రెండు రోజుల పాటు భారీవర్షాలు,ఐఎండీ అలర్ట్ జారీ

అల్పపీడనం బలహీన పడటంతోపాటు దీనికి అనుబంధంగా ఏర్పడిన ఆవర్తనం కారణంగా తెలంగాణలో రెండు రోజులపాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ కేంద్రం అధికారులు చెప్పారు.

Update: 2024-09-25 10:14 GMT

తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డి ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అల్పపీడనం బలహీనపడటంతోపాటు దీనికి అనుబంధంగా ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఉత్తర తెలంగాణ, వాయువ్య తెలంగాణ పరిధిలోని పలు 14 జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని ధర్మరాజు వివరించారు. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశముందని ఆయన తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అక్కడ అక్కడ గాలులు వీచే అవకాశం ఉందని ఆయన వివరించారు.


బలహీన పడిన అల్పపీడనం
ఉత్తర ఆంధ్ర - దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ -మధ్య బంగాళాఖాతం దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగిన అల్ప పీడన ప్రాంతం బుధవారం బలహీనపడింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం బుధవారం దక్షిణ ఛత్తీస్‌గడ్, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు కొనసాగుతున్నది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపునకు వంగి ఉందని అధికారులు చెప్పారు.బుధవారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరువర్షాలు చాలా చోట్ల, రేపు కొన్ని చోట్ల, ఎల్లుండి అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.

రాబోయే 48 గంట‌ల్లో తెలంగాణలో భారీ వ‌ర్షాలు
గ‌త నాలుగైదు రోజుల నుంచి తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా వాన‌లు దంచి కొడుతున్న సంగ‌తి తెలిసిందే.మ‌ధ్య‌, వాయవ్య బంగాళాఖాతంలో అల్ప‌ పీడ‌నం కార‌ణంగా రాబోయే 48 గంట‌ల్లో రాజ‌ధాని హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌క‌టించింది.హైద‌రాబాద్, రంగారెడ్డి, మేడ్చ‌ల్–మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెద‌క్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మ‌ల్, నిజామాబాద్, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్‌, నాగ‌ర్‌ క‌ర్నూల్, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌ పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో రాబోయే 48 గంట‌ల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు.

అప్రమత్తంగా ఉండండి : ఐఎండీ
భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఐఎండీ అధికారులు సూచించారు.ఉరుములు, మెరుపులు సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని, గంట‌కు 30 నుంచి 40 కిలో మీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెప్పారు.నైరుతి రుతుపవనాల సమయంలో ఇప్పటివరకు హైదరాబాద్‌లో సాధారణ 589.5 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను 820.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.హైదరాబాద్‌లో పిడుగులు పడే అవకాశముందని ఐఎండీ అధికారులు చెప్పారు.

ఎల్లో అలర్ట్
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సూచనల కారణంగా ఐఎండీ హైదరాబాద్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.హైదరాబాద్‌లో సెప్టెంబర్ 28 వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది.రానున్న మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సాధారణం కంటే పెరిగిన వర్షపాతం
నైరుతి రుతుపవనాల సమయంలో తెలంగాణ సగటు వర్షపాతం 948.2 మిల్లీమీటర్ల నమోదైంది.సాధారణ వర్షపాతం 717.3 మిల్లీమీటర్లతో పోలిస్తే-32 శాతం పెరిగింది.మంగళవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 129.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.హైదరాబాద్‌లో అత్యధికంగా ముషీరాబాద్‌లో 47.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేయడంతో ఈ నైరుతి రుతుపవనాల మొత్తం వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉంది.

లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా చర్యలు తీసుకోండి : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి
వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వరద నిలువకుండా చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. వర్షాల సమయంలో నీరు నిలిచే చోట శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు.ఇంజనీరింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి నివేదిక అందజేయాలని ఆమె సూచించారు.


Tags:    

Similar News