చేజారి పోతున్న కేసీఆర్ ఆత్మీయులు...ఇపుడు మదన్‌రెడ్డి

గులాబీ బాస్ కేసీఆర్‌కు ఆయన సన్నిహిత నేతలే షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం బీఆర్ఎస్ నేతలే రోజుకొకరు కారు దిగుతున్నారు...

Update: 2024-04-16 03:59 GMT
madanreddy-with-revanth

తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం బీఆర్ఎస్ పార్టీ బీటలు వారుతూనే ఉంది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడం, మరో వైపు గులాబీ బాస్ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడం, తెలంగాణలో కేసీఆర్ కుటుంబం, ఆయన కోటరీ అవినీతి, అక్రమాలపై రోజుకొక కుంభకోణం వెలుగుచూసున్న నేపథ్యంలో కేసీఆర్ సన్నిహితులే ఆ పార్టీకి దూరం అవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బాగోతం, టెలిఫోన్ ట్యాపింగ్, భూ ఆక్రమణలు ఇలా రోజుకొక వ్యవహారం వెలుగుచూస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు కారు దిగి, అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం స్వీకరిస్తున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీని వీడటంతో బీఆర్ఎస్ కు బీటలు వారుతున్నాయి. మరో వైపు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా పేరొందిన వారే రోజుకొకరు పార్టీని వీడుతుండటంతో ఆ పార్టీలో కలవరం మొదలైంది. ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి చిలుమూల మదన్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాల అనంతరం మరి కొంతమంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని నాయకుడొకరు చెప్పారు.


ఉమ్మడి మెదక్ జిల్లాలో బిగ్ షాక్
ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా పేరొందిన మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, సీనియర్ నేత ఎలక్షన్ రెడ్డిలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.కేసీఆర్ ఆప్తులుగా ఉన్న ఇద్దరు కీలక నేతలు సంగారెడ్డి సభకు ఒక్క రోజు ముందే బీఆర్ఎస్ పార్టీని వీడటం ఆ పార్టీలో కలవరం రేపుతోంది. కేసీఆర్ కు కుడిభుజంగా పేరొందిన మదన్ రెడ్డి పార్టీ ఫిరాయింపుతో ఆయన అనుచర గణం కూడా ఆయన వెంటే కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. మదన్ రెడ్డితోపాటు కేసీఆర్ కు మరో సన్నిహిత నాయకుడు ఎలక్షన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారితోపాటు పలు గ్రామాల సర్పంచులు, ఎంపీపీలు కాంగ్రెస్ బాట పట్టారు.

హరీశ్ రావు బుజ్జగించినా...
పార్టీ వీడుతున్న మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని మాజీమంత్రి హరీశ్ రావు బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. కౌడిపల్లి గూడలోని మదన్ రెడ్డి ఇంటికి హరీశ్ రావు, సునీతా లక్ష్మారెడ్డి వచ్చి బుజ్జగించినా వినకుండా హైదరాబాద్ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరారు.2014,2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యేగా మదన్ రెడ్డి విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈయనకు కేసీఆర్ టికెట్ నిరాకరించారు. 2023లో నర్సాపూర్ అసెంబ్లీ టికెట్ ను సునీతా లక్ష్మారెడ్డికి ఇస్తూ మదన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామని కేసీఆర్ హామి ఇచ్చారు. మెదక్ ఎంపీ స్థానాన్ని ఆశించిన మదన్ రెడ్డి ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

నాడు కేసీఆర్ సన్నిహిత నాయకుడిగా మదన్ రెడ్డి


 


ప్రతీకారం తీర్చుకుంటా... కేసీఆర్‌కు మదన్ రెడ్డి వార్నింగ్
తనను నమ్మించి మోసం చేసిన కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకుంటానని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా బీఆర్ఎస్ పార్టీని అంటిపెట్టుకొని ఉంటే ఎంపీ టికెట్ ఇస్తానని మాట ఇచ్చి కేసీఆర్ తనను మోసం చేశాడని మదన్ రెడ్డి ఆరోపించారు. నలుగురి కమిటీ ముందు తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేసీఆర్ తనకు స్వయంగా చెప్పారని మదన్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డిలో కేసీఆర్ సభకు ఒక రోజు ముందు మైనంపల్లి హన్మంతరావుతో చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ చేసిన మోసానికి ప్రతీకారంగా మెదక్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తానని మదన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధిని చూసి, వారి మేనిఫెస్టోను చూసి ఆకర్షితుడినై కాంగ్రెస్ పార్టీలో చేరానని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి వివరించారు.

బిడ్డనే జైలులో పడ్డాక ఆ పార్టీలో ఎవరుంటారు?
బీఆర్ఎస్ అధినేత కుమార్తె కల్వకుంట్ల కవిత జైలులో పడ్డాక ఆ పార్టీలో ఎవరుంటారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కేసీఆర్ సన్నిహితుడు ఎలక్షన్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘గజ్వేల్ ఎమ్మెల్యే ఎలక్షన్ రెడ్డి అని కేసీఆర్ గతంలో చాలాసార్లు నాకు చెప్పాడు, ఇలా అన్నీ అబద్ధాలే చెపుతాడు’’ అని ఎలక్షన్ రెడ్డి పేర్కొన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్, విద్యుత్, కాళేశ్వరం ఇలా వరుస కుంభకోణాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలో ఎవరుంటారని ఎలక్షన్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు.


Tags:    

Similar News