బీఆర్ఎస్ అభ్యర్ధులు నామినేషన్లు వేస్తారా ?

. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లకు ముందే బీఆర్ఎస్ చాలావరకు ఖాళీ అయిపోతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. టికెట్లు ప్రకటించిన అభ్యర్ధులు పార్టీ మారిపోతున్నారు

Update: 2024-03-29 05:19 GMT
BRS chief KCR

గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరికి ఇదే అనుమానం పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కారుపార్టీ ఓడిపోయిన దగ్గర నుండి కీలకమైన నేతల్లో చాలామంది పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లకు ముందే బీఆర్ఎస్ చాలావరకు ఖాళీ అయిపోతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చేవెళ్ళ నియోజకవర్గానికి అభ్యర్ధిగా ప్రకటిస్తే రాజీవ్ రెడ్డి టికెట్ వద్దని కాంగ్రెస్ లో చేరిపోయారు. తాజాగా వరంగల్ అభ్యర్ధిగా ప్రకటించిన కడియం కావ్య కూడా టికెట్ వద్దని కాంగ్రెస్ లో చేరుతున్నారు. జరుగుతున్నది చూస్తుంటే కేసీయార్ ప్రకటించిన అభ్యర్ధుల్లో ఎంతమంది నామినేషన్లు వేస్తారనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

బీఆర్ఎస్ ను వదిలేస్తున్న నేతల్లో అత్యధికులు హస్తంపార్టీలోకే వెళుతున్నారు. బీఆర్ఎస్ తరపున పోటీచేయటానికి కూడా చాలామంది సీనియర్లు ఇష్టపడటంలేదు. టికెట్లిచ్చిన వాళ్ళు కూడా వద్దని పార్టీని వదిలేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున పోటీచేసినా గెలవలేమని, ఒకవేళ గెలిచినా ప్రతిపక్షంలో ఉంటే కష్టాలు తప్పవని చాలామంది కారుపార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉనికిలో ఉంటుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజా సంచలనమైన టెలిఫోన్ ట్యాపింగ్ కారణంగా బీఆర్ఎస్ పై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని కావ్య చెప్పటం గమనార్హం.

ఒకపుడు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి వెళ్ళిన నేతల్లో చాలామంది రివర్సులో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కారణం ఏమిటంటే నియోజకవర్గాల అభివృద్ధికి నిధుల కోసమే పార్టీ మారుతున్నట్లు చిలకపలుకులు పలుకుతున్నారు. తాజా పరిణామాల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు జరిగిన భూకబ్జాలు, లిక్కర్ స్కాం, ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజార్చినట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని పార్టీ మారుతున్న సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కే కేశవరావు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కు చెప్పారట. దాంతో కేసీయార్ కూడా ఏమి అనలేని పరిస్ధితిలో ఉండిపోయారు. తాజా పరిణామాలు ఏమిటంటే రాజ్యసభ ఎంపీ కే కేశవరావు, ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈనెల 30వ తేదీన ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ లో చేరబోతున్నారు.

అలాగే స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి కడియం కావ్య కూడా తొందరలోనే పార్టీకి గుడ్ బై చెప్పేయబోతున్నారట. ఢిల్లీ నుండే అధిష్టానం పెద్దలు కడియంతో ఇప్పటికే మంతనాలు జరిపారని సమాచారం. ఈయన కూతురుకు వరంగల్ ఎంపీ టికెట్ హామీ దక్కిందట. అందుకనే వీళ్ళిద్దరు కూడా పార్టీమారటం ఖాయమంటున్నారు. ఈమధ్యనే ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 12 మంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఇప్పటికే రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాల ఎంఎల్ఏలు, ఎంపీలు ఏ కారణంతో రేవంత్ ను కలిసినా పార్టీ మారిపోవటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. చాలాసార్లు ఈ ప్రచారమే నిజమవుతోంది.

