హరీష్ కు లైన్ క్లియర్ అయినట్లేనా ?

ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను వెంటనే ప్రారంభించాలనే డిమాండుతో హరీష్(Harish) పాదయాత్ర చేయాలని నిర్ణయించారు.;

Update: 2025-02-13 06:20 GMT
Harish Rao

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు పాదయాత్రకు లైన్ క్లియర్ అయినట్లేనా ? ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను వెంటనే ప్రారంభించాలనే డిమాండుతో హరీష్(Harish) పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. అయితే పాదయాత్రను ఎప్పుడు ప్రారంభించాలనే విషయంలో కాస్త అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు, స్ధానికసంస్ధల ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో తెలీదు కాబట్టి పై రెండు విషయాల్లో క్లారిటి వచ్చిన తర్వాత తన పాదయాత్రకు ముహూర్తం పెట్టుకోవాలని హరీష్ అనుకున్నారు. తాజా అప్ డేట్స్ ప్రకారం స్ధానికసంస్ధల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశంలేదని తెలుస్తోంది.

ఎందుకంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆమధ్య జరిగిన కులగణన(Cast census) సర్వేను మరోసారి చేయించాలని రేవంత్ రెడ్డి(Revanth) డిసైడ్ అయ్యారు. మొత్తం సర్వే కాదుకాని అప్పట్లో 3.5 లక్షల కుటుంబాల్లోని సుమారు 16 లక్షలమంది సర్వేకి దూరంగా ఉన్నారు. వివిధ కారణాలతో అప్పట్లో సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించారు. ఆ 3.5 లక్షల కుటుంబాల వివరాలు సేకరించేందుకు మరోసారి సర్వే చేయాలని రేవంత్ ఆదేశించారు. ఈనెల 16వ తేదీన సర్వే మొదలై 28వ తేదీతో ముగించాలని డేట్స్ కూడా డిసైడ్ చేశారు. కులగణన సర్వే జరుగుతున్నపుడు స్ధానికసంస్ధల ఎన్నికలు జరిగే అవకాశంలేదు. అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చిలో మొదలవుతాయి. ఈ సమావేశాలు సుమారు 15 రోజులు జరుగుతాయి. అసెంబ్లీ జరుగుతున్నపుడు ఎన్నికలు జరగవు. అంటే మార్చినెల బడ్జెట్ సమావేశాలకు సరిపోతుంది. ఇదేసమయంలో అంటే మార్చి 18వ తేదీన పదవ తరగతి పరీక్షలు అయిపోయిన తర్వాతి మిగిలిన తరగతుల పరీక్షలు జరుగుతాయి. కాబట్టి పరీక్షలు జరుగుతున్నపుడు ఎన్నికలు జరగవు.

అంటే కులగణన, బడ్జెట్ సమావేశాలు, పిల్లల పరీక్షల కారణంగా మార్చిలో స్ధానికసంస్ధల ఎన్నికలు జరగవని అర్ధమవుతోంది. తర్వాత ఏప్రిల్-మే నెలలో ఎన్నికలు జరపవచ్చు. అయితే ఈ రెండునెలల్లో మాడుపగిలిపోయేంత ఎండలుంటాయి. అంతఎండల్లో ఎన్నికలు నిర్వహించటమూ కష్టమే, అభ్యర్ధులు, నేతలు ప్రచారం చేయటమూ కష్టమే. పైగా అంతటి ఎండలంటే మంచినీటి ఎద్దడితో ఇబ్బందిపడే ప్రాంతాలుంటాయి. అలాగే విద్యుత్ సరఫరాకు అంతరాయాలు కూడా ఉంటాయి. కాబట్టి నీళ్ళు దొరక్క, విద్యుత్ కోతలతో జనాలు ప్రభుత్వంపై మండిపోతుంటారు. తెలిసి తెలిసి ప్రభుత్వంపై జనాల వ్యతిరేకతను రేవంత్ కోరుకుంటారా ?

కాబట్టి వేసవికాలం అయిపోయిన జూన్ తర్వాత వర్షాలు మొదలయ్యే కాలం కాబట్టి వాతావరణం కూడా సానుకూలంగానే ఉంటుందని అనుకోవాలి. వర్షాలు పడకపోయినా ఎండలైతే తగ్గిపోతాయి. అప్పుడు ఎన్నికల నిర్వహణకు అనువైన సమయంగా ప్రభుత్వం ఆలోచిస్తోందని సమాచారం. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే హరీష్ తన పాదయాత్రను ఈనెలలోనే మొదలుపెట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలాగూ హరీష్ పాదయాత్ర వారంరోజుల్లోపే పూర్తవుతుంది. సంగమేశ్వ, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి కేసీఆర్(KCR) 2022, ఫిబ్రవరి 21వ తేదీన శంకుస్ధాపన చేశారు. భూసర్వే కూడా జరిగిన తర్వాత నిర్మాణపనులు నిలిచిపోయాయి. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పై రెండు ప్రాజెక్టుల పనులు మొదలుకాలేదు. ఝరాసంగం మండలం కేతకి సంగమేశ్వర ఆలయం నుండి పాదయాత్ర ప్రారంభించి నారాయణఖేడ్ లోని బసవేశ్వర విగ్రహం దగ్గర పాదయాత్రను ముగించాలని హరీష్ ప్లాన్ చేస్తున్నారు.

పై రెండుప్రాంతాల మధ్య దూరం 130 కిలోమీటర్లు. రోజుకు15-20 కిలోమీటర్లు నడిచినా ఆరు లేదా ఏడురోజుల్లో పాదయాత్ర పూర్తయిపోతుంది. సంగారెడ్డి జిల్లాలోని ఆంథోల్, నారాయణఖేడ్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని 397 గ్రామాల్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు పై రెండు ప్రాజెక్టులను కేసీఆర్ టేకప్ చేశారు. పాదయాత్ర చేయటం ద్వారా పై నాలుగు నియోజకవర్గాల్లోని జనాల మద్దతు కూడగట్టుకోవాలని, ప్రభుత్వంపై బాగా ఒత్తిడితేవాలన్నది హరీష్ అసలు ఉద్దేశ్యం. ఇపుడు చేయబోయే పాదయాత్ర(Harish Padayatra) భవిష్యత్తులో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) గెలుపుకు ఉపయోగపడుతుందని హరీష్ భావిస్తున్నారు. మరి పాదయాత్ర తేదీలను హరీష్ ఎప్పుడు ప్రకటిస్తారు ? స్ధానికసంస్ధల ఎన్నికల్లో హరీష్ అనుకుంటున్నట్లు బీఆర్ఎస్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News