సైబర్ బానిసలుగా తెలుగు యువత ?

ఎన్నో ఆశలతో విదేశాల్లో అడుగుపెట్టిన యువతలో చాలామందికి ఉద్యోగాలు, జీతాల మాట దేవుడెరుగు ప్రత్యక్షనరకం అంటే ఏమిటో కళ్ళముందే ప్రత్యక్షమవుతోంది.;

Update: 2025-02-18 07:51 GMT
Cyber Slavery in foreign countries


*కరీంనగర్ కు చెందిన రవికుమార్ అధిక జీతానికి సాఫ్ట్ వేర్ ఉద్యోగం వస్తోందని చెప్పి థాయ్ ల్యాండ్ వెళ్ళాడు.


*మణికంఠ అనే యువకుడికి చైనాలో మంచిజీతంతో సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగంవస్తే సంతోషంగా వెళ్ళాడు.

రవికుమార్, మణికంఠ అనేకాదు చాలామంది తెలుగుయువత ఈమధ్య ఎక్కువగా అధికజీతానికి ఆశపడి విదేశాలకు వెళుతున్నారు. మరింతమంది యువత విదేశాలకు వెళ్ళి సాఫ్ట్ వేర్(Soft ware) రంగంలో మంచిజీతాలతో ఉద్యోగాలు చేస్తున్నారా ? అంటే లేదనే చెప్పాలి. కారణం ఏమిటంటే వీళ్ళకు జాబ్ ఆఫర్లు వచ్చింది వాస్తవమే కాని అందులో చాలావరకు బోగస్ సాఫ్ట్ వేర్ కంపెనీలే. సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతాలపేరుతో యువతను బుట్టలో వేసుకుని, ఆశలు చూపించి తమ దేశాలకు పిలిపించుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. ఎన్నో ఆశలతో విదేశాల్లో అడుగుపెట్టిన యువతలో చాలామందికి ఉద్యోగాలు, జీతాల మాట దేవుడెరుగు ప్రత్యక్షనరకం అంటే ఏమిటో కళ్ళముందే ప్రత్యక్షమవుతోంది.

దేశంలో ఇపుడు జరుగుతున్న నేరాలు సరిపోవన్నట్లుగా కొత్తరకమైన నేరవ్యవస్ధ వేళ్ళూనుకుంటోంది. అదేమిటంటే ‘సైబర్ స్లేవరి’(Cyber slavery) అదే సైబర్ నేరాల్లో(Cyber crimes) బానిసలుగా చేసుకోవటం. మనదేశం నుండి ముఖ్యంగా తెలుగుయువతను చైనా(China), మయన్మార్, థాయ్ ల్యాండ్(Thailand), తాయ్ వాన్ దేశాల్లోని సైబర్ నేరగాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. పై దేశాల్లోని కొన్ని కంపెనీలు మనదేశంలోని ఏజెంట్ల ద్వారా యువతను ఉద్యోగాల్లో రిక్రూట్ చేసుకుంటున్నాయి. మనదేశం నుండి వాళ్ళదేశాలకు పిలిపించుకోగానే మొదలవుతుంది అసలు సమస్య. ఎలాగంటే యువత పై దేశాల్లో అడుగుపెట్టగానే ముందుగా వాళ్ళ పాస్ పోర్టులు, మొబైల్ ఫోన్లు, ట్రావెల్ డాక్యుమెంట్లను కంపెనీల ప్రతినిధులు తీసేసుకుంటన్నారు. అక్కడినుండి యువతను కంపెనీలకు తీసుకుని వెళుతున్నారు. వెంటనే ఆఫీసులకు తీసుకెళ్ళి ఉద్యోగాల్లోకి దింపేస్తున్నారు.

ఇంతకీ వాళ్ళు చేయాల్సిన ఉద్యోగాలు ఏమిటంటే కాల్ సెంటర్ల(Call centres)లో కూర్చుని సైబర్ మోసాలు చేయటమే. క్రిప్టోకరెన్సీ(Crypto currency)లో పెట్టుబడులు పెట్టమని, ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే నిముషాల్లోనే అప్పులిస్తామని, క్రికెట్ బెట్టింగ్(Cricket betting) యాప్ లో పెట్టుబడులు పెడితే అత్యధిక రిటర్నులు అందుకోవచ్చని..ఇలా రకరకాలుగా జనాలకు ప్రతిరోజు ఫోన్లుచేసి ఆకర్షించి, మాయమాటలు చెప్పి వాళ్ళని ఒప్పించి పెట్టుబడులు రాబట్టడమే ఉద్యోగాల్లో చేరిన యువత పని. పై దేశాలకు బయలుదేరేముందు దేశంలో ఏజెంట్లు చెప్పిన ఉద్యోగాలు, కంపెనీ వేరు. విదేశాల్లోకి అడుగుపెట్టిన తర్వాత చేస్తున్న పనివేరు. రెండింటికి ఏమాత్రం పొంతనుండటంలేదని యువతకు అర్ధమైనా చేయగలిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే రోజువారి టార్గెట్లను చేరుకోకపోతే కంపెనీల యాజమాన్యాలు యువతకు నరకం చూపిస్తున్నారు.

