ED hits KTR and Kavitha|కవితలాగే కేటీఆర్ ను ఈడీ గట్టిగా తగులుకుందా ?

ఈడీ అంటే ఏమిటి ? అది తగులుకుంటే ఎలాగుంటుందో కేటీఆర్ కు కూడా పరోక్షంగా తెలిసే ఉంటుంది.అలాంటి ఈడీ(ED) ఇపుడు తననే తగులుకుంటుందని కేటీఆర్ కలలో కూడా ఊహించుండరు.

Update: 2024-12-28 07:27 GMT
Kavitha and KTR

అన్నా, చెల్లెలును ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గట్టిగానే తగులుకుంది. ఈడీ గట్టిగా తగులుకుంటే ఎలాగుంటుందో చెల్లెలు కల్వకుంట్ల కవిత(Kalavakuntla Kavitha)కు బాగా అనుభవమైంది. చెల్లెలును కలవటానికి చాలాసార్లు అన్న కేటీఆర్(KTR) కూడా హైదరాబాద్ నుండి ఢీల్లీకి ప్రయాణంచేశారు. కాబట్టి ఈడీ అంటే ఏమిటి ? అది తగులుకుంటే ఎలాగుంటుందో కేటీఆర్ కు కూడా పరోక్షంగా తెలిసే ఉంటుంది. అలాంటి ఈడీ(ED) ఇపుడు తననే తగులుకుంటుందని కేటీఆర్ కలలో కూడా ఊహించుండరు. ఇంతకీ విషయం ఏమిటంటే కొత్త సంవత్సరం జనవరి 7వ తేదీన విచారణకు హాజరవ్వాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీచేసింది. 7వ తేదీ విచారణ తర్వాత కేటీఆర్ విషయంలో ఈడీ ఎలా వ్యవహరించబోతోందనే విషయంలో యావత్ బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. టెన్షన్ ఎందుకంటే 7వ తేదీ తర్వాత మళ్ళీ మరోసారి విచారణకు రావాలని చెప్పి ఆరోజు పంపేయవచ్చు లేదా అరెస్టూ చేయవచ్చు. అందుకనే ఏమి జరుగుతుందో అనే టెన్షన్ కారుపార్టీ నేతల్లో పెరిగిపోతోంది.

ఫార్ములా ఈ కార్ రేసు(Formula E-Car Race) నిర్వహణ పేరుతో రు. 45 కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Revanth Reddy Government) నిర్ణయానికి వచ్చింది. ముందు ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో అంతర్గత విచారణ చేయించింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విదేశీకంపెనీ అయిన ఫార్ములా ఈ ఆపరేషన్స్(ఎఫ్ఈవో)(FEO) అనే కంపెనీకి హెచ్ఎండీఏ(HMDA) నుండి రు. 45 కోట్లు బదిలీ అయ్యింది. అప్పటి మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి, హెఛ్ఎండీఏ సెక్రటరీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ నిధులను బదిలీచేశారు. నిధులను ఏరూపంలో బదిలీచేశారంటే ఇండియన్ కరెన్సీని పౌండ్లుగా మార్చి మరీ బదిలీచేశారు. నిదుల బదిలీ విషయం ఆర్ధికశాఖకు చెప్పలేదు, క్యాబినెట్ అనుమతి తీసుకోలేదు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) నుండి కూడా అనుమతి తీసుకోలేదు.

తన అనుమతిలేకుండానే విదేశీకంపెనీకి పౌండ్లలో రు. 45 కోట్లను బదిలీచేసినందుకు తెలంగాణాప్రభుత్వానికి(Telangana Government Fined) ఆర్బీఐ సుమారు 8 కోట్ల రూపాయలు జరిమానా కూడా విధించింది. విదేశీకంపెనీకి అర్వింద్ అసలు రు. 45 కోట్లను ఎందుకు బదిలీచేశారంటే అప్పటి మంత్రి కేటీఆర్ నోటిమాటగా చెప్పటంతోనే. ముందు నిధులు బదిలీచేసేయమని తర్వాత అనుమతులు తీసుకుందామని కేటీఆర్ తనతో ఫోన్లో చెప్పటంతోనే రు. 45 కోట్లు బదిలీచేసేసినట్లు అర్వింద్ చీఫ్ సెక్రటరీ విచారణలో చెప్పారు. బదిలీచేసిన మొత్తం+చెల్లించిన జరిమాన తదితరాలు కలిపి రు. 55 కోట్లయ్యింది. ఇదే విషయాన్ని తర్వాత రాతమూలకంగా కూడా అర్వింద్ వాగ్మూలమిచ్చారు. దాని ఆధారంగానే ప్రభుత్వం ఆదేశాలప్రకారం ఏసీబీ కేటీఆర్, అర్వింద్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ సెక్రటరీ బీఎల్ఎన్ రెడ్డి మీద కేసులు నమోదుచేసింది.

