ఎమ్మెల్యే లాస్య మరణం, సిఎం విస్మయం

యువ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించారు. శాసనసభలో అడుగుపెట్టి రెండు నెలలు కూడా గడవక మునుపే ఆమె మరణం కంటోన్మెంట్ ప్రజలను విషాదంలో ముంచెత్తింది

Update: 2024-02-23 02:55 GMT
రోడ్డు ప్రమాదంలో మరణించిన లాస్య నందిత (ఫైల్ ఫోటో)

ప్రజాప్రతినిధిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు సేవలందించాలన్న ఆమె ఆశలు అవిరయ్యాయి. శాసనసభలో అడుగుపెట్టి నిండా మూడు నెలలు గడవక మునుపే ఆమె కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయారన్న వార్తతో కంటోన్మెంట్ ప్రజలు, కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొదలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ఆమెకు నివాళులు అర్పించారు. ఆమె మరణం తీరని లోటని ప్రకటించారు. కంటోన్మెంట్ అంటే గుర్తుకు వచ్చే పేర్లలో ఆమె తండ్రి సాయన్న ఒకరు. ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆమె ఎంతో రాణిస్తారని ప్రజలు ఆశించినా విధి వక్రీకరించింది. నల్లగొండలో ఇటీవల జరిగిన కేసీఆర్ సభకు వెళ్లి వస్తూ నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంఘటన మరువక ముందే ఈసారి అదే తరహా ప్రమాదంలో ఆమె కన్నుమూయడం విషాదకరం,

ముఖ్యమంత్రి సంతాపం

కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.




 


నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేదని  ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం, ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరమని ఆయన ట్వీట్ చేశారు.

వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలిపారు.  




హరీష్ రావు దిగ్భ్రాంతి

 బిఆర్ ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య మృతి పట్ల ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.




 ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత గారు రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందటం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మరణ వార్త వినగానే ఆయన ఆసుపత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.



Tags:    

Similar News