తెలంగాణలో మూడురోజుల పాటు భారీవర్షాలు, ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ

తెలంగాణలో శుక్ర, శని,ఆదివారాల్లో మూడు రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు తాజాగా విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో ప్రకటించింది.

Update: 2024-07-19 01:21 GMT
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ హైదరాబాద్ హెడ్ నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. 

- తెలంగాణ వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను గురువారం రాత్రి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
- గురువారం రాత్రి తెలంగాణలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లా కొణిజర్లలో 23.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
- మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులో 22.8 మిల్లీమీటర్లు నిజామాబాద్‌లోని నవీపేట్‌లో 21.8 మిల్లీమీటర్లు, హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో 5.5 మిల్లీమీటర్లు, రామచంద్రపురంలో 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

పలు జిల్లాల్లో అతి భారీవర్షాలు
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో శుక్రవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఎండీ అధికారులు చెప్పారు.ఈ నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ సందర్భంగా ఆరంజ్ జారీ చేశామని అధికారులు తెలిపారు.

ఎల్లో అలర్ట్ జారీ
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డిలోని పలు చోట్ల శుక్రవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ 11 జిల్లాల్లో ఎల్లోఅలర్ట్ జారీ చేశామని ఐఎండీ తెలిపింది. అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

జులై 20తేదీన ఆరు జిల్లాల్లో రెడ్ అలర్ట్
తెలంగాణలో జులై 20 వతేదీన ఆరు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగులోని కొన్ని ప్రాంతాల్లో ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలోని కొన్ని చోట్ల ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.

ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి :ఐఎండీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది.మూడురోజులపాటు అనవసర ప్రయాణాలను నివారించాలని కోరింది.

వరద నీటిలో చిక్కుకుపోయిన 51 మంది సురక్షితం
పెద్దవాగు ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోవడంతో  పలు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.పెద్దవాగు వద్ద మొత్తం 51 మంది వరద నీటిలో చిక్కుకున్నారు. వారిలో 51 మందిని ఎన్డీఆర్ఎఫ్ బోట్లు, నేవీ హెలికాప్టర్ ఉపయోగించి రక్షించారు. అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామం వద్ద పెద్దవాగు వాగు వరద నీటిలో చిక్కుకుపోయిన 51 మందిని ఎన్‌డిఆర్‌ఎఫ్, కొత్తగూడెం పోలీసు డిడిఆర్‌ఎఫ్ సిబ్బంది కాపాడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.భారీవర్షాల వల్ల తెలంగాణలో ప్రాజెక్టుల్లోకి వరదనీరు చేరుతోంది. దీంతో పలు ప్రాజెక్టు జలాశయాల్లోకి నీరు వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. 

పెద్దవాగు కట్ట దెబ్బతినకుండా చర్యలు : మంత్రి తుమ్మల
పెద్దవాగు ప్రాజెక్టు క్రెస్ట్‌గేట్లు పనిచేయకపోవడంతో రిజర్వాయర్‌ బండ్‌పైకి వరదనీరు ఉధృతంగా ప్రవహించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కట్ట దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.వరద నీటి విడుదల కారణంగా గుమ్మడివెల్లి, కోయగూడెం, కొత్తూరు, గాజులపల్లి సహా నాలుగు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామాల వాసులను గురువారం తాత్కాలిక నివాసాలకు తరలించారు.

చీఫ్ సెక్రటరీ శాంతికుమారి సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో భారీవర్షాలు, వరదల పరిస్థితిని చీఫ్ సెక్రటరీ ఎ శాంతికుమారి గురువారం రాత్రి అధికారులతో టెలీకాన్ఫరెన్సులో సమీక్షించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, డీజీపీ, ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాహుల్‌ బొజ్జా తదితరుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిస్థితిని అడిగి తెలుసుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

చెరువులు తెగిపోకుండా చర్యలు తీసుకోండి
వరద నీటి వల్ల మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులు, కాలువలు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని శాంతికుమారి టెలికాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు.ప్రజల ప్రాణాలే ముఖ్యమని, సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించి హైదరాబాద్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకు అయినా తాము సిద్ధంగా ఉన్నామని సీఎస్ తెలిపారు.భారీ వర్షాలు, వరదల కారణంగా సహాయక చర్యల్లో పాల్గొనాలని పోలీసు బలగాలను ఆదేశించినట్లు తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్ప పీడనం మరో రెండు రోజుల్లో బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. గుంటూరు, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్టణం, అనకాపల్లి, అనంతపురం,గోదావరి జిల్లాలు,మన్యం అల్లూరి, కోనసీమ, కాకినాడ, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, శ్రీకాకుళం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వివరించారు.


Tags:    

Similar News