జూపార్కులో ఏనుగులకు జంబో విందు, ఎందుకంటే...

ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగులకు అధికారులు ససందైన విందు ఏర్పాటు చేశారు.;

Update: 2025-08-13 01:17 GMT
ఏనుగులకు జంబో విందు

ఇదీ హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కు...ఈ జూపార్కు ఆవరణలోకి అడుగు పెడుతుండగానే వనజ, ఆశా, సీత, విజయ్ ఏనుగులు విందు ఆరగిస్తూ తొండాన్ని ఊపుతూ కనిపించాయి....ఏమిటీ విశేషమంటే ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగులకు జూ అధికారులు జంబో విందు ఏర్పాటు చేశారు. ఏనుగులకు ముస్తాబు చేసి వాటికి ఇష్టమైన ఆహారాన్ని ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా అందించారు.




 జంబో విందులో ఏమున్నాయంటే...

హైదరాబాద్ జూపార్కులో మూడు ఆడ ఏనుగులు, ఒక మగ ఏనుగు ఉన్నాయి. వీటికి క్యాబేజీ, క్యారేట్, దోసకాయ, స్వీట్ కార్న్, బొప్పాయి, అరటిపండ్లు, పుచ్చకాయలు, ఆపిల్, ఫైన్ ఆపిల్, నారింజపండ్లు, ద్రాక్ష, చెరకు, కొబ్బరికాయలు ఇలా పలు రకాల పండ్లు, కూరగాయలతో పాటు వండిన బియ్యం, రాగిషా, పండ్లు, కూరగాయలతో ప్రత్యేకంగా చేసిన కేకులను ఏనుగులకు కొసరి కొసరి తినిపించారు.

ఏనుగుల వాకింగ్
ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా జూపార్కులోని ఏనుగులకు వాకింగ్ ఏర్పాటు చేశారు. వనజ, ఆశా, సీత, విజయ్ ఏనుగులను జూపార్కు ఆవరణలో మూడు కిలోమీటర్ల దూరం వాకింగ్ చేయించి జంబో విందు ఏర్పాటు చేశారు. ఏనుగులను బయట రోడ్డుపైకి తీసుకువచ్చారు.ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పించారు. వాకింగ్ చేసిన ఏనుగులు చెట్ల కొమ్మలను ఆరగించాయి. ఏనుగులను చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.


Tags:    

Similar News