‘సింగపూర్‌ కన్నా మన దగ్గర వనరులు ఎక్కువే’

తెలంగాణలో అటవీ ప్రాంతాలు, నదులు, జలపాతాలకు కొదవేముందన్న సీఎం రేవంత్.;

Update: 2025-08-12 13:22 GMT

సింగపూర్‌తో పోల్చుకుంటే తెలంగాణ దగ్గర అద్భుతమైన ఎకో టూరిజం వనరులు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వాటన్నింటిని వినియోగించుకుని తెలంగాణను ఎకో టూరిజంకు డిస్టినేషన్‌గా మార్చాలని అధికారులకు సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అటవీశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలిచ్చారు. ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని, అందుకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. సింగపూర్‌ లాంటి దేశాల్లో 30 ఎకరాల స్థలంలోనే నైట్ సఫారీలు ఉన్నాయని, తెలంగాణలో అటవీ ప్రాంతాలు, నదులు, జలపాతాలకు కొదవేముందని అడిగారు. ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.

మ‌న ద‌గ్గ‌ర అమ్రాబాద్‌, క‌వ్వాల్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్టులున్నా తెలంగాణ వాసులు ఇత‌ర రాష్ట్రాల్లోని బందీపూర్‌, త‌డోబా వంటి ప్రాంతాల‌కు పులుల సంద‌ర్శ‌న‌కు వెళుతున్నార‌ని సీఎం అన్నారు. అమ్రాబాద్, క‌వ్వాల్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్టుల‌కు సంద‌ర్శ‌కుల సంఖ్య పెంచేలా సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని సీఎం ఆదేశించారు. అట‌వీ, రెవెన్యూ శాఖ‌ల మ‌ధ్య భూ వివాదాల ప‌రిష్కారానికి సంయుక్త స‌ర్వే చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు. క‌లెక్ట‌ర్లు ఈ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌న్నారు. వ‌రంగ‌ల్ కాక‌తీయ జూ అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని సీఎం సూచించారు. హైద‌రాబాద్ త‌ర్వాత రాష్ట్రంలో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్‌లో జూ ను ప్ర‌భుత్వ‌-ప్రైవేటు భాగ‌స్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవ‌కాశాల‌పై అధ్య‌య‌నం చేయాల‌న్నారు.

అట‌వీ జంతువుల దాడిలో మృతిచెందిన లేదా గాయ‌ప‌డిన వారికి, ప‌శువులు, పెంపుడు జంతువులు కోల్పోయిన వారికి త‌క్ష‌ణ‌మే ప‌రిహారం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకు సీఎం ఆర్ఎఫ్ నుంచి అవ‌స‌ర‌మైన మేర‌కు నిధులు వినియోగించుకోవాల‌ని సీఎం సూచించారు. అట‌వీ శాఖ ప‌రిధిలో చేప‌డుతున్న ర‌హ‌దారులు, ఇత‌ర అభివృద్ధి ప‌నుల‌కు అవ‌స‌ర‌మైన అనుమ‌తుల విష‌యంలో అట‌వీ శాఖ‌, ఆయా ప‌నులు చేప‌డుతున్న శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని సీఎం సూచించారు. కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ నుంచి అనుమ‌తులను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా సాధించాల‌న్నారు.

అడ‌వుల్లో వ‌న్య ప్రాణుల సంర‌క్ష‌ణ‌, వాటి క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నించేందుకు ఏర్పాటు చేసిన కెమెరాల‌న్నింటిని క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ కు అనుసంధానించాల‌ని సీఎం ఆదేశించారు. అట‌వీ శాఖ‌లో అధికారుల కొర‌త‌పైనా సీఎం ఆరా తీశారు. రాష్ట్రానికి త‌గిన సంఖ్య‌లో ఐఎఫ్ఎస్ అధికారుల కేటాయింపుపై కేంద్రంతో సంప్ర‌దించాల‌ని సీఎస్‌కు సూచించారు. అట‌వీ శాఖ‌లో ప్ర‌మోష‌న్లు... ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించిన ప్ర‌తిపాద‌న‌లను త‌క్ష‌ణ‌మే సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. శాఖ‌లో ఉత్త‌మ ప‌ని తీరు క‌న‌బ‌ర్చుతున్న వారికి అవార్డుల‌ను ఇచ్చే ప్ర‌క్రియ‌ను పున‌రుద్ధ‌రించాల‌ని సీఎం సూచించారు.

Tags:    

Similar News