మూసీ నిర్వాసితులకు మధుయాష్కీ భరోసా.. హైడ్రాకు బ్రేకులు..
మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా నది పరివాహక ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దీంతో మూసీ నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా నది పరివాహక ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దీంతో మూసీ నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి కాంగ్రెస్ నేత, టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ మధుయాష్కీగౌడ్ భరోసా ఇచ్చారు. ఎవరూ భయపడాల్సిన, భంగపడాల్సిన అవసరం లేదని, ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. చైతన్యపురి డివిజన్ ఫణిగిర కాలనీలో మూసీ పరివాహక వాసులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. మూసీ ప్రక్షాళను ప్రభుత్వం గుడ్డిగా చేయడం లేదని, నిర్వాసితుల విషయంలో అన్ని విధాలా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. నగరం లోపల మూసీ, శివారు ప్రాంతాల్లోని మూసీ నది వేరని అన్నారు. చైతన్యపురి, కొత్తపేట, నాగోల్ వంటి ప్రాంతాల్లో మూసీ చాలా విశాలంగా ఉందని, అక్కడ పేదలు ఇళ్లు కోల్పోకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఇళ్లు లేని ప్రాంతాల్లో భూసేకరణ చేసేలా ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారా మధుయాష్కీ.
ప్రజల సందేహాలను నివృత్థి చేయడం కోసం కొందరిని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గరకు తానే స్వయంగా తీసుకెళ్లి మాట్లాడిస్తానని చెప్పారు. ప్రజలతో చర్చించకుండా ఒక్క ఇళ్లు కూడా అన్యాయంగా కూల్చమని అన్నారు. ఎవరూ ఆందోళన పడొద్దని, ప్రభుత్వం ప్రజలను అనాథలను చేయొదని స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల సంక్షేమమే ప్రాధాన్యంగా తీసుకుంటుందే తప్ప, గుడ్డిగా అడుగులు వేయదని, ప్రస్తుతం రాష్ట్రం ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉందని, కాబట్టి ఎవరూ భయపడొద్దని మరోసారి పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో రోజురోజుకూ మూసీ నిర్వాసితుల సమస్య మరింత పెద్దది అవుతున్న క్రమంలో ప్రభుత్వమే దిగొచ్చినట్లు కూడా తెలుస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలకు సంబంధించి హైడ్రా అధికారులకు ప్రభుత్వ పెద్దలు పలు కీలక ఆదేశాలను మౌఖికంగా ఇచ్చారని సమాచారం.
భఫర్ జోన్‌లు, నదీ పరివాహక ప్రాంతాల్లోని నిర్వాసితులకు పునరావాసం, ప్రత్యామ్నాయం చూపే వరకు కూల్చివేతలను చేపట్టొద్దని ప్రభుత్వం చెప్పడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రారంభించిన కూల్చివేతల అంశంలో రెవెన్యూ శాఖ వెనకడుగు వేసినట్లు సమాచారం. ఇప్పటికే నదీ గర్భంలో సైతం రెడ్మార్కింగ్ ఆగిపోగా, మార్క్ చేసిన, డబుల్ బెడ్‌రూమ్‌లను తరలించిన వారి ఇళ్లలో కూడా కొన్నింటిని మాత్రమే కూల్చారు అధికారులు. కూల్చివేతలను మూసీ నిర్వాసితులు తీవ్రంగా ఖండిస్తుండటంతో అధికారులు కూడా అటు వెళ్లడానికి శంసయిస్తున్నారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నా.. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారింది.
ప్రత్యామ్నాయమే అసలు ప్రశ్న
మూసీ నదీ ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేయాలని, శరవేగంగా పనులు పూర్తి చేయాలని చూస్తున్నా.. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం వారికి ప్రధాన సమస్యగా మారింది. అధికారిక లెక్కల ప్రకారం 2,166 డబుల్ బెడ్‌రూమ్‌లు అవసరం ఉంది. అందులో హైదరాబాద్ జిల్లాలో 1,595, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో 239, రంగారెడ్డిలో 332 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని 14 డబుల్ బెడ్రూమ్ సముదాయాల్లో కలుపుకున్న 500కు పైగా ఇళ్లు కూడా ఖాళీ లేవని సమాచారం. వీటిని పునరావాసంగా అందించిన మూసీ నిర్వాసితుల్లో 10 శాతం కుటుంబాలకు సరిపోతాయి. దీంతో ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సమస్య పునరావాసమే అని అధకారులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.