12 మంది బిడ్డలున్న ఎలాన్ మస్క్ కి ఇటలీ ప్రధానితో 'ప్రేమాయణమా'!

ముగ్గురు భార్యలు.. 12 మంది పిల్లలు.. వేల కోట్ల రూపాయల అధిపతి ఎలాన్ మస్క్. ఆయనికి ఇటలీ ప్రధానమంత్రి మెలోనీతో ఎఫైర్ ఉందంటూ పుకార్లు వస్తే వాటిని ఖండించారు మస్క్.

Update: 2024-09-26 03:41 GMT

టెస్లా కార్ల కంపెనీ అధినేత, స్పెస్ ఎక్స్ అధిపతి, సోషల్ మీడియా ఎక్స్ (గతంలో ట్విట్టర్) యజమాని ఎలాస్ మస్క్ 53 ఏళ్ల వయసులో ఇటలీ ప్రధానమంత్రి మెలోనితో ప్రేమ పడ్డారంటూ సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. ఈ విషయం తెలిసి ఎలాస్ మస్క్ అలాంటిదేమీ లేదంటూ ట్వీట్లు చేస్తున్నా నెటిజెన్ల ఆసక్తి మాత్రం ఆగడం లేదు. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య ఏమైనా సంబంధం ఉందా? రొమాంటిక్ ఎఫైర్ లేదని ఎలాన్ మస్క్ ఎందుకన్నారు? మెలోని వైపు నుంచి ఏమైనా వివరణ వచ్చిందా? వంటి అనేక ప్రశ్నల్ని నెటిజన్లు సంధిస్తున్నారు.

అసలింతకీ ఏమి జరిగిందీ?
రెండు రోజుల కిందట న్యూయార్క్ లోని జీగ్ ఫీల్డ్ బాల్ రూమ్ లో అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. ఈ అవార్డును అందుకోవడానికి ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోని వచ్చారు. ఈ ఫంక్షన్ లో ఎలాన్ మస్క్ - ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోనిని ప్రశంసలతో ముంచెత్తారు. ఆ తర్వాత బాల్‌రూమ్‌లో జరిగిన అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డ్స్ డిన్నర్‌లో ఈ టెస్లా బిలియనీరూ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కి కుడిభుజంగా ఉన్న ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధానమంత్రి మెలోని ఒకే టేబుల్ మీద కనువింధు చేశారు. ఆ ఫంక్షన్ లో మెలోనిని "బయట కంటే లోపల చాలా అందంగా ఉంది" అని మస్క్ పొగిడారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఈ జంట ఒకే టేబుల్ పై భోజనానికి కూర్చోవడం, చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో ఒక్కసారిగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారన్న పుకార్లు బయటకి పొక్కాయి. పైగా వీరిద్దరూ ఆ రోజు రాత్రి న్యూయార్క్ లో కలిసే ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. ఎలాన్ మస్క్ ఇటీవలే ట్విట్టర్ ను కొని ఎక్స్ గా మార్చి చేతులు కాల్చుకున్నారు. 12 మంది బిడ్డలకు తండ్రి కూడా. ఆయన మెలోనీని ఉద్దేశించి " ఆమె నిజాయితీపరురాలు, సాధికారికమైన వ్యక్తి, ఆలోచనల్లో స్పష్టత ఉన్న మనిషని" అని అభివర్ణించారు. మామాలుగానైతే ఎలాన్ మస్క్ కి రాజకీయ నాయకులపై పెద్దగా సదాభిప్రాయం ఉన్నట్టు కనిపించదు. అటువంటి వ్యక్తి మెలోని ప్రశంసించిన తీరు చర్చనీయాంశమైంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఎలాన్ మస్క్ అదే ఫంక్షన్ లో, "రాజకీయ నాయకుల గురించి ఎప్పుడూ చెప్పలేం అని చమత్కరిస్తూనే ఆమెను ప్రశంసించడం"తో అక్కడున్న 700 మంది అతిథుల మొహల్లో నవ్వులు విరిశాయట.
కళ్లలో కళ్లు పెట్టి చూడు...
ఎలాన్ మస్క్ ఇటలీ ప్రధాని మెలోనికి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందించినప్పుడు ఆ ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు తదేకంగా తన్మయత్వంతో చూసుకున్నారట.