ఒకవేళ వాళ్ళు చెప్పినట్లుగా సైబర్ నేరాలు చేయటానికి ఇష్టపడకపోతే రోజుల తరబడి తిండిపెట్టకపోగా చచ్చేట్లుగా కొడతారు. తిండిదాకా ఎందుకు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వరు. ఒకటిరెండు రోజులు బెట్టుచేసినా చివరకు సైబర్ నేరగాళ్ళు చెప్పినట్లు చేయకతప్పటంలేదు యువతకు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖలోని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ లెక్కల ప్రకారం 2022-2024 మధ్యలో కాంబోడియా, వియత్నాం, మయన్మార్, థాయ్ ల్యాండ్ కు విజిటింగ్ వీసా మీద వెళ్ళిన 29,466 మంది మాయమైపోయారు. విజిటింగ్ వీసాపై పై దేశాల్లో అడుగుపెట్టిన వాళ్ళల్లో ఎవరూ మనదేశానికి తిరిగిరాలేదు. పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, తెలంగాణకు చెందిన 20-39 మధ్య వయసుల వాళ్ళే ఎక్కువమంది పై దేశాలకు వెళ్ళారు. వీళ్ళల్లో కూడా మెజారిటి యువత వెళ్ళింది థాయ్ ల్యాండ్ కే అని సమాచారం. అనధికారిక సమాచారం ఏమిటంటే వీళ్ళంతా పై దేశాల్లో అక్రమంగా ఏర్పాటుచేసిన కాల్ సెంటర్లలో సైబర్ బానిసలుగా పనిచేస్తున్నారు.

విదేశాలకు వెళుతున్న యువతలో ఇంగ్లీషు బాగా మాట్లాడగలిగిన వాళ్ళను అమెరికా, ఇంగ్లాండ్ లోని భారతీయులను ఆకర్షించేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఇంగ్లీషు మాట్లాడటం అంతంతమాత్రంగానే వచ్చిన వాళ్ళను భాషల వారీగా వర్గీకరించి వాళ్ళని తమరాష్ట్రాల్లోని జనాలను ఆకర్షించి మోసంచేయటకోసమే ప్రయోగిస్తున్నారు. అంటే పంజాబి మాట్లాడగలిగిన యువతను పంజాబ్ జనాలతో మాట్లాడేందుకు, తెలుగు మాట్లాడే యువతను తెలుగురాష్ట్రాల్లో మాట్లాడేందుకు, తమిళ యువతను తమిళజనాలతో మాట్లాడిస్తున్నారు. సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కినయువతకు ఇష్టంలేకపోయినా వాళ్ళుచెప్పినట్లు వినకతప్పదు. ఎందుకంటే పాస్ పోర్టుతో పాటు ఇతర ట్రావెల్ డాక్యుమెంట్లను కూడా ముందే లాగేసుకుంటున్నారు. ఒకవేళ వీళ్ళబారినుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే చంపేస్తున్నారు. ఆ దేశాల్లో మనదేశం నుండి వెళ్ళినవాళ్ళు అనధికారికంగానే నివసిస్తున్నారు కాబట్టి బతికినా, చచ్చినా ఆ దేశాల్లోని ప్రభుత్వాలు పట్టించుకోవటంలేదు.

మిగిలేది ఎదురుచూపులేనా ?

