‘సైబర్ ఫ్రాడ్’ పై తెలంగాణలో ఫిర్యాదు చేయాలంటే ఎంత కష్టమో...
సైబర్ మోసంపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేస్తే , ఫిర్యాదు తీసుకోకుండా వాళ్లకి చెప్పండి, వీళ్లకు చెప్పండని ఉచిత సలహాలు మాత్రం ఇస్తున్నారు.;
By : Saleem Shaik
Update: 2025-03-30 12:57 GMT
జాబ్ ముసుగులో సైబర్ మోసం చేసేందుకు యత్నించారని సాక్ష్యాధారాలతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే , సైబర్ నేరాలను నిరోధించాల్సిన పోలీసు అధికారులే ఫిర్యాదు నమోదు చేయకుండా తప్పించుకున్న సంఘటన నా అనుభవం లోకి వచ్చింది.
మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే చాలు...ఓ రికార్డెడ్ వాయిస్ మనకు వినిపిస్తుంది. ప్రస్తుతం సొసైటీలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. “సోషల్ మీడియా లేదా ..గుర్తు తెలియని గ్రూపుల నుంచి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావొచ్చు..బ్యాంకులు, పోలీసులు, వివిధ కంపెనీల పేర్లు చెప్పి మంచిగా మాట్లాడి అకౌంట్లలో డబ్బులన్నీ దోచేస్తున్నారు జాగ్రత్త, మీరు సైబర్ పోలీసలకు ఫిర్యాదు చేయండి’’ అంటూ కాలర్ ట్యూన్ వినిపిస్తుంది. కానీ వాస్తవానికి సైబర్ నేరాల బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఫిర్యాదు చేయడం ఫోన్ వాయిస్ విన్నంత సులభం కాదు.
ఉద్యోగమిప్పిస్తామని ఆశ చూపించి అమాయకుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు మాయం చేస్తున్న సంఘటనలు తెలంగాణలో నిత్యకృత్యంగా మారాయి. సైబర్ నేరాలను ముందుగా గుర్తించి ఫిర్యాదు చేస్తే , దీనిపై పట్టించుకొని, సైబర్ నేరగాళ్లపై చర్యలు తీసుకోవాల్సిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులే ప్రేక్షక పాత్ర పోషించి అసలు ఫిర్యాదును నమోదు చేయని సంఘటన ఇది.
- తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ నేరాలను అరికట్టేందుకు అద్భుతంగా పనిచేస్తుందని పోలీసు ఉన్నతాధికారులు ఢంకా బజాయించి చెప్పడంతో పాటు ఇటీవల తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు కేంద్రం నుంచి అవార్డులు కూడా పొందారు.
- కానీ ఆదివారం సైబర్ మోసం చేసే యత్నంపై ఫిర్యాదు చేస్తే సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులెవరూ చర్యలు తీసుకోవడం మాట దేవుడెరుగు, కనీసం ఫిర్యాదును నమోదు చేయకుండా తాత్సారం చేశారు. ఇలా అయితే తెలంగాణలో సైబర్ నేరాలకు అడ్డుకట్ట ఎలా పడుతుందన్నది సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులే చెప్పాలి.
జాబ్ పేరిట మోసం
ఆదివారం ఉదయం 10 గంటలకు ఫెడరల్ తెలంగాణ ప్రతినిధికి ఐహెచ్ సీఎల్ కంపెనీ ప్రతినిధి పల్లవి పేరిట ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ‘‘నా పేరు శ్రీమతి పల్లవి ఝా, నేను ఐహెఛ్ సీఎల్ (IHCL) కంపెనీ నుంచి మీతో కనెక్ట్ అయ్యాను.మా దగ్గర ఒక సులభమైన పని ఉంది, అది చేస్తే 203₹ జీతం పొందవచ్చు. ఇది గూగుల్ Google కి సమీక్షలు చేయడంలో సహాయం చేయడం గురించి అని, మీరు ఎన్ని పనులు చేస్తారనే దానిపై ఆధారపడి మీరు రోజుకు రెండు వేల రూపాయల నుంచి 8 వేల రూపాయల దాకా సంపాదించవచ్చు.నేను మీకు ఉద్యోగం,జీతం వివరాలను పంచుకోవచ్చా? ’’ అని మెసేజులో పేర్కొన్నారు.
ఐదు నక్షత్రాల హోటళ్లకు సమీక్ష పేరిట...
