తాతను చంపిన మనవడు : పోలీసు ఇంటరాగేషన్‌లో ఏం చెప్పాడంటే...
ప్రముఖ పారిశ్రామిక వేత్త జనార్దనరావు హత్య కేసులో నిందితుడైన మనవడు కీర్తితేజ పంజాగుట్ట పోలీసుల తాజా ఇంటరాగేషన్‌లో పలు సంచలన విషయాలు వెల్లడించాడు.;
By : The Federal
Update: 2025-02-19 10:03 GMT
వెల్జన్ గ్రూపు సంస్థల అధినేత,ప్రముఖ పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు (86)హత్య కేసులో (industrialist murder case) తాజాగా పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. క్రైం థ్రిల్లర్ సినిమాను తలపించిన ఈ హత్య కేసులో పంజాగుట్ట పోలీసులు నిందితుడైన కిలారు కీర్తితేజను (Keerthi Teja) రిమాండు నుంచి తమ కస్టడీలోకి తీసుకొని నాలుగు రోజుల పాటు విచారించారు.(police interrogation) ఈ విచారణలో నిందితుడు కీర్తితేజ హత్య కేసుకు సంబంధించి పలు విషయాలు వెల్లడించాడు. విచారణలో నిందితుడు కీర్తితేజ తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. కీర్తితేజ ఇంటరాగేషన్ రిపోర్టులోని కీలక అంశాలను పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ బండారి శోభన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
ఆస్తుల పంపిణీపై రాజుకున్న వివాదం
తన తాత జనార్దన్ రావు ఆస్తుల పంపిణీలో చాలా కాలంగా వివాదాలు ఉన్నాయని నిందితుడు కీర్తితేజ పోలీసులకు దర్యాప్తులో చెప్పాడు. కుటుంబ ఆస్తుల్లో తనకు న్యాయమైన వాటా ఇవ్వకుండా ఉద్ధేశపూర్వకంగా చేశారని, కంపెనీలో తనకు డైరెక్టర్ పదవిని కూడా ఇవ్వలేదని కీర్తితేజ పోలీసులకు చెప్పాడు. ఇంట్లోనూ, కార్యాలయంలోనూ తాత జనార్దనరావు తనను ‘ యూ బెగ్గర్’(beggar) అంటూ పదేపదే అవమానించాడని, తనను ఎన్నడూ కుటుంబంలో సభ్యుడిగా చూడలేదని ఆయన పేర్కొన్నాడు. ఆస్తి ఇవ్వకపోవడం, కంపెనీ డైరెక్టర్ పదవి ఇవ్వకుండా పదేపదే బెగ్గర్ అంటూ అవమానించడం వల్ల నే తాతయ్య జనార్దనరావును హతమార్చానని కీర్తి తేజ పోలీసుల ముందు చెప్పాడు. తాతయ్య తనను నిత్యం అవమానిస్తుండటంతో ఆఫీసులో ఉద్యోగులు కూడా తనను చిన్నచూపు చూశారని చెప్పాడు.
వాదన తర్వాత పొడిచాను...
తనను అవమానించిన తాతయ్య జనార్దనరావును చంపాలని నిర్ణయించుకొని దీనికి పథకాన్ని రూపొందించుకున్నానని కీర్తి తేజ పోలీసుల ముందు చెప్పాడు.‘‘ఆస్తుల్లో తన వాటా విషయమై తాతయ్యను అడగ్గా ఆయనకు, నాకు తీవ్ర వాదన జరిగింది, అప్పుడే ఆయన్ను కత్తితో పొడిచాను’’అని కీర్తితేజ వివరించాడు.
ఇన్‌స్టామార్ట్ ద్వారా కత్తి కొనుగోలు
తన తాతయ్య జనార్దనరావును ఎలాగైనా హతమార్చాలని నిర్ణయం తీసుకొని ఇన్‌స్టామార్ట్ ద్వారా కత్తిని కొనుగోలు చేసి దాన్ని బ్యాగులో పెట్టుకొని తాతయ్య ఇంటికి వచ్చానని కీర్తితేజ చెప్పాడు. నిరంతరం అవమానించడం, ఆస్తుల పంపకాల్లో చేసిన అన్యాయం వల్లనే అతన్ని హతమార్చేలా చేశాయని నిందితుడు చెప్పాడు.
రక్తపు దుస్తులు, కత్తి కాల్చేసి...
తాతయ్య జనార్దన్ రావును హత్య చేశాక తాను బీఎస్ మక్తాలోని ఎల్లమ్మగూడ దేవాలయం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశానికి వెళ్లి తన రక్తపు దుస్తులు, కత్తిని తగులబెట్టి హత్యలో ఆధారాలు లేకుండా చేశానని నిందితుడు కీర్తితేజ పోలీసులకు చెప్పాడు.సగం కాలిన కత్తిని తాము స్వాధీనం చేసుకున్నామని, పలువురి సాక్ష్యాలను కూడా నమోదు చేశామని శోభన్ చెప్పారు. కత్తి దహనం చేసిన ప్రదేశానికి నిందితుడిని తీసుకువెళ్లి విచారించి, ఆధారాలను సేకరించేందుకు యత్నిస్తున్నామని పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ బండారి శోభన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
ఆస్తి కోసమే నాన్నను చంపాడు...
ఆస్తి కోసమే నాన్న జనార్దనరావును తన కుమారుడు కీర్తి తేజ కత్తితో పొడిచి చంపాడని అతని తల్లి సరోజిని దేవి పోలీసులకు వాంగ్మూలమిచ్చారు. తన తండిని కత్తితో పొడిచి చంపుతుండగా తాను అడ్డుకునేందుకు యత్నించానని, దీంతో తన కొడుకు తనను కూడా కత్తితో పొడిచాడని సరోజిని దేవి పోలీసులకు చెప్పారు. హత్య తానే చేశానని కీర్తితేజ అంగీకరించడంతో అతన్ని పోలీసు కస్టడీ నుంచి రిమాండుకు జైలుకు పంపించామని పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ బండారి శోభన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.