విదేశాల్లో ఉద్యోగాలకని వెళ్ళిన పిల్లల నుండి సమాచారం కోసం వేలాదిమంది తల్లి, దండ్రులు ఏళ్ళతరబడి ఎదురుచూస్తున్నారు. ఉద్యోగాల్లో చేరారో లేదో తెలీదు, వేళకు తిండి తింటున్నారో లేదో తెలీదు. పిల్లల నుండి ఫోన్లు రాకపోతే తామైనా ఫోన్లు చేద్దామంటే వీలుండటంలేదు. విదేశాలకు వెళ్ళిన తమపిల్లలు ఎలాగున్నారో తెలీక, క్షేమసమాచారాలు తెలుసుకునే అవకాశాల్లేక తల్లి, దండ్రులు పడుతున్న బాధలు వర్ణనాతీతాలు. వైజాగ్ నుండి చైనాలో ఉద్యోగంకోసం వెళ్ళిన మణికంఠ విషయం తాజాగా వెలుగుచూసింది. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధికి మణికంఠ ఫోన్లో పంపిన మెసేజ్ చూసిన వాళ్ళ మనసులను కలచివేస్తోంది. మణికంఠ ఏమి చెప్పాడంటే ‘తాను చైనాలోని ఒక కాల్ సెంటర్లో ఇరుక్కుపోయాడ’ట. ‘ఇండియాలో తనకు జాబ్ ఆఫర్ చేసిన కంపెనీకి చైనాలో అడుగుపెట్టిన తర్వాత తనతో పనిచేయించుకుంటున్న కంపెనీకి సంబంధమే లేద’న్నాడు. దేశంలోని ఏజెంట్ చేతిలో మోసపోయినట్లు చైనాలో అడుగుపెట్టిన తర్వాతే మణికంఠకు అర్ధమైంది. అయితే విషయం అర్ధమయ్యేటప్పటికే బాగా ఆలస్యమైపోయింది. చైనాలో దిగగానే మణికంఠ దగ్గర నుండి పాస్ పోర్టు, ట్రావెల్ డాక్యుమెంట్లు కాల్ సెంటర్ వ్యక్తులు లాగేసుకున్నారు.

చాలా దేశాల్లాగే పాస్ పోర్టు, ట్రావెల్ డాక్యుమెంట్లు లేకుండా చైనాలో బయటతిరగటం చాలా ప్రమాదం. పైగా కాల్ సెంటర్ లోకి అడుగుపెట్టిన మణికంఠను కంపెనీ యాజమాన్యం బయటకు అడుగుపెట్టనీయటంలేదు. తనతో పాటు కంపెనీలో అడుగుపెట్టిన మరకొంతమందికి ఫేక్ గుర్తింపుకార్డులు ఇచ్చి ఇండియాలోని జనాలతో మాట్లాడిస్తున్నారు. అందులో కూడా అమెరికాలో నివసిస్తున్న భారతీయులతోనే ఎక్కువగా మాట్లాడించి, మాయమాటలు చెప్పి ఆకర్షించి పెట్టుబడులు పెట్టాలని ఒప్పించేట్లుగా చావగొడుతున్నారు. ముఖ్యంగా హై రిటర్న్ వచ్చే క్రిప్టోకరెన్సీ, బెట్టింగ్ యాప్ లో పెట్టుబడులు పెట్టేట్లుగా పనిచేయిస్తున్నారు. ఎవరైనా జనాలు వీళ్ళ మాటలకు మోసపోయి పెట్టుబడులు పెడితే ఇక అంతేసంగతులు. ఎలాగంటే పెట్టుబడులు పెట్టిన జనాలు హై రిటర్న్ ఆశిస్తారు. అందుకనే పెట్టిన పెట్టుబడులకు అత్యధిక లాభాలు వచ్చినట్లుగా జనాలకు మెసేజీలు, మొబైల్ స్క్రీన్ షాట్లు పెడతారు. దాంతో తమ పెట్టుబడులకు అత్యధిక లాభాలు వస్తున్నట్లు జనాలు హ్యాపీగా ఫీలవ్వటమే కాకుండా మరో పదిమందికి చెప్పి పెట్టుబడులు పెట్టిస్తున్నారు.

అయితే కొంతకాలం తర్వాత తమ పెట్టుబడులను, లాభాలను తీసుకుందామని జనాలు ప్రయత్నించగానే బ్యాంకు ఖాతాలు పనిచేయటంలేదనే సమాచారం అందుతుంది. దాంతో పెట్టుబడిదారులు లబోదిబోమంటు రోడ్డున పడతారు. ఇంతకీ విషయం ఏమిటంటే జనాలు పెట్టుబడులు పెట్టడం వరకే నిజం. ఇక ఆ తర్వాతంతా మాయాబజారే అంటే మొత్తం మోసమే. బ్యాంకులు, బ్యాంకు ఖాతాలు మోసం, కంపెనీ ఖాతాలు మోసం. వ్యాపారంచేయటం, లాభాలు ఆర్జించటం అంతా మోసమే. పెట్టిన పెట్టుబడులకు లాభాలు వచ్చినట్లుగా ఉత్తుత్తి మెసేజీలు, స్క్రీన్ షీట్లను సైబర్ నేరగాళ్ళు ఖాతాదారులకు పంపుతుంటారు. అవంతా నిజమేని భ్రమపడి అవసరానికి ఖాతాల్లో నుండి డబ్బులు డ్రా చేద్దామని పెట్టుబడిదారులు ప్రయత్నించినపుడు తెలుస్తుంది తాము మోసపోయామని.

