SC,ST రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీం ఆమోదం... రేవంత్ కీలక ప్రకటన
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. విద్య, ఉద్యోగ, ఇతర రంగాల్లో ఉపకులాలకు ప్రయోజనం చేకూరేలా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పిన నేపథ్యంలో గురువారం శాసనసభ వేదికగా సీఎం కీలక ప్రకటన చేశారు.
సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ అమలుపై అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతోన్న ఉద్యోగ నియామకాల ప్రక్రియలో కూడా మాదిగ, మాదిగ ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు చర్యలు చేపడుతామని, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకోస్తామని సీఎం తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై 2023 డిసెంబర్ 23న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, అడ్వకేట్ జనరల్ ఢిల్లీకి వెళ్లి, సుప్రీంకోర్టులో ఈ కేసు విజయవంతం అయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు సీఎం పేర్కొన్నారు.
కాగా, గురువారం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఎస్సీ వర్గీకరణను సర్వోన్నత న్యాయస్థానం సమర్ధించింది. వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందన్న ధర్మాసనం.. విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కోసం వర్గీకరణ సముచితమే అని తెలిపింది.