గూగుల్ మ్యాప్స్‌లో ఐదు నక్షత్రాల హోటళ్లకు సమీక్ష ఇవ్వడం ఈ పని అని,మీ రోజువారీ జీతం రూ. 2,000 నుంచి 8,000రూపాయల వరకు ఉంటుంది, ఇది మీరు పూర్తి చేసే పనుల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని ఉరిస్తూ మెసేజ్ పంపారు. మీరు ఒక పనిని పూర్తి చేసిన తర్వాత మీకు జీతం అందుతుందని,ఆ తర్వాత మరో పని వస్తుంది.
దీన్ని ప్రారంభించడానికి, నేను మీకు ఒక ట్రయల్ టాస్క్ ఇస్తాను, 5 నక్షత్రాల సమీక్ష ఇవ్వండి, మీ జీతాన్ని ధృవీకరించడానికి నాకు స్క్రీన్‌షాట్ పంపండి’’ అంటూ మెసేజ్ చేశారు. తాము భారత ప్రభుత్వ విభాగం కింద తాము పనిచేస్తున్నామని,మీరు మేం పంపిన లింకులపై క్లిక్ చేస్తే వందశాతం వాస్తవంగా ఉద్యగం ఇస్తామని, మమ్మల్ని నమ్మండి, మేం సైబర్ మోసగాళ్లం కామని సదరు ప్రతినిధి పల్లవి మెసేజులో చెప్పడం విశేషం.
సైబర్ విభాగం ఇన్ స్పెక్టర్ ఉచిత సలహా
ఈ సైబర్ మోసం యత్నం గురించి సదరు ప్రతినిధి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్ స్పెక్టర్లు డి ఆశిష్ రెడ్డి, బి రమేష్ లకు సవివరంగా ఫిర్యాదు చేస్తే, ఇందులో ఇన్ స్పెక్టరు రమేష్ స్పందించారు. మీ ఫిర్యాదును వాట్సాప్ ద్వారా 87126 72222 నంబరుకు పంపించండి అంటూ సమాధానం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత సదరు నంబరుకు ఫిర్యాదు చేస్తే వారు అంతా చూసిన తర్వాత మీరు కేంద్ర సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదు చేయమని ఉచిత సలహా ఇచ్చారు.
మోసమని తెలిసినా చర్యలేవి?
సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరో ఇన్ స్పెక్టర్ ఆశిష్ రెడ్డి స్పందిస్తూ సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీకి వాట్సాప్ నంబర్ 8712672222 కుద్వారా ఫిర్యాదు చేయమని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం ఫిర్యాదు చేసినా వారి నుంచి స్పందన మాత్రం లేదు. ‘‘ఇది ఉద్యోగం ముసుగులో మోసపూరిత ఆఫర్ అని మీకు తెలుసు, మీరు ఎటువంటి నిధులను బదిలీ చేయలేదు కాబట్టి, ఈ సంఘటన గురించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 'సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీ' వాట్సాప్ నంబర్ 8712672222 కు ఫిర్యాదు చేయమని ఇన్ స్పెక్టర్ ఆశిష్ రెడ్డి సూచించారు.
స్థానిక పోలీసులను సంప్రదించండి అంటూ డీఎస్పీ సలహా
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీ కేవీఎం ప్రసాద్ మరో ఉచిత సలహా ఇచ్చారు. ‘‘నేను హైదరాబాద్‌లోని సైబర్ సెక్యూరిటీ విభాగం హెడ్ క్వార్టర్సులోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ తెలంగాణ సైబర్ సెక్యూిటీ బ్యూలో స్టేషన్ హౌస్ ఆఫీసరునని, తాము రూ.3 కోట్ల కంటే ఎక్కువ నష్టం జరిగిన మోసాలను మాత్రమే తాము పరిశీలిస్తామని సమాధానం ఇచ్చి చేతులు దులుపుకున్నారు.‘‘మీరు దయచేసి స్థానిక పోలీసులను సంప్రదించండి. ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అని సమాధానం ఇచ్చారు.
సైబర్ మోసాలకు తెర వేసేదెన్నడు ?
జాబ్స్ ఇప్పిస్తామంటూ తెలంగాణ రాష్ట్రంలో జోరగా సాగుతున్న మోసాలకు తెరవేయాలనే సంకల్పంతో మీడియా ప్రతినిధి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేస్తే వేరే వారికి ఫిర్యాదు చేయమని ఒకరిపై మరొకరు ఉచిత సలహాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారే, కానీ అసలు ఈ సైబర్ మోసం యత్నంపై చర్యలు తీసుకోలేదు. ఇదీ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరు..హోంశాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని తెలంగాణలో పెచ్చుపెరిగిపోతున్న సైబర్ నేరాలకు తెరవేసేందుకు వీలుగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని బలోపేతం చేయాలని సైబర్ బాధితులు కోరుకుంటున్నారు.