తెలంగాణను అల్లాడిస్తున్న ఎండలు, అధికారుల ముందుజాగ్రత్త చర్యలు

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఎండలు మండుతున్నాయి. ఉత్తరతెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరిన నేపథ్యంలో వివిధ శాఖలు అప్రమత్తమయ్యాయి.;

Update: 2025-05-01 08:16 GMT
తెలంగాణలో మండుతున్న ఎండలు

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎండలు మండుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పగలు గరిష్ఠ ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. రెండు, మూడు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఎ ధర్మరాజు గురువారం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఈ రోజు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు తెలిపారు.


తెలంగాణలో వేడి గాలుల ప్రభావం
తెలంగాణ రాష్ట్రంలో ఈ వేసవిలో వేడిగాలుల ప్రభావం తీవ్రం కానున్నాయి. రాష్ట్రంలోని 35 మిలియన్ల జనాభాలో 16 మిలియన్లకు పైగా ప్రజలు అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రమాదకర మండలాల్లో నివసిస్తున్నారని వాతావరణశాఖ వెల్లడించింది.ఈ వేసవిలో మే నెల నుంచి జూన్ వరకు తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం హెచ్చరించింది. వేడి గాలుల ప్రభావం వల్ల ప్రజారోగ్యానికి పెనుముప్పు వాటిల్లే అవకాశముంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హీట్ యాక్షన్ ప్లాన్ 2025 ను రూపొందించింది.గత ఏడాది కంటే ఈ ఏడాది అధికంగా వేడిగాలులు వీస్తున్నందున ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు తెలంగాణ నివాసితులను హెచ్చరించారు.ఈ ఏడాది దీర్ఘకాలిక వేడిగాలులు వీస్తున్నందున ప్రజారోగ్య సంక్షోభం ఏర్పడనుంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు, రైతులు,కార్మికులు,నిర్మాణ రంగంలోని కార్మికులు వడదెబ్బకు గురై మరణించే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

రాష్ట్ర విపత్తుగా వడదెబ్బ
తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతల నమోదు,పెరిగిన ఎండవేడిమి, వేడి గాలుల ప్రభావం వల్ల ప్రజలు వడదెబ్బ బారినపడి మృత్యువాత పడుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడదెబ్బలను రాష్ట్రవిపత్తుగా ప్రకటించింది. వడదెబ్బతో మరణించిన బాధితుల కుటుంబాలకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF)నుంచి రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది.2024 వ సంవత్సరంలోనూ వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతల నమోదుతో ప్రజలు వడదెబ్బతో మృత్యువాత పడ్డారు.

18 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలోని 18 జిల్లాల్లో తీవ్ర వేడి గాలుల ప్రభావం వల్ల భారత వాతావరణశాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.ప్రజలు మండుతున్న ఎండలతో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ సలహాను జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్,వనపర్తితో సహా 18 జిల్లాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని హైదరాబాద్ ఐఎండీ అధికారులు చెప్పారు.



 ఎండల పట్ల జాగ్రత్తగా ఉండండి : డాక్టర్ బి రవీందర్ నాయక్

ఈ వేసవిలో మండుతున్న ఎండలతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తాము ప్రజలకు సూచనలు చేశామని తెలంగాణ ప్రజారోగ్యం,కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ బి.రవీందర్ నాయక్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నాయక్ కోరారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక పడకలు ఏర్పాటు చేసి, సెలైన్ బాటిళ్లు, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచామని ఆయన చెప్పారు.అత్యవసర పరిస్థితుల్లో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్, అంగన్ వాడీ కార్యకర్తల వద్ద ఓఆర్ ఎస్ సాచెట్లను అందుబాటులో ఉంచామన్నారు.

తెలంగాణ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్
తెలంగాణ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ (విపత్తు నిర్వహణ) అరవింద్ కుమార్ తెలిపారు. మండుతున్న ఎండలు, వడదెబ్బ వల్ల అనారోగ్యాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తమైంది.తెలంగాణలో ఎండల తీవ్రత వల్ల దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రమవుతున్నాయని,అత్యవసర సేవలపై అధిక భారం పడుతుంది. వడదెబ్బ ప్రాణాంతకమైన ముప్పుగా మారింది.హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2025 లో భాగంగా తెలంగాణలోని ఎన్ ఆర్ ఈజీఎస్ కార్మికులకు, బస్సు ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించామని విపత్తు నిర్వహణ శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. బస్సుల్లో తాగునీటి సదుపాయం, విద్యాసంస్థల్లో ప్రతి గంటకు నీటి గంట, ఉపాధి హామి కార్మికులకు షెల్టర్లు, వ్యవసాయ కార్మికులకు వేడి ప్రభావాన్ని తగ్గించేలా ప్రణాళికలు రూపొందించారు.

వేడిగాలుల హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు
తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలుల హెచ్చరికను జారీ చేశామని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం మెంబర్ కన్వీనర్ షేక్ మీరా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్,పెద్దపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల గరిష్ఠ ఉష్షోగ్రత 45.2 డిగ్రీల సెల్సియస్ నమోదైందని ఆయన పేర్కొన్నారు.ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ నుంచి 44.9 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో తాము ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని మీరా వివరించారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమురం భీం ఆసిఫాబాద్, మెదక్, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో వేడిగాలుల తీవ్రత కొనసాగుతుందన్నారు.తెలంగాణ హీట్ యాక్షన్ ప్లాన్ (HAP) 2025 ను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం రూపొందించింది.ఈ ప్రణాళికను శుక్రవారం విడుదల చేస్తామని మీరా ‘ఫెడరల్ తెలంగాణకు చెప్పారు.

వైద్య ఆరోగ్య శాఖ ప్రచారం
సాధారణ ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే వేడి తరంగాలుగా ఐఎండీ పరిగణిస్తుంది.వడ దెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఆరోగ్యశాఖ రూపొందించిన పోస్టర్‌ను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవల ఆవిష్కరించారు. ఎండలు ముదురుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి సూచించారు.బయటకు వెళ్లినప్పుడు ఎండదెబ్బ బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగు నీరు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని, ఎక్కువసేపు ఎండలో ఉండకూడదని సూచించారు.ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగితే తక్షణమే సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలన్నారు.తమ చుట్టూ ఉన్నవారిలో ఎవరికైనా వడ దెబ్బ తగిలితే, వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు బాధితున్ని తరలించాలని, 108 అంబులెన్స్‌కు సమాచారం చేరవేయాలని మంత్రి ప్రజలను కోరారు.పిల్లలు, వృద్దులు, గర్భిణుల విషయంలో కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.



Tags:    

Similar News