ముస్లిం రైతుకు ఎద్దును కానుకగా ఇచ్చిన చిలుకూరు ఆలయ అర్చకులు

ముస్లిం రైతుకు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ చేయూతనందించారు. రైతులకు సహాయం చేయడంలో ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

Update: 2024-03-19 10:29 GMT
ఎద్దును బహూకరిస్తున్న చిలుకూరు ఆలయ అర్చకులు


దేశంలోని అన్ని అంశాలు ప్రస్తుతం మత ప్రాతిపదికన నడుస్తున్నాయి. ఎన్నికల్లో కూడా ఈ మతాల ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు చేసిన పని మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆపదలో ఉన్న ముస్లిం రైతులకు ఆయన చేయూతనందించారు. ఆపదలో ఉన్న రైతులను ఆదుకునే సంప్రదాయం కొనసాగింపుగానే ఈ పని చేశామని ఆయన తెలిపారు.
ఇటీవల కరెంట్ షాక్ కొట్టి మొహమ్మద్ గౌస్ అనే రైతుకు చెందిన ఎద్దు మరణించింది. ఈ విషయం తెలుసుకున్న చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సదరు రైతుకు ఓ ఎద్దును బహుమతిగా అందించారు. మానవత్వం అనేది ఎన్నడూ కూడా మతం, కులం అనే వాటిని పట్టించుకోదని, వాటికి అతీతంగా ఉంటుందని చెప్పారు. ఆపదలో ఉన్న మానవులకు సహాయం చేయడమే అసలైన పరమాత్ముని సేవగా నమ్ముతామని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు, అతని శిష్యులు తెలిపారు.
కొన్నేళ్ల క్రితం కూడా ఇలానే
కొన్ని సంవత్సరాల క్రితం అంజియా అనే రైతుకు కూడా ఎద్దులను బహుమతిగా అందించి అండగా నిలిచారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని పెద్ద మంగళారం గ్రామానికి చెందిన అంజియకు చెందిన రెండు గేదెలు కూడా కరెంట్‌షాక్‌తో మరణించాయి. దాంతో వెంటనే స్పందించిన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్.. ఆయనకు సహాయం చేశారు. అంతేకాకుండా రెండేళ్లలో కరెంట్ షాక్, పిడుగుపాటు, ఇతర ప్రమాదాల్లో పశువులను కోల్పోయిన అనేక మంది రైతులకు ఆయన చేయూతనందించారు. గతంలో సిద్దిపేటకు చెందిన ఓ రైతుకు ఆలయ కమిటీ ఓ ఆవును అందించింది. అదే విధంగా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఆలయ కమిటీ నుంచి ఎద్దులను బహుమతిగా అందుకున్నారు.
ఈ సందర్భంగా రంగరాజన్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న రైతులను ఆదుకోవడంలో ప్రజలు కూడా పాలుపంచుకోవాలని కోరారు. ‘‘రైతులు ఆవులు, గేదెలు, ఎద్దులను తమ సొంత కుటుంబ సభ్యులగా భావిస్తారు. అవి మరణించడంతో రైతుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవడానికి వారికి పశువులను అందిస్తున్న కార్యక్రమంలో ప్రతి మానవతావాది పాల్గొనాలి’’అని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ కోరారు.


Tags:    

Similar News