ఇలాంటి వాటికి మరింత మసాలా జోడించి వీరిద్దరి ఫోటో పెట్టి సోషల్ మీడియా హోరెత్తించడంతో ఎలాన్ మస్క్ స్పందించకతప్పలేదు. ఆమెతో నాకు ఎటువంటి శృంగార సంబంధం లేదని చెప్పాడు. అందమైన ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోనితో ఎఫైర్ ఉందనడాన్ని ఖండించారు. 'మేం డిన్నర్ కి కూర్చొన్నప్పుడు మా అమ్మ కూడా ఉన్నారు' అని మస్క్ వివరణ ఇచ్చారు. ఎలాన్ మస్క్ టేకోవర్ చేసిన తర్వాత సుమారు 50 లక్షల ఖాతాలను సస్పెండ్ చేసిన తన ఎక్స్ (X)లో పోస్ట్ పెట్టారు.
మెలోని వయసు 47. మస్క్ వయసు 53. ఐక్యరాజ్యసమితీ జనరల్ అసెంబ్లీకి మణిభూషణంగా ఉన్న అట్లాంటిక్ కౌన్సిల్ డిన్నర్‌లో తనను పరిచయం చేయవలసిందిగా ఆమె ఎలాన్ మస్క్ ని కోరినట్టు 'పొలిటికో' కథనం. ఏమైనా ఇప్పుడు ఈ ఇద్దరి వ్యవహారం సోషల్ మీడియాకి ఎక్కింది.
వీళ్లిద్దరి తొలి కలయిక ఎప్పుడంటే...
2023 జూన్ లో ఎలాన్ మస్క్ రోమ్ వెళ్లారు. అప్పుడాయన రోమ్‌లోని మెలోని అధికారిక నివాసంలో తొలిసారి భేటీ అయ్యారు. ఆ తర్వాతి కాలంలో వారిద్దరూ చాలా సార్లు కలుసుకున్నారు. ఈ జంట చూడముచ్చటగా ఉందంటూ అప్పుడప్పుడూ వార్తలు వచ్చినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు న్యూయార్క్ సంఘటనతో వారిద్దరి 'తొలిప్రేమ' బాహ్య ప్రపంచానికి తెలిసిందంటున్నారు నెటిజన్లు. గత డిసెంబరులో మెలోని ప్రాతినిధ్యం వహిస్తున్న మితవాద 'బ్రదర్స్ ఆఫ్ ఇటలీ' పార్టీ నిర్వహించిన ఓ ఉత్సవంలో కూడా మస్క్ మాట్లాడారు. ఫాసిస్టు మూలాలున్న పార్టీలలో ఇదొకటి. నియోఫాసిస్ట్ పార్టీ అంటుంటారు.
ఎలాన్ మస్క్ కి ఇప్పటికే ముగ్గురు మహిళలతో పెళ్లిళ్లు అయ్యారు. ఈ ముగ్గురికి 12 మంది పిల్లలున్నారు. ఈ ఏడాది జనవరిలో న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్‌తో ఒక బిడ్డను కన్నారు. ఇప్పుడీ వ్యవహారం తెరపైకి వచ్చింది.
మెలోనికి కూడా ఇంతకుముందే ఆండ్రియా గియాంబ్రూనో పెళ్లయింది. ఒక కుమార్తె కూడా. గత ఏడాది వేసవిలో ఇటాలియన్ టీవీలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన్ని వదిలేసింది. అయితే ఇంకా విడాకులు తీసుకోలేదు. 2022లో జరిగిన ఇటాలియన్ పార్లమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఆమె పార్టీ విజయం సాధించి ప్రధానమంత్రి అయ్యారు. నియో ఫాసిజం నీడలు తనపై లేవని చెప్పేందుకు ఆమె చాలా తంటాలు పడుతూ వస్తున్నారు.
ఈనేపథ్యంలో ఆమెను అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డ్ వరించింది. ఆమెకి ఈ అవార్డ్ ఇచ్చే సమయంలో ఎలాన్ మస్క్ ఆమెను పరిచయం చేస్తూ ప్రశంసలతో ముంచెత్తారు. మెలోనీలో దేశభక్తి మెండని, కఠినమైన శిక్షణ పొందారని, ఆమె మనసు పరిశుద్ధమైందని మస్క్ ప్రశంసిస్తే దానికి బదులుగా ఆమె ఎలాన్ మస్క్ ని "విలువైన మేధావి" అనే ప్రశంసతో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది.
"పండిన పండ్లను కోయడానికి మా లోతైన మూలాలను రక్షించుకోవడమే మా ముందస్తు షరతు" అని మెలోనీ చెప్పారు. "పాశ్చాత్య దేశాల క్షీణత అనివార్యం" అనే ఆలోచనను తోసిపుచ్చారు.
అందరి చూపూ వాళ్ల పైన్నే...
మెలోని మాట్లాడుతున్నప్పుడు ఆయన నవ్వుతూ కనిపించారు. ఆమె ప్రసంగం ముగిసిన తర్వాత చప్పట్లు కొడుతూ లేచినిలబడ్డారు. ఈ ఫంక్షన్ తర్వాత జరిగిన డిన్నర్ లో వీరిద్దరూ సుదీర్ఘ సంభాషణలో మునిగితేలారు. ఈ హై-ప్రొఫైల్ ఈవెంట్‌లో వారిద్దరి భేటీ చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
ఒక సమయంలో మస్క్ తన తలను ఆమెకు దగ్గరగా వంచి గట్టిగా సైగ చేయడం కనిపించిందని ఓ రిపోర్టర్ కథనం. మెలోని రెండేళ్ల కిందట ఇటలీకి మొదటి మహిళా ప్రధానమంత్రి అయినప్పటి నుంచి యూరోపియన్ యూనియన్‌లో ప్రముఖ రాజకీయ శక్తిగా అవతరించింది.

