజీ, కమరూల్ షేక్, మహాబుల్ సర్దార్, అరోహి మండల్, బిలాల్ రిజా ఉల్ షేక్, బాబు, షాతీ అక్తర్, మౌసమీ, రియోట్ ఇస్లామ్, రోహిత్ మండల్, రాహుల్ షరీవుల్, అజరుల్ షేక్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎన్ఐఏ దర్యాప్తు
బంగ్లాదేశ్ అమ్మాయిలు అక్రమంగా హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడ అక్రమంగా వ్యభిచారం నడపటంపై హైదరాబాద్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దృష్టి సారించారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా బంగ్లా అమ్మాయిలు భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. బంగ్లా అమ్మాయిలను అరెస్టు చేయగా, వారి వద్ద నకిలీ భారత దేశ గుర్తింపు కార్డులు దొరికాయని హైదరాబాద్ కు చెందిన ఓ ఎన్ఐఏ అధికారి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
బంగ్లాదేశ్ పరిస్థితులతో...అమ్మాయిల విక్రయం
బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులతో ఉపాధి కోసం అమ్మాయిలు అక్రమంగా సరిహద్దులు దాటి దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి అక్రమంగా వచ్చిన బంగ్లా అమ్మాయిలను ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున చెల్లించి వారిని హైదరాబాద్ నగరానికి తరలించారని పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. చాదర్ ఘాట్ వ్యభిచార గృహంలోనే ఏడుగురు బంగ్లా అమ్మాయిలు పోలీసులకు దొరికారు.
బంగ్లాదేశ్ సరిహద్దు ఎలా దాటారంటే...
బంగ్లాదేశ్ యువతులకు హైదరాబాద్ నగరంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు ఏజెంట్లు వారిని పశ్చిమబెంగాల్ వద్ద సరిహద్దులు దాటించారని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది.హైదరాబాద్ నగరంలో బ్యూటీ పార్లర్లు, టైలర్ షాపులు, స్టీలు ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి అక్రమంగా బంగ్లా అమ్మాయిలను తీసుకువచ్చి వారిని బలవంతంగా వ్యభిచారం వృత్తిలో దించారని వెల్లడైంది.అక్రమంగా వచ్చి వ్యభిచారం సాగిస్తున్న ఆరుగురు అమ్మాయిలకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలు సరిహద్దులు ఎలా దాటారు, ఎవరు సహకరించారు? అక్రమ రూటును ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. బంగ్లాదేశ్ అమ్మాయిల అక్రమ రవాణ బాగోతంపై కేంద్ర నిఘా వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి.
టెలిగ్రామ్ యాప్ ద్వారా విటులను ఆకర్షించి...
విదేశీ అమ్మాయిలకు విటుల్లో డిమాండు ఉండటంతో దాన్ని క్యాష్ చేసుకునేందుకు నిర్వాహకులు టెలిగ్రామ్ యాప్ ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచారం నడుపుతున్నారు.ఇటీవల మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి టీఎన్జీఓల కాలనీ విదేశీ వనితలతో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బంగ్లాదేశ్, బర్మా దేశాల నుంచే కాకుండా కెన్యా, టాంజానియా, బ్యాంకాక్ దేశాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం దందా నిర్వహిస్తున్నారని నగరానికి చెందిన ఓ పోలీసు అధికారి చెప్పారు. గచ్చిబౌలిలో 9 మంది విదేశీ వనితలు వ్యభిచారం చేస్తూ దొరికారు.
హవాలా మార్గంలో బంగ్లాకు డబ్బు
హైదరాబాద్ నగరంలో బంగ్లాదేశ్ యువతులతో ఏజెంట్లు వ్యభిచారం చేపిస్తున్నారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణలో తేలింది. బంగ్లా అమ్మాయిలను కమీషన్ పద్ధతిపై ఒక వ్యభిచార కేంద్రం నుంచి మరో వ్యభిచార కేంద్రానికి కూడా తరలిస్తున్నారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. భారతదేశానికి నకిలీ గుర్తింపు కార్డుల సాయంతో వారు బ్యాంక్ ఖాతాలు తెరచి యూపీఐ నెట్ వర్క్ ద్వారా డబ్బు తీసుకుంటున్నారు.బాధిత యువతులు ఏజెంట్లకు కమీషన్ ఇస్తున్నారని తేలింది. వ్యభిచారం చేస్తూ సంపాదించిన డబ్బును బంగ్లా యువతులు బంగ్లాదేశ్ లోని వారి కుటుంబాలకు హవాలా మార్గంలో డబ్బు పంపిస్తున్నట్లు ఈడీ దర్యాప్తులో వెలుగుచూసింది. హైదరాబాద్ ఈడీ అధికారులు ఏజెంటు రాహుల్ అమిన్ థాలీ పేరిట ఉన్న భవనాన్ని సీజ్ చేశారు. వ్యభిచారం రాకెట్ నడుపుతున్న ఏజెంట్లు, బంగ్లాదేశ్ అమ్మాయిల పేటీఎం వాలెట్స్, బ్యాంక్ ఖాతాలను ఈడీ అధికారులు స్తంభింప జేశారు.