తెలంగాణకు రు. 3 లక్షల కోట్ల పెట్టుబడులు

మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి అనేక సాఫ్ట్ వేర్ దగ్గజ కంపెనీలు తమ క్యాంపసులను విస్తరిస్తున్నట్లు చెప్పాడు.;

Update: 2025-05-12 09:43 GMT
Revanth

తెలంగాణకు గడచిన 15 మాసాల్లో రు. 3 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షకు పైగా కొత్త ఉద్యోగాలు సృష్టించినట్లు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) చెప్పాడు. నానక్ రామ్ గూడలో సొనాట సాఫ్ట్ వేర్(Sonata Software) అత్యాధునిక ఏఐ సెంటర్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతు, హైదరాబాద్(Hyderabad) మహానగరం సాఫ్ట్ వేర్ తో పాటు లైఫ్ సైన్సెస్ రంగాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ గా మారిందన్నారు. అలాగే ఏఐ డేటా సెంటర్లు, తయారీరంగాలకు కూడా కేంద్రంగా మారుతోందన్నారు. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి అనేక సాఫ్ట్ వేర్ దగ్గజ కంపెనీలు తమ క్యాంపసులను విస్తరిస్తున్నట్లు చెప్పాడు.

తెలంగాణ ప్రజాప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్ధులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమ కోసం పనిచేస్తునే పరిశ్రమల ఏర్పాటుకు మద్దతిస్తు ఆర్ధిక వ్యవస్ధను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పాడు. 2025 దావోస్(Davos) పర్యటనలో రు. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి దేశంలోనే తెలంగాణను నెంబర్ 1 గా నిలిపినట్లు రేవంత్ చెప్పాడు. 66 లక్షల మహిళలకు స్వయం సహాయకబృందాల ద్వారా సాధికారత, రాజీవ్ యువవికాసం ద్వారా యువ వ్యాపారులు, స్వయం ఉపాధికి అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తున్నట్లు వెల్లడించారు.

డ్రైపోర్టు నిర్మాణం, ఏపీలోని ఓడరేవులతో అనుసంధానం, ఫ్యూచర్ సిటీలో ఏఐ నగరం, యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే గొప్ప ఈవెంట్లలో ఒకటైన మిస్ వరల్డ్-2025(Miss World-2025) నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశాడు. తెలంగాణ రైజింగ్ కార్యాచరణ ద్వారా ఆర్ధికాభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌళిక సదుపాయాల కల్పన, సంక్షేమం సమతుల్యంగా సాగుతోందన్నారు. కాబట్టి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలందరు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని రేవంత్ విజ్ఞప్తిచేశాడు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రేవంత్ చెప్పిందంతా జరుగుతుంటే సంతోషించాల్సిన విషయమే. అయితే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి, లక్షలాది ఉద్యోగాలకల్పన జరుగుతున్నపుడు ఇంకా బీదమాటలు ఎందుకు మాట్లాడుతున్నట్లు ? ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమ్మె పిలుపుపై ఆమధ్య రేవంత్ మాట్లాడుతు తెలంగాణ ఆర్ధిక పరిస్ధితిని వివరించిన విషయం తెలిసిందే. ఆసమయంలో రేవంత్ మాట్లాడుతు తెలంగాణకు ఎక్కడా పైసా కూడా అప్పుపుట్టడంలేదన్నాడు. ప్రభుత్వాన్ని నమ్మి ఏబ్యాంకు కూడా అప్పు ఇవ్వటంలేదన్నాడు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు+ఉద్యోగుల జీత, బత్యాలు, పెన్షన్ల చెల్లింపుకు ప్రతినెల 30 వేల కోట్ల రూపాయలు అవసరమైతే వస్తున్న ఆదాయం రు. 18,500 కోట్లు మాత్రమే అన్నాడు.

తనను కోసినా రూపాయి అప్పుపుట్టడంలేదని సెంటిమెంట్ డైలాగులు కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. అప్పులు, ఆదాయం విషయంలో అప్పుడు రేవంత్ చెప్పింది నిజమా ? లేకపోతే లక్షలకోట్లు పెట్టుబడులు వస్తున్నది, తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లు ఇపుడు చెప్పింది నిజమా ? అన్నదే అర్ధంకావటంలేదు. లక్షల కోట్లరూపాయల పెట్టుబడులువచ్చి, అభివృద్ధిలో దూసుకుపోతున్నదే నిజమైతే ప్రభుత్వ ఆదాయం కూడా పెరగాలి కదా ? కాని ఆమధ్య రేవంత్ మాట్లాడుతు ప్రభుత్వ నెలసరి ఆదాయం పెంచేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా రు. 18,500 కోట్లకన్నా పెరగటంలేదని ఎందుకు చెప్పాడో అర్ధంకావటంలేదు.

Tags:    

Similar News