సెలబ్రిటీలు ఎవరు ఏమన్నారంటే..
సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన భేటీలో సినీ ప్రముఖులు కీలక విషయాలు పంచుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన భేటీలో సినీ ప్రముఖులు కీలక విషయాలు పంచుకున్నారు. సంధ్య థియేటర్ ఘటన తమను ఎంతో బాధించిందని విచారం వ్యక్తం చేశారు. ఒక ప్రమాదం జరిగిందని ఇండస్ట్రీ మొత్తంపై ప్రభావం చూపే నిర్ణయం తీసుకోవడంపై పునరాలోచన చేయాలన్న రీతిలో సెలబ్రిటీలు సమావేశంలో కోరారు. కానీ అందుకు సీఎం నిరాకరించారు. ప్రజల భద్రత విషయంలో రాజీ లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు రిజల్ట్స్ డే ఎలానో సినిమాలకు రిలీజ్ ఫస్ట్ డే ఉంటుందని సీనియర్ నటుడు మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశంలో జరిగింది. ఇందులో నాగార్జున, రాఘవేంద్ర రావులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం సహకరించాలని వారు కోరారు.
‘‘ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఉంటుంది. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది. సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నాం’’ అని మురళీ మోహన్ పేర్కొన్నారు. అదే విధంగా శ్యాంప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను. హైదరాబాద్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలి’’ అని కోరారు.
‘‘ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉంది. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది మా డ్రీమ్. ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్‌గా ఉండాలి’’ అని దగ్గుబాటి సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర రావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. ‘‘అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది. దిల్ రాజును ఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నా. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌లు ఉన్నాయి. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్‌లో చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నాం’’ అని తెలిపారు.
‘‘యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలి. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు’’ అని నాగార్జున తెలిపారు.
ఇండస్ట్రీకి నిరాశే
సంక్రాంతి పండుగ సినీ ఇండస్ట్రీకి చాలా స్పెషల్‌గా ఉంటుంది. బడాబడా హీరోలంతా కూడా ఈ పండగ రోజున తమ సినిమాలను విడుదల చేయాలనుకుంటారు. సంక్రాంతి బరిలో నిలబడమంటే ఓ యుద్ధం చేస్తున్న ఫీలింగ్‌లో సినీ నిర్మాతలు ఉంటారు. ఆ సమయంలో వరుస సినిమాలతో ఉండే పోటీని ఎవరు తట్టుకుని నిలబడ్డారు అనేది కీలకంగా మారుతుంది. అటువంటి సంక్రాంతి ముందు బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సినీ పరిశ్రమకు భారీ ఎదురుదెబ్బ కానుంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, బాలకృష్ణ ‘డాకూ మహారాజ్’, సందీప్ కిషన్ ‘మజాకా’ సహా మరిన్ని సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అందువల్లే ఆగమేఘాలపైన సినీ ఇండస్ట్రీ అంతా కదిలి.. సీఎంతో భేటీకి సిద్ధమైంది. ఎలాగైనా బెన్‌ఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుకు అనుమతి తీసుకోవాలని భావించిన వారందరికి ఊహించని షాక్ తగిలింది. వాటికి అనుమతులు ఇవ్వడం కుదరదని, అసెంబ్లీలో చెప్పిన మాటకు తాను కట్టబడి ఉంటానని సీఎం రేవండ్ కరాఖండిగా చెప్పేశారు. మరి ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ ఏం చేస్తుందో చూడాలి.