అలా చెప్పిన గంటలోనే కండువా మార్చిన దానం నాగేందర్

పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియడం లేదు...దానం సాక్ష్యం. వివరాలు

Update: 2024-03-17 10:34 GMT


పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియడం లేదు. ఇదే పార్టీలో కొనసాగుతా అని చెప్పిన గంటల వ్యవధిలోనే కండువాలు మార్చేస్తున్నారు. బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, సీనియర్ నేత దానం నాగేందర్ వ్యవహారం కూడా ఈ కోవకే చెందుతుంది. పార్టీ మారట్లేదని, బీఆర్ఎస్ లోనే ఉంటానని ప్రకటించిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల దానం నాగేందర్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరతారని, సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేయనున్నారని ప్రచారం మొదలైంది.

అయితే ఆయన రాకను వ్యతిరేకిస్తూ గాంధీ భవన్ వద్ద నిరసనలు కూడా వ్యక్తం అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ మార్పుపై దానం నాగేందర్ స్పందించారు. పార్టీ మారట్లేదని చెప్పారు. కాంగ్రెస్ లో పాత స్నేహితులు కలిస్తే అక్కడే ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశానని చెప్పారు. ఇలా చెప్పిన కాసేపటికే సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇంచార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం విశేషం.

దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనతి కాలంలోనే పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1994, 1999 ఎన్నికల్లో ఆసిఫ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిడిపిలో చేరి ఆసిఫ్ నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో టిడిపి ఓటమిపాలైంది. దీంతో దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు.

నియోజకవర్గాల డీలిమిటేషన్ తర్వాత 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. 2009 లో రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో, కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ నుండి పోటీ చేసి బిజెపి అభ్యర్థి పై ఓటమి చవి చూశారు. 2018 జూన్ లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. అదే సంవత్సరం తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి మళ్లీ పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు.



Tags:    

Similar News