మెదక్ జిల్లా పరిషత్ మీటింగ్ కు హాజరైన ఇందిర
1980లో మెదక్ ఎంపీగా గెలిచి ప్రధాని అయిన ఇందిర జిల్లా పరిషత్ మీటింగులకు కూడా హాజరయ్యేవారు.
దేశానికి ప్రధానమంత్రి అంటే ఊపిరికూడా తీసుకోలేనంత బిజీగా ఉంటారని అందరికీ తెలిసిందే. రోజువారి పనులు చక్కబెట్టడానికి 24 గంటల సమయం కూడా సరిపోదన్నట్లుగా ఉంటుంది డైలీ షెడ్యూల్. అంతటి హోదాలో ఉండికూడా మామూలుగా జరిగే జిల్లా పరిషత్ సమావేశానికి ఒక ప్రధానమంత్రి హాజరయ్యేవారంటే ఎవరైనా నమ్ముతారా ? కాని నమ్మితీరాల్సిందే. ఎందుకంటే ప్రధానమంత్రిగా పనిచేసిన ఇందిరాగాంధి జిల్లా పరిషత్ సమావేశానికి హాజరయ్యారు కాబట్టి. 1980లో మెదక్ ఎంపీగా గెలిచి ప్రధాని అయిన ఇందిర జిల్లా పరిషత్ మీటింగులకు కూడా హాజరయ్యేవారు. 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిర ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలి, ఉమ్మడి ఏపీలోని మెదక్ నియోజకివర్గాల నుండి పోటీచేశారు.
రెండు నియోజకవర్గాల్లోను గెలిచిన ఇందిర తమ కుటుంబానికి కుంచుకోటైన రాయ్ బరేలీకి రాజీనామా చేసి మెదక్ ఎంపీగానే కంటిన్యు అయ్యారు. ఆ సమయంలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశాల్లో కొన్నింటికి హాజరయ్యారు. ఒక ప్రధానమంత్రి జిల్లా పరిషత్ సమావేశానికి హాజరయ్యారంటే ఎవరైనా నమ్ముతారా ? ఇప్పటి కాలమాన పరిస్ధితుల్లో ప్రధానమంత్రి షెడ్యూల్ ను చూస్తున్న జనాలు అప్పటి పరిస్ధితులను భేరీజు వేసుకోలేరు. జిల్లా పరిషత్ సమావేశానికి జిల్లాలోని అందరు ప్రజాప్రతినిధులు ఎంఎల్ఏలు, ఎంపీలను ఆహ్వానిస్తారు. కాబట్టి దేశానికి ప్రధానిగా ఉన్నా, మెదక్ ఎంపీ హోదాలో ఇందిరా గాంధి జిల్లా పరిషత్ సమావేశాల్లో కొన్నింటికి హాజరయ్యారు. హాజరవ్వటమే కాకుండా తన నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తావించటంతో పాటు జిల్లాలోని ఎంపీ, ఎంఎల్ఏలు చెప్పే సమస్యలను నోట్ చేసుకునేవారు. సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన సమస్యలను కలెక్టర్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ఫాలో అప్ చేసేవారు. ఎంపీగా జిల్లా అభివృద్ధికి పెద్ద పీటవేశారు.
దురదృష్టవశాత్తు మెదక్ ఎంపీ, ప్రధానిగా ఉన్నపుడే ఇందిరను ఆమె అంగరక్షకులు హత్యచేశారు. 1980 ఎన్నికలో ఇందిరకు 3,01,577 ఓట్లొచ్చాయి. జనతాపార్టీ తరపున పోటీచేసిన ఎస్. జైపాల్ రెడ్డికి 82,543 ఓట్లు, జనతాపార్టీ సెక్యులర్ తరపున పోటీచేసిన కేశవరావు జాదవ్ కు 26,149 ఓట్లు పోలయ్యాయి. పోలైన మొత్తం 4,58,263 ఓట్లలో ఇందిరకు 65.8 శాతం రావటం కూడా అప్పట్లో చాలా గొప్పనే చెప్పాలి. మేథమేటిక్స్ జీనియస్ గా పేరున్న శంకుతలా దేవి, పీవీ నరసింహారావు కొడుకు పీవీ రాజేశ్వరరావు లాంటి మొత్తం 10 మంది పోటీచేశారు. అప్పటి ఎన్నికల్లో ఇందిర తరపున బాగారెడ్డి ప్రచార, గెలుపు బాధ్యతలను భుజనావేసుకున్నారు. ఎప్పుడైతే ప్రచార బాధ్యతలను ఇందిర మోపారో వెంటనే మంత్రిగా బాగారెడ్డి రాజీనామా చేశారు. బాగారెడ్డి అంటే ఇందిరకు అంత నమ్మకంగా ఉండేది.
తర్వాత అంటే చాలా సంవత్సరాలకు 1991లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రయ్యారు. ఎవరైనా తెలుగు నేలనుండి ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఎవరని అడిగితే చాలామంది చెప్పే పేరు పీవీదే. కాని పీవీకన్నా ముందే ఇందిర ప్రధానమంత్రి అయిన విషయాన్ని మరచిపోతారు. మెదక్ ఎంపీగా ఇందిర 1980లో గెలిచి ప్రధానమంత్రి అయితే తర్వాతే 1991లో పీవీ ప్రధాని అయి నంద్యాల నుండి ఎంపీగా గెలిచారు.