Seethakka | ‘ఆదివాసీలను కార్పొరేట్ కంపెనీలు చంపుతున్నాయి’

అటవీ ప్రాంతాల్లో నీళ్లు, అడవులను కార్పొరేట్ సంస్థలు ఆక్రమిస్తున్నాయని మండిపడ్డ మంత్రి సీతక్క.;

Update: 2025-08-09 13:18 GMT

ఆదివాసీల పరిస్థితులపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీల హక్కులను, మూలాలను కాపాడుకోవాల్సిన అవరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, రాజ్యాంగం లేకపోతే ఆదివాసీలకు దాని ఫలాలు అందవని అన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆదివాసీలకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి ఆదివాసీ కూడా తమ మూలాలను కాపాడుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎంత ఎత్తుకు ఎదిగినా జాతి గొప్పతనం, మూలాలు, సంస్కృతి జీవన విధానాలను ఎప్పుడూ మర్చిపోకుండా కాపాడుకోవాలని ఆమె సూచించారు. మన మూలాలే మన అస్తిత్వమని, వాటిని కాపాడుకోవాలని అన్నారు.

‘‘దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు.. అటవీ ప్రాంతాల్లో నీళ్లు, అడవులను ఆక్రమిస్తున్నాయి. ఆ విషయాన్ని ప్రశ్నిస్తే ఆదివాసీ బిడ్డలను చంపుతున్నాయి. రాజ్యాంగంలో ఆదివాసీలకు కల్పించిన హక్కులు తెలియని వారు అనేకమంది ఉన్నారు. వారికి ఈ హక్కులను తెలియజేయాల్సిన బాధ్యత ఆదివాసీ విద్యార్థి, ఉద్యోగ సంఘాలదే. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. ఎన్ని సమస్యలు ఉన్నా విద్యను వదులుకోలేదు. అందుకే విద్యా రంగంలో ఆదివాసీలు రాణించాలి. ఎదిగిన ఆదివాసీలు సమాజం కోసం కొంత సమయం తప్పకుండా కేటాయించాలి’’ అని కోరారు.

‘‘పరతి ఆదివాసీ విద్యార్థి ఆదివాసీ చరిత్రను వెలికి తీయండి. ఆదివాసీల ఆనవాళ్లను గుర్తించండి. మన చరిత్ర రికార్డ్ చేయండి. అప్పుడే మన సంస్కృతి భవిష్యత్ తరాలకు బలంగా తెలయజేయాలి. ప్రకృతి మీద ఆధారపడి ఎదిగే జాతి మనది. ఈ ప్రత్యేకతను మనం కాపాడుకోవాలి. అంతరించిపోకుండా కాపాడుకోవాలి’’ అని అన్నారు.

Tags:    

Similar News