ఒక్క కాల్ తో ఖేల్ ఖతం దుకాణ్ బంద్

హైదరాబాద్ చుడిబజార్ వ్యాపారికి రూ 5. 41 లక్షల టోకరా;

Update: 2025-08-14 14:19 GMT

హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రకం మోసాలకు తెగబడుతున్నారు. నేరాలు ఆగడం లేదు నేర స్వరూపాలు మారుతున్నాయి. సైబరాసురులు తమ మెదడుకు పదును పెడుతూ ప్రజల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ కోవలోనే పాతబస్తీ చుడిబజార్ కు చెందిన వ్యాపారి నుంచి ఏకంగా ఐదున్నర లక్షలు కొట్టేసారు సైబర్ నేరగాళ్లు. బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.

గుర్తు తెలియని వ్యక్తుల నెంబర్ల నుంచి ఫోన్ వస్తే అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు పదే పదే చెబుతున్నప్పటికీ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ప్రజలు కోట్లాది రూపాయలు కోల్పోతున్నారు. . బిర్లా పెయింట్‌ డిస్ట్రిబ్యూటరీ కోసం చుడిబజార్‌కు చెందిన వ్యాపారి ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేశాడు. ఇది తెలుసుకున్న సైబర్‌నేరగాళ్లు.. ఓపస్‌ బిర్లా పెయింట్‌ డిస్ట్రిబ్యూటర్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ఫోన్‌ నెంబరు, వివరాలు ఇచ్చారు. అందులోని ఫోన్‌ నెంబర్‌కు బాధితుడు ఫోన్‌ చేశాడు. డిస్ట్రిట్యూటర్‌గా నమోదు కావాలంటే రిజిస్ట్రేషన్‌, డెలివరీ, ఇతర ఖర్చుల పేరుతో రూ.5.41లక్షలు తమ ఖాతాకు బదిలీ చేయాలని సైబర్ నేరగాళ్లు బాధితుడికి చెప్పారు.

సైబర్ నేరగాళ్లు చెప్పినట్టే బాధితుడు తలూపాడు. యుపిఐ చెల్లింపుల ద్వారా పెద్ద మొత్తంలో బదిలీ చేశాడు. ఈ విషయం ఇపుడే చెబితే డిస్ట్రిబ్యూషన్ షిప్ క్యాన్సిల్ అవుతుందని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు సైబర్ నేరగాళ్లు. అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ నేరగాళ్లకు మరో మారు ఫోన్ చేయగానే సైబర్ నేరగాళ్ల నుంచి స్పందన రాలేదు. మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు.

రోజురోజుకు పెరుగుతున్న నేరాలు

సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పాలకులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. మరోవైపు కొత్త పంథాలో సైబర్‌ నేరగాళ్లు అమాయకులను చీటింగ్ చేస్తున్నారు. అలా గతేడాది దేశవ్యాప్తంగా ప్రజల నుంచి రూ.22,845.73 కోట్లను సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టారని కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ మొత్తం దాదాపు 206 శాతం ఎక్కువే.

‘‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ , సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 2024లో సైబర్ మోసాల కారణంగా ప్రజలు రూ.22,845.73 కోట్లు పోగొట్టుకున్నారు. 2023లో ఈ నష్టం రూ.7,465.18 కోట్లుగా ఉంది’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ గత నెల లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. సైబర్‌ నేరాలకు సంబంధించి 2022లో 10,29,026 కేసులు, 2023లో 15,96,493, 2024లో 22,68,346 కేసులు నమోదయ్యాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి.

ఇప్పటివరకు 9.42 లక్షలకు పైగా సిమ్ కార్డులు కేంద్రం బ్లాక్ చేసింది. ఈ సిమ్ నెంబర్లపైనే సైబర్‌ నేరగాళ్లు ప్రజలను దోచుకుంటున్నారు. నేరస్థుల లొకేషన్ గుర్తించేందుకు తీసుకొచ్చిన ‘ప్రతిబింబ్’ ద్వారా 10,599 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు తమ నేరాలను ఆపడం లేదు.

Tags:    

Similar News