Formula E Race Case: సుప్రీంకు చేరిన ఫార్ములా ఈ కారు రేసు కేసు
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు.;
By : The Federal
Update: 2025-01-07 15:49 GMT
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిందితుడైన మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కేటీఆర్ ముందుగా తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును కేటీఆర్ సవాలు చేశారు. ఆయన తరపున న్యాయవాది మోహిత్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
- కేటీఆర్ పిటిషన్ పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేసింది. దీంతో కేటీఆర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదుల మధ్య వాదనలు జరగనున్నాయి.జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై సమీక్షించారు. మరో వైపు కేటీఆర్ ఎక్స్ లో పోస్టు పెట్టారు.
న్యాయపోరాటం చేస్తా : కేటీఆర్
‘‘క్వాష్ పిటిషన్ కొట్టివేసినందుకే నాకు ఉరిశిక్ష పడినట్లుగా కాంగ్రెస్ వాళ్లు ఫీలవుతున్నారు.అవినీతిలో పట్టుబడ్డవారికి ప్రతి విషయం అవినీతిగానే కనబడుతుంది. నా మీద పెట్టిన కేసులో ఏమీ లేదు.. లొట్టపీసు కేసు. అవినీతి లేదని తెలిసి కూడా నా మీద కేసు పెట్టి శునకానందం పొందుతున్నారు. రాజ్యాంగపరంగా ప్రతి హక్కును వినియోగించుకుంటాను’’అని కేటీఆర్ ట్వీట్ చేశారు.