ఎప్పుడైతే కేటీఆర్, అర్వింద్, బీఎల్ఎన్ రెడ్డి మీద ఏసీబీ కేసులు నమోదుచేసిందో వెంటనే ఈడీ కూడా రంగంలోకి దిగేసింది. ఏసీబీ నమోదుచేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేటీఆర్, అర్వింద్, బీఎల్ఎన్ రెడ్డి మీద మనీల్యాండరింగ్(Money Laundering), ఫెమా(FEMA) కేసులను నమోదుచేసింది. వహలా(Hawala) కోణంలో కూడా ఈడీ విచారణ చేస్తోంది. మనీల్యాండరింగ్, ఫెమా, హవాలా కోణాలపై విచారణ జరిపేందుకే కేటీఆర్ ను జనవరి 7వ తేదీన హాజరుకావాలని ఈడీ శనివారం నోటీసులు జారీచేసింది. అంతకన్నా ముందు అంటే జనవరి 2వ తేదీన అర్వింద్, 3వ తేదీన బీఎల్ఎన్ రెడ్డిని కూడా విచారణకు హాజరవ్వాలని ఈడీనోటీసులు జారీచేసింది. మనీల్యాండరింగ్, ఫెమా చట్టాల కింద కేసు నమోదుచేసిందంటే చాలా గట్టిగానే విచారణ చేయబోతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పై చట్టాల కింద కేసునమోదుచేసి సాక్ష్యాలు దొరికాయంటే కేటీఆర్ ను ఈడీ తొందరగా వదిలిపెట్టదు. ఈడీ కూడా అంతర్గతంగా విచారణ జరిపి మనీల్యాండరింగ్, ఫెమా చట్టాల కింద కేసులు నమోదు చేయవచ్చన్న ప్రాధమిక నిర్ణయానికి వచ్చిన తర్వాతే పై చట్టాలకింద కేసులు నమోదుచేసిందని సమాచారం.

కొద్దిరోజులు వెనక్కువెళితే ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) లో సౌత్ గ్రూప్ తరపున కీలకపాత్రని కేసులు నమోదుచేసిన ఈడీ కల్వకుంట్ల కవితను అరెస్టుచేసిన విషయం తెలిసిందే. కవితపైన కూడా ఈడీ మనీల్యాండరింగ్ చట్టం ప్రయోగించింది. దాని ఫలితంగానే కవిత ఆరుమాసాలు ఢిల్లీలోని తీహార్ జైలు(Tihar Jail)లో గడపాల్సొచ్చింది. బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్నికారణాలను చూపించినా కోర్టు బెయిల్ ఇవ్వలేదు. అతికష్టంమీద 6 మాసాలు జైలులో ఉన్న తర్వాత మాత్రమే కవితకు బెయిల్ దొరికింది. కేటీఆర్ విషయంలో కూడా ఈడీ అంతేగట్టిగా వ్యవహరించే అవకాశాలను కొట్టిపారేసేందుకు లేదు.

