‘ఉపఎన్నిక ఖాయం.. సిద్ధంగా ఉండండి’: కేసీఆర్

ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించిన మాజీ సీఎం కేసీఆర్.;

Update: 2025-02-19 12:28 GMT
బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎంత ప్రయత్నించినా, ఏం చేసినా రాష్ట్రంలో ఉపఎన్నికలు రావడం ఖాయమన్నారు. వాటిని ఎదుర్కోవడానికి అంతా సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఉపఎన్నికలు వస్తే బీఆర్ఎస్‌దే విజయం కావాలన్నారు. పార్టీ ఫిరాయించిన వెళ్లిన వారికి గెలుపుతో గుణపాఠం నేర్పించాలని సూచించారు. ఈ సందర్బంగా సిల్వర్ జూబ్లీ వేడుకల గురించి కూడా కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఇంత త్వరగా, ఇంతటి స్థాయిలో వస్తుందని తాను కలలో కూడా అనుకోలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం పడి పోతుందని.. మనం ఏటా ఆదాయం పెంచుకుంటూ వెళ్లామన్నారు. అంతేకాకుండా పార్టీ నేతలపై కూడా ఫుల్ సీరియస్ అయ్యారు. కొందరు పార్టీలో ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారని, అలాంటి వారిపై చర్యలు తప్పకుండా ఉంటాయని అన్నారు. అలాగే, పార్టీ కమిటీలు వేయాలని నిర్ణయించిన కేసీఆర్‌.. కమిటీలకు ఇన్‌చార్జ్‌గా హరీశ్‌ రావుకు బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే మహిళా కమిటీ లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

‘‘సిల్వర్ జూబ్లీ వేడుకలే ముఖ్యం. ఈ సీఎంపై ఇంత త్వరగా వ్యతిరేకత వస్తుందనుకోలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం పడి పోతుందని.. మనం ఏటా ఆదాయం పెంచుకుంటూ వెళ్లామన్నారు. అదే అధికారులు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి పని చేయించుకోవడం రావడం లేదు. అధికారం పోయిన వెంటనే కొందరు అధికారం కోసం పార్టీకి వెన్నుపోటు పొడిచారు. పార్టీని వీడి వెళ్లారు. వారందరికీ అతి త్వరలోనే సరైన గుణపాఠం నేర్పబడుతుంది. రాష్ట్రంలోని పది నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తాయి. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి. మీరే ఎమ్మెల్యేలు అవుతారు’’ అని కేసీఆర్ అన్నారు.

‘‘సామాజిక, చారిత్రక అవసరాల దృష్ట్యా తెలంగాణ సమాజం ప్రసవించిన బిడ్డ టీఆర్ఎస్. తెలంగాణ రాజకీయ అస్తిత్వం, రాష్ట్రాన్ని సిధించి చిరిత్రక బాధ్యతను నిర్వహించిన ప్రజల పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ, అస్తిత్వ పటిష్టతకు కృషి చేస్తూ, గత గాయాల నుంచి శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలి. పార్టీని క్షేత్రస్థాయికి నుంచి బలోపేతం చేయాలని’’ అని తెలిపారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కూడా కేసీఆర్ ప్రకటించారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఏప్రిల్‌ పదో తేదీ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని.. ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కొనసాగు తుందన్నారు. అనుబంధ సంఘాల పటిష్టత కోసం సీనియర్‌ నేతలతో సబ్‌ కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. అదే నెల 10న పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందని చెప్పారు.



Tags:    

Similar News