రేవంత్ కొత్త లోకాన్ని సృష్టించబోతున్నారా ?

రేవంత్ రెడ్డి పదేపదే చెబుతున్న ఫోర్త్ సిటి(ఫ్యూచర్ సిటీ) నిర్మాణం మొదలైతే జనాలు సైబరాబాద్ ను పట్టించుకోరని కచ్చితంగా చెప్పచ్చు.

Update: 2024-09-22 04:49 GMT
Revanth

ఇపుడు ఎవరైనా బయటవ్యక్తులు హైదరాబాద్ లోని హైటెక్ సిటి, గచ్చిబౌలి ప్రాంతాల్లో తిరిగితే ఇండియాలోనే ఉన్నామా అనే సందేహాన్ని వ్యక్తంచేస్తారు. ఎందుకంటే హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని వాతావరణం ఒకరకంగా ఉంటే సైబరాబాద్ లోని వాతావరణం మరోరకంగా ఉంటుంది. సైబరాబాద్ లో తిరిగే వ్యక్తులు విశాలమైన రోడ్లకు రెండువైపులా ఉన్న ఆకాశహర్మాలు, రెస్టారెంట్లు, మల్టిప్లెక్సులు తదితరాలను చూసి ఆశ్చర్యపోతారు. వీటిని చూసిన జనాలకు తాము ఇండియాలోనే ఉన్నామా అనే సందేహం రావటంలో ఆశ్చర్యమేమీలేదు. సైబరాబాద్ లోని హైటెక్ సిటీ, గచ్చీబౌలీ ప్రాంతాలను తలదన్నే మరో కొత్తలోకం తొందరలోనే జనాల ముందు నిలబడబోతోంది. రేవంత్ రెడ్డి పదేపదే చెబుతున్న ఫోర్త్ సిటి(ఫ్యూచర్ సిటీ) నిర్మాణం మొదలైతే జనాలు సైబరాబాద్ ను పట్టించుకోరని కచ్చితంగా చెప్పచ్చు.

ఎందుకంటే ఫోర్త్ సిటీ నిర్మాణంకోసం రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ప్రాణాళికలను చూస్తే కళ్ళు తిరిగిపోవటం ఖాయం. చేవెళ్ళ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని ముచ్చర్ల ఏరియాలో సుమారు 25 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీని ఏర్పాటుచేయాలని రేవంత్ చాలా పట్టుదలగా ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే రేవంత్ చాలాసార్లు బహిరంగంగానే ప్రకటించారు. సేకరించబోయే 25 వేల ఎకరాల్లో 15 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీ(ఫ్యూచర్ సిటీ) నిర్మాణం ఉండబోతోందని సమాచారం. ఈ కొత్తలోకంలో విద్య, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, పర్యాటకం అని నాలుగు జోన్లుగా ప్రభుత్వం వర్గీకరించింది. 5 వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీలకు సంబంధించిన పరిశోన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) కేంద్రాలు, వెయ్యి ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ సిటి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఫాక్స్ కాన్ కంపెనీ గనుక సెంటర్ ను ఏర్పాటు చేయటానికి అంగీకరిస్తే ఆ కంపెనీకి కూడా ఫోర్త్ సిటీలోని అవసరమైన భూమిని కేటాయించాలని డిసైడ్ అయ్యింది. మరో వెయ్యి ఎకరాల్లో అచ్చంగా జపాన్ కంపెనీలకే భూములు కేటాయించబోతోంది.

ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచదేశాల్లోని దిగ్గజ కంపెనీ తమ కేంద్రాలను ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేసేట్లుగా రేవంత్ ప్రభుత్వం సకల సదుపాయాలను ఏర్పాటు చేయబోతోంది. పైన చెప్పిన నాలుగు జోన్లు ప్రపంచప్రసిద్ధిచెందిన కంపెనీలతో నిండిపోవాలని రేవంత్ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నది. ఇన్ని కంపెనీలు ఏర్పాటైన తర్వాత వాటిల్లో పనిచేసే, ఉండే జనాల అవసరాలు తీర్చేట్లుగా రెస్టారెంట్లు, రిక్రియేషన్ సెంటర్లు, మల్టీప్లెక్సులు ఏర్పాటు చేయకుండా ఉంటారా ? ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి రేవంత్ శంకుస్ధాపన చేసిన విషయం తెలిసిందే. ఫోర్త్ సిటీలోని అత్యంత అధునాతన, అతిపెద్ద స్టేడియం నిర్మించేందుకు బోర్డాఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఇప్పటికే ప్రభుత్వానికి స్ధలం కోసం ప్రతిపాదనలు అందించింది.

ఈ ఫోర్త్ సిటీని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇతర ప్రాంతాలతో పాటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తు అతి విశాలమైన రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అలాగే హైటెక్ సిటీ(రాయదుర్గం)తో పాటు ఇతర ప్రాంతాల నుండి ఫోర్త్ సిటీ వరకు మెట్రో రైలు మార్గాన్ని కూడా నిర్మించబోతున్నారు. ఫార్మాసిటీలో అవసరమైన భూమిని కేటాయించాలని ఇప్పటికే 300 కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. హోలుమొత్తంమీద వివిధ కంపెనీలు, రిక్రియేషన్ కేంద్రాలు తదితరాలన్నింటిలో కలిపి సుమారు 2.5 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నది. రేవంత్ ప్లాన్ అనుకున్నది అనుకున్నట్లు అమల్లోకి వస్తే మరో నాలుగేళ్ళల్లోనే సైబరాబాద్ ను తలదన్నేట్లుగా మరో కొత్త లోకం ఏర్పాటవ్వటం ఖాయమనే అనిపిస్తోంది.

Tags:    

Similar News