గులాబీ దళంలో గెలుపు గుబులు.. అయోమయంలో పార్టీ అధిష్టానం
లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీఆర్ఎస్‌కు అభ్యర్థులు కరువయ్యారు. రోజురోజుకూ పార్టీని వీడుతున్న వారు మాత్రం పెరిగారు. ఇది చూస్తుంటే గులాబీ దళంలో ఓటమి భయం పట్టుకుందనిపిస్తోంది.
Update: 2024-03-09 07:02 GMT
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత గులాబీ దళంలో ఓటమి భయం పుట్టిందా? అంటే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అవుననే చెప్పాలి. లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఊహించని ఓటమి నుంచి బీఆర్ఎస్ నేతలు ఇంకా తేరుకోలేదు. అందుకేనేమో కొందరు నేతలు త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి ముందుకు రావట్లేదు. మరికొందరు చివరి క్షణంలో తాను పోటీ చేయనని వెల్లడిస్తున్నారు. దానికి తోడుగా పార్టీ వీడుతున్న నేతల సంఖ్య కూడా రోజురోజుకు అధికం అవుతోంది. మరికొందరు ఎమ్మెల్యేలైతే పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఒకప్పుడు బీఆర్ఎస్ టికెట్ దొరికితే చాలనకున్న నేతలు కూడా ఇప్పుడు పార్టీ తరపు లోక్‌సభ బరిలో నిలబడానికి మొరాయిస్తున్నారు. వీరిలో కొందరు కీలక నేతలు కూడా ఉన్నారు. వీరికి ఓటమి భయం పెరిగి లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓడిపోతే తట్టుకోలేమనే వారు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఉంది.
బీఆర్ఎస్ ముందు అగ్ని పరీక్ష
లోక్‌సభ ఎన్నికల సమరం దగ్గర పడుతున్న వేళ తమ అభ్యర్థులను ఖరారు చేయడం బీఆర్ఎస్ పార్టీకి ఓ అగ్ని పరీక్షలా మారుతోంది. ఇప్పటికే ఎన్నికల బరిలో నిలబడటానికి బీఆర్ఎస్‌కు 17 నియోజకవర్గాల్లో లీడర్లు కరువయ్యారు. మొన్నమొన్నటి వరకు కూడా సమరానికి సిద్ధం అన్న నేతలు కూడా మెల్లిగా పోటీ నుంచి తప్పుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు నల్గొండ నుంచి బరిలోకి దిగడానికి రెడీ అన్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ ఇప్పుడు పోటీపై ఆసక్తి కనబరచడం లేదు. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పార్టీ అధిష్టానానికి సంకేతాలు కూడా ఇచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కూడా ఈసారి పోటీకి నిరాకరిస్తున్నారని తెలుస్తోంది.
మల్కాజ్‌గిరి నుంచి తన కుమారుడు బరిలో నిల్చుంటాడని ప్రకటించిన మాజీ మంత్రి మల్లారెడ్డి తాజాగా మరో కీలక ప్రకటన కూడా చేశారు. లోక్‌సభ బరిలో తన కుమారుడు భద్రారెడ్డి నిలబడం లేదని, పార్టీ ఎవరిని నిలబెట్టినా వారి విజయం కోసం శాయశక్తులా కృషి చేస్తామని చెప్పారు. ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కూడా చర్చించామని, ఆయనకు పోటీ నుంచి తప్పుకుంటున్న చెప్పామని వెల్లడించారు. వీరితో పాటుగా చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా తాను పోటీకి సిద్ధంగా లేనని సంకేతాలు ఇచ్చారు.
ఖర్చులు పార్టీనే భరించాలి
కొందరు నేతలు మాత్రం తాము వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, భువనగిరి లాంటి నియోజకర్గాల్లో పోటీకి రెడీ అంటున్నారు. కానీ తమ ఖర్చులు మొత్తం పార్టీనే భరించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో గులాబీ దళం అయోమయంలో పడింది. పార్టీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని గులాబీ బాస్ కేసీఆర్ కలలో కూడా ఊహించి ఉండరు. పార్టీ టికెట్ ఇస్తామన్నా నేతలు ముందుకు రాకపోవడం, పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కరువవడం, తమ ఖర్చులను పార్టీ భరించాలని నేతలు డిమాండ్ చేస్తుండటంతో కేసీఆర్‌కు దిక్కుతోచని స్థితిని ఏర్పడింది. వీటికి తోడుగా రోజు గడుస్తున్న కోద్దీ పార్టీ నుంచి ఎవరు సీఎం రేవంత్ ఇంటికి క్యూ కడతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు కూడా రేవంత్‌ను కలిసి వచ్చారు.
కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్న నేతలు
అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంగా ఉంది. దానికి తోడుగా ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పలువురు బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ నుంచి కూడా నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు. వారిలో మహేందర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరలేదు. కానీ ఆయన భార్య జెడ్జీ ఛైర్మన్ సునీతా రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితా రెడ్డి మాత్రం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ మాజీ మేయర్‌లు కూడా కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు.
జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్‌కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, రామగుండం, వరంగల్ మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఇప్పటికే రేవంత్ రెడ్డిని వేరువేరుగా కలిశారు. వీరే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కేంద్రాలు ఖాళీ అవుతున్నాయి. అందరూ కాంగ్రెస్ బాట పడుతున్నారు. దీంతో సిట్టింగ్ స్థానాల్లో కూడా కొత్త అభ్యర్థులను వెతుక్కోవాల్సి వస్తోంది.
కొద్దిరోజుల్లోనే బీఆర్ఎస్ యాదికొస్తుంది
రాష్ట్రంలో ఇటీవల ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ గుర్తొస్తుందని చెప్తూ పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వడానికి కేటీఆర్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారని విమర్శిస్తున్నారు. వీరు ఎంత చెప్తున్నా కొందరు నేతలు మాత్రం కాంగ్రెస్, బీజేపీ బాట పడుతున్నారు. దీంతో రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ నలిగిపోతోంది. కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు ప్రతివ్యూహాల మధ్య అసలేం చేయాలో అర్థం కాక బీఆర్ఎస్ అయోమయంలో పడింది.