చైనా కంపెనీలో రు. 80 వేల జీతంతో ఉద్యోగమని వెళ్ళిన మణికంఠలాగే అదేకంపెనీలో ఇంకా చాలామంది పనిచేస్తున్నారు. టార్గెట్లు రీచ్ కాలేదనో లేకపోతే రకరకాల కారణాలు చెప్పి చివరకు చేతిలో పెడుతున్నది నెలకు రు. 15 వేలు మాత్రమే. ఎవరైనా పనిచేయటానికి నిరాకరిస్తే అలాంటి వాళ్ళని చచ్చేట్లు కొట్టి, మంచినీళ్ళు, భోజనం కూడా ఇవ్వకుండా వారాల తరబడి చీకటికొట్టాల్లో పడేస్తున్నారని మణికంఠ టైమ్స్ ప్రతినిధికి చెప్పాడు. తాము పనిచేస్తున్న కాల్ సెంటర్ నుండి తప్పించుకునే మార్గంకూడా లేదన్నాడు. ఎందుకంటే కంపెనీ భవనానికి చుట్టూ మూడంచెల బాగా ఎత్తయిన కాంపౌండ్ వాల్సున్నాయి. రాత్రి, పగలు ప్రైవేటు ఆర్మీ ఆయుధాలతో కాపాల కాస్తున్నారు. అడుగడుగునా సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ఉద్యోగుల ప్రతికదలికా సీసీ కెమెరాల ద్వారా కంపెనీ యాజమాన్యానికి తెలిసిపోతుంది. ఇంతకట్టుదిట్టమైన ఏర్పాటున్న కంపెనీ నుండి తప్పించుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే అప్పటినుండి మళ్ళీ సదరు వ్యక్తులు కనబడరంతే. తనతో పాటు హైదరాబాద్ కు చెందిన కైకలూరు సంతోష్ అనే యువకుడితో పాటు మరో గుజరాత్ యువకుడు కూడా ఉన్నట్లు మణికంఠ చెప్పాడు.

చైనాలోనే కాకుండా థాయ్ ల్యాండ్, మయన్మార్ లో కూడా ఇలాగే సైబర్ బానిసలుగా పనిచేస్తు తప్పించుకునే ప్రయత్నాలు చేసిన కొందరు తర్వాత కనబడలేదని, మరికొందరు భద్రతాదళాలకు సరిహద్దులో దొరికి జైలుపాలైనట్లు మణికంఠ వివరించాడు. కాల్ సెంటర్ వాళ్ళే సరిహద్దుల్లోని భద్రతాదళాలకు సమాచారం ఇచ్చి తప్పించుకున్న వాళ్ళని పట్టుకునేట్లు చేసి, జైళ్ళల్లోకి తోస్తున్నట్లు మణికంఠ చెప్పాడు. వైజాగ్ కు చెందిన మణికంఠ వ్యవహారం లాంటిదే కరీంనగర్ కు చెదిన రవికుమార్ ఉదంతం కూడా. మంచి ఉద్యోగం, పెద్దజీతం అనే ఆశలతో పోయిన ఏడాది ఏప్రిల్ ల్లో థాయ్ ల్యాండ్ లో అడుగుపెట్టిన రవి విషయం మళ్ళీ ఏమైందో తెలీలేదు. పై దేశాలు మనదేశంలోని యువతను సైబర్ బానిసలుగా చేసుకుంటున్నాయని, మోసాలకు పాల్పడుతున్నాయని కేంద్రప్రభుత్వానికి బాగా తెలుసు. అయినా ఏమీచేయలేక చేష్టలుడిగి చూస్తోంది. కారణం ఏమిటంటే పై దేశాలకు వెళుతున్న యువత ఉద్యోగాల పేరుతోనో లేకపోతే విజిట్ వీసాపైన లేకపోతే టూరిస్ట్ వీసాతోనో వెళుతున్నారు. ఆయా దేశాలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి దేశానికి రాకపోతే కారణాలు ఏమయ్యుంటాయో తెలుసుకునేందుకు విదేశీమంత్రిత్వ శాఖ ఎంత ప్రయత్నించినా సమాచారం దొరకటంలేదు. అందుకనే విషయాలు పూర్తిగా తెలిసినా పై దేశాలపై మనప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోంది. అదృష్టంకొద్ది కొంతమందిని తిరిగి దేశానికి రప్పించినా అడ్రస్ లేని వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంటోంది. మరిలాంటి కొత్తతరహా సైబర్ స్లేవరీకి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందో ఏమో చూడాలి.

Tags:    

Similar News