హెచ్సీయూ వివాదంలో తలదూర్చిన సెలబ్రిటీలు
కాలుష్యంతో నిండిపోతున్న నగరానికి ఆక్సిజన్ అందిస్తున్న చెట్లను నరికేయటం అన్యాయమంటూ వీళ్ళిద్దరు తమ సామాజికమాధ్యమాల్లో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు;
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి వివాదంలో ఇద్దరు సెలబ్రిటీలు తలదూర్చారు. యూనివర్సిటీవిగా ప్రచారం జరుగుతున్న 400 ఎకరాలను వేలంద్వారా అమ్మాలని రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం నిర్ణయించింది. భూములన్నీ ప్రభుత్వానివే అని రేవంత్, మంత్రులు చెబుతున్నారు. ఇదేసమయంలో 400 ఎకరాలు యూనివర్సిటీ(HCU)వే అని విద్యార్ధులు, యూనివర్సిటి యాజమాన్యం అంటోంది. దాంతో భూముల యాజమాన్యంపై వివాదం పెరిగిపోతోంది. భూముల అమ్మకం ద్వారా మౌలికసదుపాయాల కల్పనకు అవకాశం ఉంటుందని రేవంత్ అంటున్నాడు. నిజానికి ఈ 400 ఎకరాలు ప్రభుత్వానివే కాని యూనివర్సిటీవి ఎంతమాత్రం కావు. అయితే ఆ భూములు యూనివర్సిటీవే అని విద్యార్ధులు, యూనివర్సిటి ఉద్యోగులు ఆందోళన మొదలుపెట్టడంతో బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP)లు మద్దతుగా నిలిచి గొడవను మరింత పెద్దది చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే సెలబ్రిటీలు వివాదంలోకి ఎంటరయ్యారు. రేణుదేశాయ్, రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.
కాలుష్యంతో నిండిపోతున్న నగరానికి ఆక్సిజన్ అందిస్తున్న చెట్లను నరికేయటం అన్యాయమంటూ వీళ్ళిద్దరు తమ సామాజికమాధ్యమాల్లో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 400 ఎకరాల్లో వేలాది చెట్లను నరికేస్తే ఆక్సిజన్ సరఫరా ఒక్కసారిగా దెబ్బతింటుందని ఉపాసన(Upasana Konidela), రేణు(Renu Desai) ఆందోళన వ్యక్తంచేశారు. ఆక్సిజన్ సరఫరా దెబ్బతినటమే కాకుండా అందులోని జంతువులు, పక్షులకు ప్రత్యామ్నాయ ఆవాసం ఎలాగ కల్పిస్తారంటు ప్రభుత్వాన్ని నిలదీశారు. నరికేసిన చెట్లను ఎక్కడ పెంచుతారు ? వీటన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని వీళ్ళు డిమాండ్ చేశారు.
400 ఎకరాలకు సంబందించిన వివాదంపై పూర్తి సమాచారం తెలుసుకున్నాకే తాను స్పందిస్తున్నట్లు రేణు చెప్పారు. మరి ఆమె తెలుసుకున్న సమాచారం ఏమిటన్న విషయాన్ని రేణు చెప్పలేదు. ‘సీఎం రేవంత్ రెడ్డి గారూ..ఒక తల్లిగా మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నా..నాకు 44 ఏళ్ళు. రేపోమాపో ఎలాగైనా పోతాను’. ‘కానీ పిల్లలు...రేపటితరానికి ఆక్సిజన్, నీళ్ళు అవసరం’. అభివృద్ధి అవసరమే కాదనను. ఐటి పార్కులు, బహుళ అంతస్తుల భవనాలు అన్నీ అవసరమే. కానీ ‘ఈ 400 ఎకరాలను మాత్రం వదిలేయండి’. ‘నిర్మానుష్యంగా ఉన్న భూములను వెతకమని దయచేసి వేడుకుంటున్నానను ఒకసారి ఆలోచించండి’. మూగజీవాల్ని అడవినుండి తరిమేయకండి అని టీవీ యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Gautam) కూడా ఒక వీడియో షేర్ చేసింది.
అసలే సినీరంగానికి రేవంత్ కు మధ్య సంబంధాలు అంతంతమాత్రమే అని అందరికీ తెలిసిందే. గడచిన 15 మాసాల్లో సినీరంగం విషయంలో జరిగిన అనేక డెవలప్మెంట్లు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఈ నేపధ్యంలో యూనివర్సిటిలోని 400 ఎకరాల వివాదంలో సినీసెలబ్రిటీలు జోక్యం చేసుకోవటం, బహిరంగంగానే రేవంత్ నిర్ణయాన్ని వ్యతిరేకించటం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి ఈ ఇష్యూతో సినీరంగానికి ఎలాంటి సంబంధంలేదు. కాని పర్యావరణాన్ని రక్షించాలనే కాన్సెప్టుతో రేణుదేశాయ్, ఉపాసన ఇద్దరూ తమఅభిప్రాయాలను, ఆగ్రహాన్ని సామాజికమాద్యమాల్లో పంచుకున్నారు. ఇద్దరు సినీ సెలబ్రిటీలూ రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమిప్పారు. మరి ఇంకా ఎంతమంది సెలబ్రిటీలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు బయటకు వస్తారో చూడాలి.