కాంగ్రెస్ నేతల లెక్కప్రకారం ఇప్పటికి సుమారు 20 మంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి రావటానికి రెడీగా ఉన్నారు. మరో ఆరుగురి విషయంలో క్లారిటి వస్తే బీఆర్ఎస్ఎల్పీ చీలిపోవటం ఖాయమట. చీలికవర్గాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకునేందుకు రంగం కూడా రెడీ అయిపోయిందని సమాచారం. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా’ అన్నపద్దతిలో ఇతర పార్టీల్లోని ప్రజాప్రతినిధులను, నేతలను లాక్కునేందుకు కేసీయార్ అనుసరించిన మార్గాన్నే ఇపుడు కాంగ్రెస్ ఫాలో అవుతోందంతే. కేసీయార్-కేకే మధ్య ఎర్రవల్లి ఫాంహౌస్ లో పెద్ద డిస్కషనే జరిగిందట. పదేళ్ళు అన్నీ పథవులను అనుభవించి ఇపుడు పార్టీని వదిలి వెళ్ళటం ఏమిటని కేకేపై కేసీయార్ మండిపోయారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ‘పార్టీలో మీకు ఏమి తక్కువ చేశామని వెళిపోతున్నారని’ కేసీయార్ ప్రశ్నించారట.

కేకేతో భేటీలో డైలాగులను చూసిన తర్వాత కేసీయార్ ఎంతటి నిస్సహాయస్ధితిలో ఉన్నారో అర్ధమవుతోంది. అధికారం లేకుండా పట్టుమని పదిరోజులు కూడా ఉండలేని స్ధితికి ప్రజాప్రతినిధులను తెచ్చిందే కేసీయార్. కేసీయార్ కు ముందుకూడా పార్టీ మారటాలు ఉన్నాయి. టార్గెట్ చేసి, నెత్తిన తుపాకి పెట్టి, వ్యాపారాలను, ఆర్ధిక మూలాలను దెబ్బతీసి, పాత కేసులను తవ్వితీసి పార్టీలోకి చేర్చుకోవటం లేదనే చెప్పాలి. కేసీయార్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి పద్దతలు ఎక్కువైపోయాయి. ఇపుడు జరుగుతున్నది ఏమిటంటే బీఆర్ఎస్ లో పరిణామాలతో నాయకత్వంమీద నమ్మకంపోయి చాలామంది పార్టీ మారిపోతున్నారు. దాన్నే కేసీయార్ తట్టుకోలేకపోతున్నారు. బొంతు రామ్మోహన్, పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, చేవెళ్ళ ఎంపీ రాజీవ్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ వెంకటేష్ నేత లాంటి చాలామంది సీనియర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇంకా చాలామంది చేరటానికి రెడీ అవుతున్నారు.

ఇదే విషయమై కాంగ్రెస్ కార్యదర్శి పరుచూరి మురళీకృష్ణ మాట్లాడుతు ఇలాంటి పరిస్ధితులు రాజకీయాల్లో పెరిగిపోతుండటం చాలా దురదృష్ణకరమన్నారు. అధికారపార్టీలో ఉండకపోతే రాజకీయం చేయటం కష్టమనే పరిస్ధితిని అధినేతలే తీసుకొచ్చారని అభిప్రాయపడ్డారు. దీనికి కేసీయార్ ప్రధాన బాధ్యత వహించాలన్నారు. బీఆర్ఎస్ లోకి నేతలు ఎలా వెళ్ళారో అలాగే వెనక్కు వచ్చేస్తున్నట్లు మురళి చెప్పారు. అలాగే సీనియర్ కాంగ్రెస్ నేత కొత్తా సీతారాములు మాట్లాడుతు ప్రజా ప్రతినిధులను, సీనియర్లను ఒత్తిడి పెట్టి కేసీయార్ పార్టీలోకి లాక్కున్న విషయాన్ని గుర్తుచేశారు. సంప్రదాయ రాజకీయాలకు కాలంచెల్లి ఇపుడు పవర్ పాలిటిక్స్ జోరుమీదుందన్నారు.


వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, రియాల్టర్లు పార్టీల్లోకి వచ్చేసిన తర్వాత రాజకీయాల్లో డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. దాని దుష్ఫరిణామాలే ప్రస్తుత పార్టీ ఫిరాయింపులుగా కొత్తా అభిప్రాయపడ్డారు. తొందరలోనే చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి రాబోతున్నట్లు చెప్పారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ కూడా కష్టమే అన్నారు.

Tags:    

Similar News