అన్ని రంగాల్లో కుల వివక్ష ఉంది : రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
దేశంలోని అన్ని రంగాల్లో కుల వివక్ష ఉందని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ వ్యాఖ్యలు చేశారు.
By : The Federal
Update: 2024-11-05 13:46 GMT
దేశంలో కులవివక్ష ఉందన్నది వాస్తవమని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.‘‘ అన్ని రంగాల్లో కుల వ్యవస్థ ఉంది.అగ్ర కులాలకు కుల వ్యవస్థ కనిపించదు. ప్రధాని కుల వివక్షపై మాట్లాడటం లేదు’’అని రాహుల్ ఆరోపించారు. కులగణనతో భవిష్యత్తులో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలకు న్యాయం జరుగుతుందని రాహుల్ వ్యాఖ్యానించారు.కులగణనలో భారత దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కులగణనలో పొరపాట్లను సరిచేసుకొని ముందుకు వెళతామని రాహుల్ చెప్పారు.తెలంగాణ కుల గణన భవిష్యత్ లో దేశానికి దిక్సూచిగా ఉంటుందన్నారు.
బీజేపీ నాయకులు, ప్రధాన మంత్రి తాను దేశాన్ని విభజిస్తున్నానని ఆరోపించారని రాహుల్ చెప్పారు.దేశం గురించి నిజం చెబితే, దేశాన్ని విభజించడమా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.‘‘దేశంలో ఈ కుల గణన ద్వారా ఎంత మంది దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, ఓబీసీలున్నారు తెలుసుకోవచ్చు, దేశంలో ఎవరు ఎంత మంది ఉన్నారనేది మనం తెలుసుకోవాలి. ఎంతమంది నిరుపేదలున్నారనేది మనం తెలుసుకోవాలి. ఎంతమంది ఆదివాసీలు, దళితులు, మైనారిటీలు న్యాయవ్యవస్థలో, కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్నారనేది తెలుసుకోవాలి.ఏ వ్యవస్థలో ఎంత మంది ఓబీసీలు ఉన్నారనేది తెలుసుకోవాలి, ఇండియా కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్నారనేది మనం తెలుసుకోవాలి, ప్రధానమంత్రి ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఎందుకు భయపడుతున్నారు’’ అని రాహుల్ ప్రశ్నించారు.
కుల గణన ద్వారా నష్టాన్ని నవారించవచ్చునని, రాజకీయ, మీడియారంగంలో ఎంత మంది ఆదివాసీలకు అవకాశాలు దక్కుతున్నాయో తెలుసుకోవాలని రాహుల్ పేర్కొన్నారు. దేశంలో దళిత వ్యాపారులు ఎంత మంది ఉన్నారు కొందరు వాస్తవాలు బయటకు రావద్దని కొందరు అగ్రకులాల వారు భావిస్తున్నారన్నారు. రిజర్వేషన్లపై 50 శాతం నిబంధన తొలగించాలని కోరారు. కులగణన తర్వాత దేశ సంపద ఎలా పంచాలనేది నిర్ణయిస్తామని రాహుల్ చెప్పారు.