మోదీ సభలో ద్రౌపది ముర్ము చర్మ రంగుపై చర్చ

బీజేపీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించారు. ప్రచారంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్నికలో రంగు వివక్ష చూపిన విషయం ప్రస్తావించారు.

Update: 2024-05-08 12:59 GMT

బీజేపీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించారు. బుధవారం ఉదయం కరీంనగర్ జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కును చెల్లించుకున్నారు. అనంతరం కరీంనగర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. కరీంనగర్ సభ ముగిసిన తర్వాత వరంగల్ బహిరంగ సభకి హాజరయ్యారు.

ఈ రెండు సభలలో ప్రసంగించిన మోదీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ల పై విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని, అవినీతి అనే ఫెవికాల్ వీటిని కలుపుతోంది అన్నారు. బీజేపీకి నేషన్ ఫస్ట్.. కానీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లకి ఫ్యామిలీ ఫస్ట్ అని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తే కాంగ్రెస్ కి నచ్చడంలేదని ఆరోపించారు. కోర్టు అనుమతితో రామమందిరాన్ని నిర్మించామని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కోర్టు తీర్పుని సవాల్ చేస్తామంటున్నారని మండిపడ్డారు. రామమందిరాన్ని రక్షించుకోవాలంటే... తెలంగాణలో కాంగ్రెస్ ని తుడిచిపెట్టేయాలని మోదీ పిలుపునిచ్చారు.

"నిన్న దేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్ జరిగింది. ఇందులో కాంగ్రెస్, ఇండియా కూటమి ఫ్యూజ్ పోయింది. నాలుగో విడత పోలింగ్ కు చేరువలో ఉన్నాం. ఈ విడతలో కూడా ఆ ఫ్యూజ్ పోవడం బాకీ ఉంది. బీజేపీ, ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజారిటీ సాధిస్తుంది. కాంగ్రెస్.. గెలిచే సీట్లు చూసుకోవాలంటే మైక్రోస్కోప్ అవసరం పడుతుంది అన్నారు. కరీంనగర్ లో బీజేపీ ఎంపీ విజయం ఖాయమైంది. కాంగ్రెస్ పార్టీ అతి కష్టంపై ఎవరో ఒక అభ్యర్థిని బరిలో దించారు.. అయినా వారు ఓడిపోతారు. ఒక బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతయింది" అని మోదీ విమర్శించారు.

"పదేండ్లలో నేనేం చేశానో మీరు చూశారు. మీ ఒక్క ఓటుతో కశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేశా. మీ ఒక్క ఓటుతో భారత్ డిఫెన్స్ విభాగంలో ఆయుధాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. నేను గుజరాత్ కు మూడుసార్లు సీఎంగా పనిచేశాను.. ప్రతి పోలింగ్ లో గెలిచాను. కానీ.. గుజరాత్ లో నేను ఉదయం 10 గంటలకు ర్యాలీ చేసేందుకు ధైర్యం చేయలేదు.. ర్యాలీ చేయలేదు కూడా. ఇంత అశేష జనాన్ని గుజరాత్ లో కూడా చూడలేదు.. కానీ కరీంనగర్ లో ఉదయం 10 గంటలకు ఇంత మంది రావడం చూస్తుంటే సంతోషంగా ఉంది" అని అన్నారు.

"బీజేపీకి నేషన్ ఫస్ట్.. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ కి ఫ్యామిలీ ఫస్ట్. ఈ రెండు పార్టీలను కలిపేది కరప్షన్, జీరో గవర్నెన్స్ మోడల్. బీఆర్ఎస్ తమ ఒక్క కుటుంబం కోసం యావత్ తెలంగాణలోని ప్రతి ఒక్క కుటుంబీకుల కలలను చెల్లా చెదురు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది. దేశం మునిగిపోయినా కానీ.. తాము, తమ కుటుంబానికి ఇబ్బంది కలగకుండా ఉండాలన్నదే వారి పాలసీ. కుటుంబమే ముఖ్యమనే నీతిని నమ్ముకున్న కాంగ్రెస్.. పీవీ నరసిహారావును కూడా అవమానించింది. ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ కార్యాలయంలోకి కూడా దేహాన్ని రానివ్వలేదు.. అంత్యక్రియలు కూడా సరిగ్గా జరగనివ్వలేదు. కానీ బీజేపీ పీవీ నరసింహారావును భారత్ రత్న ఇచ్చి సత్కరించింది" అని మోదీ గుర్తు చేశారు.

చర్మ రంగుతో ముర్ముని అవమానించారు -మోదీ

కరీంనగర్ సభ తర్వాత వరంగల్ సభలో ప్రసంగించిన మోదీ.. తనకి, బీజేపీకి వరంగల్ చాలా ప్రధానమైన ప్రాంతం అన్నారు. ఎందుకంటే బీజేపీకి ఇద్దరే ఎంపీలున్నప్పుడు ఒక ఎంపీ హన్మకొండ నుంచి జంగారెడ్డి ఉన్నారన్నారు. మాకు కష్టం వచ్చినప్పుడల్లా వరంగల్ ప్రజలు వెన్నంటి నిలిచారు. అందుకే కాంగ్రెస్ ఇనుప గుప్పిట్లో నుంచి వరంగల్ ను బయటకు తీయాలని మేము చూస్తున్నామన్నారు. ప్రపంచమంతటా అస్థిరత, అశాంతి, భయాందోళనలు, విపత్తులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి దేశం వెళ్లకూడదు. వారి చేతుల్లోకి అధికారం వెళ్లిందంటే ఒక్కో ఏడాది ఒక్కో ప్రధాని ఉంటారు. ఐదేండ్లు ఐగుగురు ప్రధానులు అవుతారు.. ఒక్కో ఏడాది ఒక పార్టీకి చెందిన ప్రధాని ఉంటే దేశం ఎలా అభివృద్ధి అవుతుంది అని మోదీ ప్రశ్నించారు.

ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా నియమిస్తామంటే కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఓడించాలని చూసింది. కానీ దీనికి గల కారణాలేంటో నాకిప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఆమె చర్మం నలుపు రంగు కావడమేనని నాకర్థమైంది. అమెరికాలో కాంగ్రెస్ యువరాజుకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అనే ఒక అంకుల్ ఉన్నారు. ఆ యువరాజుకు థర్డ్ ఎంపైర్ లా ఈయన వ్యవహరిస్తారు. కాంగ్రెస్ యువరాజుకు సన్నిహితుడైన ఆ వ్యక్తి ఒకరు నలుపు రంగు చర్మం ఉన్న వారు ఆఫ్రికన్లు అని విమర్శలు చేశారు.. అందుకే ఆమెను ఓడించాలని భావించారు. ద్రౌపది ముర్మును కూడా ఆఫ్రికన్ అని విమర్శించడమే కాక ఓడించాలని చూశారు. చర్మం రంగు ఆధారంగా నా దేశ ప్రజల యోగ్యతను నిర్ధారిస్తారా? చర్మం రంగు ఆధారంగా వ్యక్తులను అవమానపరచడం సాధ్యం కాదనే విషయాన్ని మీ జవాబుగా ఆ ఫిలాసఫర్ కు చెప్పాలి అని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News