మొత్తానికి బీజేపీ, కాంగ్రెస్ ఏకమయ్యాయా ?
ఉప్పు నిప్పుగా ఉండే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏకమయ్యాయా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ ఏ విషయంలో ?
ఉప్పు నిప్పుగా ఉండే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏకమయ్యాయా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ ఏ విషయంలో పై రెండుపార్టీలు ఏకమయ్యాయంటే టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో కాంగ్రెస్, బీజేపీలు రెండూ బాధిత పార్టీలే అన్న విషయం బయటపడుతోంది. రోజులు గడిచేకొద్ది ట్యాపింగ్ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈవిషయమై రేవంత్ రెడ్డి ఇప్పటివరకు నోరుమెదపలేదు. అయితే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీయార్ పాలనసైనే పదేపదే ట్యాపింగ్ ఆరోపణలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
కేంద్రమంత్రి, తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అండ్ కో మాత్రం ట్యాపింగ్ లో కీలక నిందితుడు కేసీయారే అని గట్టిగా ఆరోపిస్తున్నారు. కిషన్ రెడ్డితో పాటు మెదక్ ఎంపీ అభ్యర్ధి రఘునందనరావు కూడా కేసీయార్, హరీష్ రావు, కవితలపై కేసులు నమోదుచేసి విచారణ చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. పనిలోపనిగా ట్యాపింగ్ అంశంలో మొదటి బాధితుడు రేవంత్ రెడ్డి అయితే రెండో బాధితుడిని తానే అంటున్నారు. అంటే ట్యాపింగ్ అంశంలో కేసీయార్ కు వ్యతిరేకంగా తమతో పాటు రేవంత్ ను కూడా బీజేపీ కలుపుకుంటోందనే అనుకోవాలి. కిషన్ మీడియాతో మాట్లాడుతు తమపార్టీలో ప్రతి ఒక్కరి ఫోన్నును కేసీయార్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందని మండిపడ్డారు. రియాల్టర్లు, వ్యాపారస్తులతో పాటు పారిశ్రామికవేత్తల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయించి బ్లాక్ మెయిల్ చేసినట్లు కిషన్ తీవ్రంగా ఆరోపించారు.
కేసీయార్ పైన కూడా కేసు నమోదుచేయాలి
విచారణను పోలీసు అధికారుల పాత్రకే పరిమితం చేయకుండా కేసీయార్, హరీష్, కవిత, వెంకట్రామరెడ్డిపైన కూడా కేసులు నమోదుచేసి అదుపులోకి తీసుకోవాలని కిషన్, రఘుతో పాటు కాంగ్రెస్ నేతలు పదేపదే డిమాండ్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంఎల్ఏ యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతు తనతో పాటు కుటుంబసభ్యుల ఫోన్లను కూడా కేసీయార్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందని ఆరోపించారు. సీనియర్ నేత బక్కజడ్సన్ మాట్లాడుతు టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీయారే కింగ్ పిన్ అంటు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఏ విషయంలో అయినా కాంగ్రెస్, బీజేపీ మధ్య సంబంధాలు ఎలాగుంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటిది ఇపుడు ట్యాపింగ్ అంశంలో మాత్రం రెండుపార్టీల నేతలు కలిసి కేసీయార్ నే టార్గెట్ చేస్తున్నారు. అంటే కేసీయార్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలు కలిసినట్లుగానే చెప్పుకోవాలి. ఇప్పటివరకు ట్యాపింగ్ అంశంలో అరెస్టులు, విచారణ పోలీసు అధికారులకు మాత్రమే పరిమితమైంది. అలాంటిది తాజాగా మాజీమంత్రి యర్రబెల్లి దయాకరరావు పాత్రపైన కూడా ఆరోపణలు మొదలైయ్యాయి. వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో పోటీచేసిన యర్రబెల్లి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన యశస్వినీ రెడ్డి ఆమె అత్త ఝాన్సీరెడ్డి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయించారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.
ఎలాగంటే, అప్పట్లో ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఒక వార్ రూమ్ ను ఏర్పాటుచేసింది. ఈ నేపధ్యంలోనే గెలుపు అనుమానాస్పదమని లేదా కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్ధులు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో వాళ్ళఫోన్లను ట్యాప్ చేయించారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో యర్రబెల్లి కాంగ్రెస్ అభ్యర్ధి యశశ్వని చేతిలో ఓడిపోయారు. ఇపుడు ట్యాపింగ్ ఆరోపణల్లో అరెస్టయిన డీఎస్పీ ప్రణీత్ రావు పాలకుర్తిలో యాక్టివ్ గా కనిపించారట. ఇదే విషయమై యర్రబెల్లి మాట్లాడుతు ట్యాపింగ్ అంశంతో తనకు ఎలాంటి సంబంధంలేదన్నారు. ప్రణీత్ రావు ఎవరో తనకు తెలీదని చెప్పారు. ఎవరికి వాళ్ళు ట్యాపింగ్ అంశంతో తమకు సంబంధంలేదనే అంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.