సోలార్ పవర్ ఉత్పత్తి ద్వారా మహిళలకు ఉపాధి
తెలంగాణలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా మహిళలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.దీనికోసం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని చేపట్టారు.
By : The Federal
Update: 2024-11-15 14:32 GMT
ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్ల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ఉత్పత్తికి త్వరితగతన చర్యలు ప్రారంభించాలని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
- స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్లకు అవసరమైన స్థలాలను సేకరించి వారికి లీజుకు ఇవ్వాలని భట్టి ఆదేశించారు. సోలార్ పవర్ ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక నిధులకు గాను బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రుణాలు ఇప్పించే ఏర్పాటు చేయాలని కోరారు.
ఇటీవల బ్యాంకర్ల సమావేశంలోనూ స్వయం సహాయక సంఘాల సభ్యులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాట్ల ఏర్పాటు,ఆర్టీసీకి బస్సులను సమకూర్చే పథకాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నట్టు డిప్యూటీ సీఎం వెల్లడించారు.మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతను ఇవ్వడం ద్వారా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ద్వారా సామాజిక మార్పు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.
స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలపడితే గ్రామీణ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులకు డిప్యూటీ సీఎం వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం సూచించారు.