కౌశిక్ దెబ్బకు బీఆర్ఎస్ డిఫెన్సులో పడిపోయిందా ?

పాడి చేసిన వ్యాఖ్యలను సమర్ధించలేక అలాగని బహిరంగంగా వ్యతిరేకించలేక పార్టీ నాయకత్వం ఇపుడు కిందా మీద అయిపోతోంది.

Update: 2024-09-13 08:54 GMT
Padi with KCR

బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఒకే ఒక్క మాట పార్టీని పూర్తిగా డిఫెన్సులోకి నెట్టేసింది. ఆవేశంలో అనాలోచింతగా మాట్లాడాడో లేకపోతే వ్యూహాత్మకంగా అన్నాడో తెలీదుకాని పాడి చేసిన వ్యాఖ్యలను సమర్ధించలేక అలాగని బహిరంగంగా వ్యతిరేకించలేక పార్టీ నాయకత్వం ఇపుడు కిందా మీద అయిపోతోంది. రాజకీయంగా ఒక్కో సందర్భంలో ఒక్కో పార్టీది పై చేయి అవుతుంటుంది. డిఫెన్సులో పడిన పార్టీ కాస్త ఓపికపడితే మళ్ళీ పై చేయిసాదించేందుకు అవకాశాలు దొరుకుతాయనటంలో సందేహంలేదు. ఇపుడు విషయం ఏమిటంటే గురువారం ఉదయం నుండి బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన మరో ఎంఎల్ఏ అరెకపూడి గాంధీకి మధ్య తీవ్రస్ధాయిలో మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.

గాంధీని అసెంబ్లీ స్పీకర్ పబ్లిక్ ఎకౌంట్స్ కమిటి(పీఏసీ) ఛైర్మన్ గా నియమించారు. దాంతో బీఆర్ఎస్ అగ్గిమీద గుగ్గిలమైపోయింది. బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన గాంధీని స్పీకర్ పీఏసీ ఛైర్మన్ గా ఎలా నియమిస్తారంటు హరీష్, పాడి తదితరులు రచ్చ రచ్చ చేశారు. వాళ్ళకి సమాధానంగా గాంధీ మాట్లాడుతు తాను కాంగ్రెస్ లో చేరలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నానని ప్రకటించారు. దాంతో బీఆర్ఎస్ లో అగ్గిరాజుకుంది. గాంధీ ప్రకటనకు పాడి స్పందించిన తీరు చాలా ఓవరుగా ఉందనే చెప్పాలి. గాంధీ నిజంగా బీఆర్ఎస్ లో ఉన్నది నిజమే అయితే తాను ఎంఎల్ఏ ఇంటికి వెళ్ళి పార్టీ జెండాను ఎగరేస్తానని, అక్కడి నుండి ఎంఎల్ఏని తీసుకుని కేసీఆర్ దగ్గరకు వెళతానంటు పెద్ద డ్రామా మొదలుపెట్టారు.

దాంతో గాంధీకి తీవ్రంగానే స్పందించారు. పాడి చెప్పినట్లుగా తనింటికి రాకపోతే తానే ఎంఎల్ఏ ఇంటికి వెళతానంటు జవాబిచ్చారు. పాడిని గురువారం ఉదయమే పోలీసులు ఇంటినుండి కదలనివ్వలేదు. దాంతో గాంధీ తన మద్దతుదారులతో ఎంఎల్ఏ ఇంటిమీదకు వెళ్ళి దాడి చేశారు. రాళ్ళు, కర్రలు, కోడిగుడ్లతో గాంధీ మద్దతుదారులు పాడి ఇంటిపై దాడిచేశారు. ఈ నేపధ్యంలోనే పాడి ఆవేశంగా కొన్ని మాటలు జారారు. అవేమిటంటే బతకటానికి ఆంధ్రానుండి తెలంగాణాకు వచ్చిన గాంధీ తనమీద దాడి చేస్తే తాను చూస్తూ కూర్చుంటానా ? అని అన్నారు. అలాగే గాంధీకి తెలంగాణా పవర్ అంటే ఏమిటో చూపిస్తానని సవాలు చేశారు. తన మీద గాంధీ+మద్దతుదారులు చేసిన దాడిని తెలంగాణా వాళ్ళపై ఆంధ్రా వాళ్ళ దాడిగా అభివర్ణించారు.

