CBI| ఓఎంసీ కేసులో సబితను వెంటాడుతున్న సీబీఐ
కృపానందం, సబిత తప్పుచేశారనేందుకు కావాల్సినన్ని ఆధారాలు ఉన్నప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోవటంలో సీబీఐకోర్టు విఫలమైందని దర్యాప్తుసంస్ధ మండిపడింది;
మాజీమంత్రి పట్టోళ్ళ సబితా ఇంద్రారెడ్డిని కేంద్ర దర్యాప్తుసంస్ధ సీబీఐ వదలకుండ వెంటాడుతునే ఉంది. ఓబుళాపురం మైనింగ్ కేసులో సబితను సీబీఐ(CBI) కోర్టు నిర్దోషిగా ప్రకటించటాన్ని సీబీఐ సవాలుచేస్తు హైకోర్టులో పిటీషన్ దాఖలుచేసింది. 2009లో సంచలనం సృష్టించిన ఓఎంసీ(OMC Case) కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గనులశాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy), పరిశ్రమలు, వాణిజ్య శాఖ డైరెక్టర్ బీ కృపానందం, గాలి జనార్ధనరెడ్డి(Gali Janardhan Reddy), శ్రీనివాసులరెడ్డి, గనుల శాఖ డైరెక్టర్ వీడీ రాజగోపాల్ తదితరులపైన సీబీఐ కేసులు నమోదుచేసి దర్యాప్తుచేసింది. తర్వాత సీబీఐ కోర్టులో చాలాకాలం విచారణ జరిగింది.
దాదాపు పుష్కరకాలం విచారణ జరిగిన విచారణలో సీబీఐ కోర్టు రెండునెలల క్రితం గాలి జనార్ధనరెడ్డి, వీడీ రాజగోపాల్, శ్రీనివాసులరెడ్డితో పాటు గాలి పీఏగా పనిచేసిన మెపుజ్ ఆలీఖాన్ కు శిక్షలు విధించింది. అలాగే సబిత, శ్రీలక్ష్మి, కృపానందంను నిర్దోషులుగా ప్రకటించిన విషయంతెలిసిందే. అయితే తర్వాత శ్రీలక్ష్మిని నిర్దోషిగా ప్రకటించటాన్ని సీబీఐ అభ్యంతరం పెట్టింది. దాంతో ఆమెమీద హైకోర్టులో మళ్ళీ కేసు రీఓపెన్ అయ్యింది. తాజాగా సబిత, కృపానందం మీద కూడా మళ్ళీ విచారణ జరపాలని సీబీఐ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయటం సంచలనంగా మారింది. వీళ్ళద్దరు నిర్దోషులుగా సీబీఐ కోర్టు మే6వ తేదీన ప్రకటించటం తప్పని తాజాగా సీబీఐ హైకోర్టులో పిటీషన్ వేసింది. ఈ ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించటంలో సీబీఐ కోర్టు పొరపాటుచేసిందని, కేవలం ఊహలు, అంచనాలు ఆధారంగా వారికి కేసునుండి విముక్తి కలిగించినట్లు సీబీఐ ఆరోపించింది.
కృపానందం, సబిత తప్పుచేశారనేందుకు కావాల్సినన్ని ఆధారాలు ఉన్నప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోవటంలో సీబీఐకోర్టు విఫలమైందని దర్యాప్తుసంస్ధ మండిపడింది. గాలిజనార్ధనరెడ్డికి ఓఎంసీ గనులను అక్రమంగా కేటాయించటంలో సబిత, కృపానంద పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని సీబీఐ తన పిటీషన్లో చెప్పింది. సీబీఐ వాదనలు విన్న హైకోర్టు కేసును ఈనెల 18కి వాయిదా వేసింది. ఇటు శ్రీలక్ష్మిని అటు సబితను సీబీఐ చాలాకాలంగా వెంటాడుతునే ఉంది. కేసుల నుండి విముక్తి దొరికిందని ఊపిరిపీల్చుకునేంతలోగా సీబీఐ మళ్ళీ ఇద్దరిపైనా కేసులను రీఓపెన్ చేసి విచారించాల్సిందే అని కోర్టులో పిటీషన్లు వేయటం ఆశ్చర్యంగా ఉంది.
వీళ్ళు అవినీతికి పాల్పడ్డారనేందుకు సీబీఐ దగ్గర అంత పటిష్టమైన ఆధారాలు ఉన్నపుడు సీబీఐ కోర్టు ఎందుకు వాటిని పరిగణలోకి తీసుకోలేదన్నదే అర్ధంకావటంలేదు. సబిత, శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా సీబీఐ ప్రవేశపెట్టిన సాక్ష్యాలను పరిశీలించేందుకు సీబీఐ కోర్టు ఇష్టపడలేదా ? లేకపోతే వీళ్ళకు వ్యతిరేకంగా వాదనలు వినిపించటంలో సీబీఐ లాయర్ గట్టి ప్రయత్నంచేయలేదా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా శ్రీలక్ష్మి, సబిత, కృపానందం అక్రమాలకు పాల్పడ్డారు అనేందుకు తమ దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెబుతున్న సీబీఐ హైకోర్టులో వాటిని ఎలా ప్రజెంట్ చేస్తుంది ? హైకోర్టు ఎలా స్పందిస్తుంది అన్నవిషయం కీలకంగా మారింది.