సినిమాలో డైలాగులు కాదు కేసీయార్ తిట్లు

ఇవన్నీ సినిమాలో డైలాగులో లేకపోతే రచ్చబండ దగ్గర గొడవలోనో వాడిన మాటలు, తిట్లుకాదు. సాక్ష్యాత్తు పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీయార్ తిట్టిన తిట్లు.

Update: 2024-04-06 04:36 GMT

చవటలు..దద్దమ్మలు..కుక్కలకొడుకులు... ఇవన్నీ సినిమాలో డైలాగులో లేకపోతే రచ్చబండ దగ్గర గొడవలోనో వాడిన మాటలు, తిట్లుకాదు. సాక్ష్యాత్తు పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీయార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిన తిట్లు. ప్రత్యర్ధులను ముఖ్యంగా కాంగ్రెస్ నేతలను తిట్టడంలో కేసీయార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారని అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్నపుడూ కాంగ్రెస్ ను ఇదే విధంగా తిట్టేవారు, ఇప్పుడూ అలాగే తిడుతున్నారు. అధికారంలో ఉన్నపుడు తిట్టడంలో కాంగ్రెస్ నేతలంటే లెక్కలేనితనం కనబడేది. ఇపుడు తిట్టడంలో ఫ్రస్ట్రేషన్ కనబడుతోంది. తనను కాంగ్రెస్ పార్టీ ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిందన్న చేదునిజాన్ని కేసీయార్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్న విషయం ఆయన మొహంలో స్పష్టంగా తెలిసిపోతోంది.

మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు, కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటి విడుదల విషయమై ఇష్టమొచ్చినట్లు నోరుపారేసుకున్నారు. ‘‘మేడిగడ్డ బ్యారేజి కుంగిపోతే కాంగ్రెస్ వాళ్ళకు రిపేర్లు చేయనీకి చేతనైత లేదా’’? అని ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది. రిపేర్లు చేయించలేకపోతున్నట్లు చెబితే తాము చేయించి చూపిస్తామనటం అంతకన్నా విచిత్రం. కారణం ఏమిటంటే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయింది కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు మంచి ఊపుమీదున్నపుడు అక్టోబర్ 21వ తేదీన మూడు పిల్లర్లు కుంగిపోతే దానిపై కేసీయార్ తో సహా కీలకనేతలెవరు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఎన్నికలైపోయాక మేడిగడ్డను సందర్శిస్తానని ఇపుడు చెబుతున్న తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఎందుకు సందర్శించలేదో కేసీయార్ సమాధానం చెప్పటంలేదు.

పైగా మీడియాను ఉద్దేశించి ‘‘మీరంతా తెలివిగలవాళ్ళు, వివేకవంతులు, వివేకంతో వార్తలు రాయాలి, విశ్లేషణలు రాయాలి’’ అని విజ్ఞప్తిచేయటం ఆశ్చర్యంగా ఉంది. ఇదే కేసీయార్ అధికారంలో ఉన్నపుడు మీడియా సమావేశంలో ఎవరైనా ఏదైనా ప్రశ్నవేయగానే ‘‘దిమాక్ ఉందా ? తలకాయుందా ? ఏ పేపర్ నీది ? మీడియా అంటే ఏదిబడితే అది అడుగుతారా’’ ? అంటు విరుచుకుపడిన దృశ్యాలు గుర్తుకువచ్చాయి. అధికారంలో ఉన్నపుడు మీడియా సమావేశాలు పెట్టి అవమానించిన కేసీయార్ ఇపుడేమో వివేకవంతులు, తెలివైనవాళ్ళు, వివేకంతో వార్తలు రాయాలి, విశ్లేషణలు చేయాలని మనవి చేసుకుంటున్నట్లు చెప్పారు.

అధికారంలో ఉన్నపుడు తిట్టారంటే అధికారం తలకెక్కే అలా తిడుతున్నారని అనుకున్న వాళ్ళే ప్రతిపక్షంలో వచ్చినతర్వాత కూడా అలాగే తిట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చినా కేసీయార్ లో అహంకారం ఏమాత్రం తగ్గలేదంటున్నారు. తనలోని తప్పులను సమర్ధించుకునేందుకు ప్రత్యర్ధులపై తిట్లతో విరుచుకుపడటం కేసీయార్ కు మొదటినుండి అలవాటే. ఒకవైపు తాను నోటికొచ్చినట్లు తిడుతు రేవంత్ రెడ్డి, మంత్రుల వాడుతున్న భాష సంస్కారవంతంగా ఉందా ? నాగరీకులు వాడే భాషేనా అంటు ఆక్షేపించటం కేసీయార్ కు మాత్రమే చెల్లింది.

ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిశెట్టి నిరంజన్ రెడ్డి తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు కేసీయార్లో ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా బయటపడుతోందన్నారు. లిక్కర్ స్కామ్ లో కూతురు కవిత అరెస్టవ్వటం, సీబీఐ విచారణకు కోర్టు అనుమతివ్వటంతో కేసీయార్ బాగా టెన్షన్ కు గురైనట్లు కనిపించిందన్నారు. ఎన్నికలయ్యాక మేడిగడ్డకు వెళతానని చెప్పిన కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎందుకు వెళ్ళలేదని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో అరెస్టయిన పోలీసు అధికారుల వాగ్మూలాలతో తనపైన కేసు తప్పదని కేసీయార్ కు అర్ధమైనట్లుందన్నారు. అందుకనే నోటికొచ్చినట్లు తిడుతున్నారని నిరంజన్ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా కేసీయార్ తిట్లదండకంపై కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

Tags:    

Similar News