ఎప్పుడైతే వ్యక్తిగత గొడవలకు ఆంధ్రా-తెలంగాణా అంటు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కౌశిక్ రెడ్డి ప్రయత్నించారో విషయం పక్కదారి పట్టేసింది. పాడి ప్రాంతీయ విద్వేషం డైలాగులపై రేవంత్, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై రెచ్చిపోయారు. పాడికి గాంధీతో సమస్యుంటే వ్యక్తిగతంగా తేల్చుకోవాలి కాని ప్రాంతీయ విధ్వేషనాలను రెచ్చగొట్టడం ఏమిటంటు ఎదురుదాడికి దిగేశారు. పాడి వ్యాఖ్యలను కేసీఆర్ సమర్ధిస్తున్నారా ? లేకపోతే వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్లు చేస్తున్నారు. ఎంఎల్ఏ వ్యాఖ్యలు వ్యక్తిగతమైతే వెంటనే పాడిపై కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంఎల్ఏ మీద చర్యలు తీసుకోకపోతే పాడి వ్యాఖ్యలు పార్టీ పరంగా చేసినవే అని కేసీఆర్ అంగీకరించినట్లే అని అనుకోవాలంటు రేవంత్, మహేష్ తదితరులు పదేపదే మాట్లాడుతున్నారు.

ఇపుడు సమస్యంతా కేసీఆర్ కు చుట్టుకుంది. పాడి వ్యాఖ్యలను సమర్ధించలేక అలాగని బహిరంగంగా వ్యతిరేకించలేక పార్టీ మొత్తం ఇబ్బంది పడుతోంది. సమర్ధిస్తే రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎక్కడ ఎదురుదెబ్బ తగులుతుందో అనే భయం మొదలైంది. ఇదే సమయంలో ఎంఎల్ఏ వ్యాఖ్యలు వ్యక్తిగతమని ప్రకటిస్తే పార్టీ కోసం పోరాటం చేస్తున్న హార్డ్ కోర్ దూరమైపోతారు. కౌశిక్ లాంటి హార్డు కోరునే కేసీఆర్ దూరం చేసుకున్నపుడు ఇక తామెంత అనే నైరాశ్యం మిగిలిన నేతల్లో వస్తే మొదటికే మోసం వస్తుందనే ఆందోళన పార్టీ నాయకత్వంలో పెరిగిపోతోంది. అందుకనే కౌశిక్ ప్రాంతీయ విద్వేషపు వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ లాంటి సీనియర్లు ఎవరూ నోరుమెదపటంలేదు. దీంతోనే ఎంఎల్ఏ పార్టీని ఎంతలా డిఫెన్సులోకి నెట్టేశాడో అర్ధమైపోతోంది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా 39 సీట్లలో గెలిచిందంటే అది సీమాంధ్రుల ఓట్లతోనే సాధ్యమైందనే విషయం అందరికీ తెలిసిందే. గ్రేటర్ పరిధిలోని 24 సీట్లలో బీఆర్ఎస్ ఏకంగా 16 చోట్ల గెలిచింది. ఈ 16 సీట్లలో గెలుపుకు సీమాంధ్రుల ఓటర్ల మద్దతే కారణమని అందరికీ తెలుసు. అలాంటిది ఇపుడు పాడి చేసిన విద్వేషపు వ్యాఖ్యలతో సీన్ రివర్సు అవుతుందేమో అనే టెన్షన్ కారుపార్టీ నాయకత్వంలో కనబడుతోంది. ఇదే విషయాన్ని రేవంత్ మాట్లాడుతు ‘బీఆర్ఎస్ కు సీమాంధ్రుల ఓట్లు కావాలి కాని సీట్లు వద్దా’ అంటు నిలదీశారు. ‘ఒకపుడు గొప్పోడైన గాంధీ ఇపుడు బతకటానికి వచ్చిన ఆంధ్రోడు ఎలాగ అయిపోయార’నిటు రేవంత్ కేసీఆర్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. పాడి వ్యాఖ్యలపై రేవంత్ అండ్ కో ఫుల్లు రేంజిలో విరుచుకుపడుతుంటే సమాధానం చెప్పలేక కేసీఆర్ అండ్ మౌనం వహించటమే పార్టీ పరిస్ధితిని చెప్పేస్తోంది.

Tags:    

Similar News