మనీల్యాండరింగ్ జరిగిందో లేదో ఇపుడే చెప్పలేకపోయినా ఫెమా చట్టం కింద గట్టిగా తగులుకోవటం ఖాయమని అర్ధమవుతోంది. ఎలాగంటే విదేశీకంపెనీకి నిదులు చెల్లించాలంటే అందుకు ఆర్బీఐ అనుమతి తప్పకుండా తీసుకోవాలి. ఫార్ముల కార్ రేసుకు సంబందించి ఎఫ్ ఈవో కంపెనీకి రు. 45 కోట్లను బదిలీచేసేముందు ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు. అనుమతి తీసుకోకుండా నిధులు బదిలీచేశారు కాబట్టే ప్రభుత్వానికి ఆర్బీఐ జరిమానా విదించింది. జరిమానా కట్టింది కాబట్టి తెలంగాణా ప్రభుత్వ తప్పుచేసినట్లు అర్ధమైపోతోంది. కేటీఆర్ ఆదేశాలమేరకే తాను నిధులు బదిలీచేసినట్లు ఇప్పటికే అర్వింద్ రాతపూర్వకంగా వాగ్మూలమిచ్చారు. దాని ఆధారంగానే ఏసీబీ కేసు నమోదుచేసింది. కాబట్టి ఫెమ చట్టాన్ని మంత్రిగా కేటీఆర్ ఉల్లంఘించారనే కేసు బలంగా ఉండచ్చని అర్ధమవుతోంది. కేటీఆర్ నిర్వాకం వల్లే ఆర్బీఐకి ప్రభుత్వం కోట్లరూపాయలు జరిమానా కట్టాల్సొచ్చిందనే యాంగిల్ బలంగా కనబడుతోంది. దీన్ని కేటీఆర్ కూడా కాదనలేరు. ఇప్పటికే తన ఆదేశాల మేరకే అర్వింద్ నిధులు బదిలీచేసినట్లు స్వయంగా కేటీఆరే మీడియా ముందు అంగీకరించారు. కాబట్టి అప్పట్లో చెల్లెలు కవిత తగులుకున్నట్లే ఇపుడు అన్న కేటీఆర్ కూడా ఈడీ చేతిలో గట్టిగా తగులుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెల్లెలు మీద మనీల్యాండరింగ్ చట్టం ఒకటే పడితే ఇపుడు అన్నమీద మనీల్యాండరింగ్ చట్టానికి తోడు ఫెమా చట్టం ఉల్లంఘన కూడా తోడైంది.

ఢిల్లీకి తీసుకెళతారా ?

ఒకవేళ కేటీఆర్ ను ఈడీ అరెస్టుచేసేట్లుగా ఉంటే విచారణ పేరుతో ఢిల్లీకి తీసుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కేటీఆర్ ను హైదరాబాద్ లో విచారించి అరెస్టు చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేటీఆర్ అరెస్టు విషయమై ఇప్పటికే పార్టీ నేతలు చాలా తీవ్రంగా ప్రభుత్వానికి వార్నింగులు ఇస్తున్న విషయం తెలిసిందే. కేటీఆర్ ను ఏసీబీ అరెస్టుచేస్తుందనే అనుమానం పార్టీ నేతల్లో ఉంది. అందుకనే కేటీఆర్ ను అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని, అల్లకల్లోలం అయిపోతుందని రకరకాల వార్నింగులు ఇస్తున్నారు. అయితే ఊహించని రీతిలో ఏసీబీకి అదనంగా ఈడీ కూడా రంగంలోకి దిగింది. కేటీఆర్ ను ఏసీబీ కాకుండా ఈడీ ఢిల్లీకి తీసుకెళ్ళి విచారించి, అరెస్టుచేస్తే హైదరాబాదులో తలెత్తే సమస్యలు తక్కువగా ఉంటాయి. ఏసీబీ అరెస్టంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రచేసి అరెస్టు చేసిందని గోలచేయచ్చు. అప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముంది. అదే విచారణ పేరుతో ఈడీ ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ అరెస్టుచేస్తే అరెస్టు కేంద్రప్రభుత్వం ఖాతాలో పడుతుంది. కవితను హైదరాబాదులో విచారించి అరెస్టు చేసినట్లు ప్రకటించి వెంటనే ఢిల్లీకి తీసుకెళ్ళిపోయే విషయం గుర్తుండే ఉంటుంది. కాబట్టి అప్పుడు కేటీఆర్ అరెస్టు తీవ్రత రాష్ట్రప్రభుత్వం మీద తక్కువగా ఉంటుంది. అదేపనిగా ఢిల్లీకి వెళ్ళి గోలచేయటం కారుపార్టీ నేతలకు అంత ఈజీకాదు. ఒకవేళ రాష్ట్రంలోనే నిరసనలు తెలిపినా రేవంత్ ప్రభుత్వం కంట్రోల్ చేయగలుగుతుంది. మరి జనవరి 7వ తేదీన విచారణలో ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News