గ్లోబల్ సిటిజన్ అవార్డుకు ఆమెను ఎంపిక చేయడం పట్ల జ్యూరీలోని కొంతమంది సభ్యులు వ్యతిరేకించారు. రష్యాతో ఆమె గత సాన్నిహిత్యాన్ని ప్రస్తావించారు. ఆమె పార్టీ వలసల వ్యతిరేకని అభ్యంతరం తెలిపారు. ఎల్జీబీటీక్యూలకు ఆమె వ్యతిరేకి అని, అందువల్ల ఆమెకు ఈ అవార్డు ఇవ్వవద్దంటూ కొందరు వ్యతిరేకించినా ఆమెను ఈ అవార్డు వరించడం వెనుక ఎలాన్ మస్క్ ఉన్నారని చెబుతారు. ఆమె "యూరోపియన్ యూనియన్ కి, ట్రాన్స్-అట్లాంటిక్ కూటమికి బలమైన మద్దతుదారుగా, 2024లో గ్రూప్ ఆఫ్ సెవెన్‌కి ఆమె అధ్యక్షస్థానంలో ఉన్నందున ఈ అవార్డుకు" అర్హులంటూ గ్లోబల్ సిటిజన్ థింక్ ట్యాంక్ ప్రశంసించింది.
ఇవన్నీ ఎలా ఉన్నా మెలోనీ, మస్క్ విందు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమై కూర్చుంది. మస్క్ ఎంతగా ఖండించినా పుకార్లు మాత్రం ఆగడం లేదు.
Tags:    

Similar News